logo

పకడ్బందీ శిక్షణ.. ప్రజాస్వామ్యానికి రక్షణ

సార్వత్రిక సమరంలో అత్యంత కీలక ఘట్టమైన పోలింగ్‌ నిర్వహణకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. దేశ భవిష్యత్తు, అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించడంలో ప్రతి ఓటూ కీలకమవటంతో పోలింగ్‌ క్రతువులో అవకతవకలకు తావివ్వకుండా ఎన్నికల సంఘం జాగ్రత్తలు తీసుకుంటోంది.

Published : 07 May 2024 02:30 IST

ఈనాడు డిజిటల్‌, కొత్తగూడెం

సార్వత్రిక సమరంలో అత్యంత కీలక ఘట్టమైన పోలింగ్‌ నిర్వహణకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. దేశ భవిష్యత్తు, అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించడంలో ప్రతి ఓటూ కీలకమవటంతో పోలింగ్‌ క్రతువులో అవకతవకలకు తావివ్వకుండా ఎన్నికల సంఘం జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందుకోసం జిల్లా, శాసనసభ నియోజకవర్గ స్థాయి మాస్టర్‌ ట్రెయినీలను నియమించింది. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో పోలింగ్‌ సిబ్బందిని ఎంపిక చేసి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించింది. పోలింగ్‌ సిబ్బంది శిక్షణ విధానం, పోలింగ్‌ రోజు చేయాల్సిన, చేయకూడని పనుల వివరాలతో సమగ్ర కథనం.

జిల్లాకు ఇద్దరి చొప్పున మాస్టర్‌ ట్రెయినీలు

జిల్లా ఎన్నికల అధికారి (కలెక్టర్‌) సంబంధిత జిల్లాకు ఇద్దరి చొప్పున మాస్టర్‌ ట్రెయినీ (డిస్ట్రిక్ట్‌ లెవెల్‌ మాస్టర్‌ ట్రెయినీ)లను నియమిస్తారు. వీరిలో ఒకరు ఈవీఎంల టెక్నికల్‌ అంశాలు బోధిస్తారు. మరొకరు పోలింగ్‌ ప్రక్రియలో సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తారు. శిక్షకులుగా పనిచేసిన అనుభవం, ఎన్నికల నిర్వహణపై అవగాహన ఆధారంగా మాస్టర్‌ ట్రెయినీల నియామకం జరుగుతుంది. పోలింగ్‌ సిబ్బందికి మొదటి విడత శిక్షణ తరగతులను డీఎల్‌ఎంటీలు నిర్వహిస్తారు. అనంతరం ఒక్కో శాసనసభ నియోజకవర్గానికి నియమించిన ఏఎల్‌ఎంటీ(అసెంబ్లీ లెవెల్‌ మాస్టర్‌ ట్రెయినీ)లకు తర్ఫీదు ఇస్తారు. ఏఎల్‌ఎంటీలను సైతం జిల్లా ఎన్నికల అధికారే నియమిస్తారు. ఎన్నికల ప్రక్రియలో వారికి ఉన్న అనుభవం ఆధారంగా నియామకం జరుగుతుంది.

ముగిసిన రెండో విడత శిక్షణ

పోలింగ్‌ సిబ్బంది ఎంపిక అనంతరం ఆయా శాసనసభ నియోజకవర్గాల్లో తొలి విడత శిక్షణ తరగతులను డీఎల్‌ఎంటీల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆతర్వాత చేపట్టిన తొలి విడత ర్యాండమైజేషన్‌ ద్వారా సిబ్బంది పోలింగ్‌ విధులు నిర్వర్తించబోయే నియోజకవర్గాలను ఖరారు చేశారు. సిబ్బందికి కేటాయించిన నియోజకవర్గాల్లో ఇటీవల రెండో విడత శిక్షణ తరగతులు సంబంధిత ఏఎల్‌ఎంటీల ఆధ్వర్యంలో జరిగాయి. శిక్షణ పూర్తిచేసుకున్న సిబ్బందికి పోలింగ్‌కు ఒకరోజు ముందు రెండో విడత ర్యాండమైజేషన్‌ ద్వారా పోలింగ్‌ కేంద్రాలు నిర్ణయించనున్నారు.

గత ఎన్నికల్లో సిబ్బంది చేసిన పొరపాట్లు

  •  మాక్‌ పోల్‌ సమయంలో 50 ఓట్లు వేశాక కంట్రోల్‌ యూనిట్‌లో మొత్తం ఓట్లు చూడకుండా పోల్‌ ముగించటం.
  •  వీవీప్యాట్‌లోని మాక్‌పోల్‌ స్లిప్స్‌ తీయకుండా డ్రాప్‌ బాక్స్‌ మూసేసి ఓటింగ్‌ ప్రక్రియ మొదలుపెట్టడం.
  •  ఏదైనా కారణంతో వీవీప్యాట్‌ మార్చి మాక్‌ పోల్‌ నిర్వహించటం.
  •  పోస్టల్‌ బ్యాలెట్‌ పేపర్‌ వినియోగించినవారి వివరాలు ఫాం-17సీలో అసంపూర్తిగా ఉండటం.
  •  ఫాం-17సీలో పోలింగ్‌ కేంద్రంలోని మొత్తం ఓట్లు అనే కాలమ్‌లో ఈవీఎంలో నమోదైన ఓట్ల సంఖ్య రాయటం.
  •  ఈవీఎంల నిర్వహణపై అవగాహన లేకపోవటంతో తరచూ వాటిని మార్చటం వల్ల సమయం వృథా కావటం.
  •  కంట్రోల్‌, బ్యాలెట్‌ యూనిట్ల గుర్తింపు ట్యాగ్‌లను ఒకదానికి బదులు మరొకటి కట్టడం.

పోలింగ్‌ కేంద్రంలో ప్రిసైడింగ్‌ అధికారి(పీఓ), అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారి(ఏపీఓ), అదర్‌ పోలింగ్‌ ఆఫీసర్స్‌(ఓపీఓలు) బాధ్యతలు, గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించాం. బ్యాలెట్‌ యూనిట్లను కంట్రోల్‌ యూనిట్‌, వీవీప్యాట్‌కు అనుసంధానించి వాటిని ఉపయోగించటంపై తర్ఫీదునిచ్చాం. పోలింగ్‌ కంటే ముందు ఈసీ ఏమైనా మార్పులు చేస్తే ఆవివరాలను సిబ్బందికి సెక్టోరల్‌ అధికారులు తెలియజేస్తారు. కావాల్సిన దానికంటే 20 శాతం అదనంగా సిబ్బందిని ఎంపికచేసి శిక్షణ ఇచ్చాం.

 పూసపాటి సాయికృష్ణ, డీఎల్‌ఎంటీ, భద్రాద్రి కొత్తగూడెం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని