logo

కేంద్రం తాటాకు చప్పుళ్లకు భయపడం: భట్టి

కేంద్రం తాటాకు చప్పుళ్లకు రాష్ట్రంలోని ఏ ఒక్క కాంగ్రెస్‌ కార్యకర్త భయపడబోరని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. చింతకానిలో సోమవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.

Updated : 07 May 2024 06:23 IST

చింతకానిలో అభివాదం చేస్తున్న డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రి పొంగులేటి,
అభ్యర్థి రఘురాంరెడ్డి, పక్కన పోతినేని, బాలసాని తదితరులు

చింతకాని, న్యూస్‌టుడే: కేంద్రం తాటాకు చప్పుళ్లకు రాష్ట్రంలోని ఏ ఒక్క కాంగ్రెస్‌ కార్యకర్త భయపడబోరని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. చింతకానిలో సోమవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని, రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి కావటం ఖాయమని జోస్యం చెప్పారు. భారాసకు ఓటేస్తే వృథా అవుతుందన్నారు. ఎన్నికల కోడ్‌ ముగియగానే అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పారు. ఆగస్టు 15 నాటికి రైతుల రుణాలను రూ.2లక్షల చొప్పున మాఫీ చేస్తామని పునరుద్ఘాటించారు. ఖమ్మం లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి రఘురాంరెడ్డిని గెలిపించాలని కోరారు. తనను గెలిపిస్తే అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రఘురాంరెడ్డి తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, సీపీఐ, సీపీఎం నాయకులు బాగం హేమంతరావు, పోతినేని సుదర్శన్‌, కాంగ్రెస్‌ నాయకుడు అంబటి వెంకటేశ్వరరావు, ఎంపీపీ కోపూరి పూర్ణయ్య పాల్గొన్నారు.

ఖమ్మం కమాన్‌బజార్‌, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆడపడుచులకు ప్రాధాన్యమిస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం నగరంలో జరిగిన మహిళా కాంగ్రెస్‌ ఆత్మీయ సమావేశంలో మాట్లాడారు. అతివలకు ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్‌ రాయితీ, విద్యుత్‌ బిల్లులు వంటి సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నామని చెప్పారు. భాజపా అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చుతుందని ఆరోపించారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తేనే పేదలకు మేలు జరుగుతుందన్నారు. హస్తం గుర్తుపై ఓటేసి రఘురాంరెడ్డిని గెలిపించాలని కోరారు. మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు మహ్మద్‌ జావేద్‌, డిప్యూటీ మేయర్‌ ఫాతిమా జోహ్రా, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మద్దినేని స్వర్ణకుమారి, విజయాబాయి, పగడాల మంజుల పాల్గొన్నారు. తుమ్మలగడ్డ సెంటర్‌ లో మైనార్టీల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పొంగులేటి మాట్లాడారు.

ఖమ్మం కమాన్‌బజార్‌: కాంగ్రెస్‌కు ఓటేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఆపార్టీ అభ్యర్థి రఘురాంరెడ్డి కోరారు. ఖమ్మంలోని ప్రసాద్‌ హైట్స్‌ అసోసియేషన్‌ ఆత్మీయ సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల వేళ రాములోరు, అయోధ్య అంటూ మత విద్వేషాలు రెచ్చగొట్టడం బాధాకరమన్నారు. డాక్టర్‌ కేశవరావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, నూకల నరేశ్‌రెడ్డి, దగ్గుబాటి ఆశ్రిత, మద్దినేని స్వర్ణకుమారి, ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మానుకొండ రాధాకిశోర్‌, కిలారు   వెంకటేశ్వరరావు, కార్పొరేటర్‌ మిక్కిలినేని మంజుల పాల్గొన్నారు.


కాంగ్రెస్‌తోనే అణగారిన వర్గాలకు న్యాయం: సీతక్క

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి సీతక్క, వేదికపై ఎమ్మెల్యే
కోరం కనకయ్య, మంత్రి తుమ్మల, ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్‌

కామేపల్లి: పేదల హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్‌ పార్టీ గెలవాలని మంత్రి సీతక్క అన్నారు. మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానం కాంగ్రెస్‌ అభ్యర్థి పోరిక బలరాంనాయక్‌ గెలుపును కాంక్షిస్తూ కొత్తలింగాలలో  నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. పదేళ్లపాటు భారాస, భాజపా చేసింది శూన్యమన్నారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా దేశ సంపదను ప్రైవేటుపరం చేస్తున్న ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందన్నారు. భారత రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్న భాజపాకు ఓటు ద్వారా గుణపాఠం చెప్పాలన్నారు. ఇక తానున్నప్పుడు రాష్ట్రం బాగున్నట్టు, కాంగ్రెస్‌ పాలనలో ఆగమైనట్టు మాజీ సీఎం కేసీఆర్‌ మాట్లాడుతున్నారని దెప్పిపొడిచారు. ఏ పదవి లేకున్నా దేశం ఐక్యత కోసం కష్టపడుతున్న రాహుల్‌గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యమన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ జిల్లా అభివృద్ధే లక్ష్యంగా పనిచేసేందుకు తనకు అవకాశం వచ్చిందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడి సీతారామ ప్రాజెక్టు మోటార్లను స్వాతంత్య్ర దినోత్సవం నాడు ప్రారంభించేలా బాధ్యత తీసుకుంటానన్నారు. భారాసకు చెందిన ఎంపీపీ సునీత, మాజీ సర్పంచి రాందాస్‌నాయక్‌తోపాటు పలువురు కాంగ్రెస్‌లో చేరారు. ఎమ్మెల్యే కోరం కనకయ్య వారికి పార్టీ కండువాలు కప్పారు. మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రాంరెడ్డి గోపాల్‌రెడ్డి, శ్రీచరణ్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, మంజుల, మల్లిబాబు యాదవ్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని