logo

రఘురాంరెడ్డిని గెలిపిస్తే.. ‘ఖమ్మం’ను అగ్రస్థానంలో నిలబెడతారు

కాంగ్రెస్‌ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డిని గెలిపిస్తే ఖమ్మం లోక్‌సభ స్థానాన్ని అభివృద్ధిలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలబెడతారని సినీనటుడు విక్టరీ వెంకటేశ్‌ అన్నారు. పట్టణ ప్రముఖులు, వైద్యులతో కొత్తగూడెం క్లబ్‌లో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.

Updated : 08 May 2024 05:46 IST

ఆత్మీయ సమ్మేళనంలో సినీనటుడు విక్టరీ వెంకటేశ్‌

ఆత్మీయ సమ్మేళనంలో ప్రసంగిస్తున్న సినీనటుడు వెంకటేశ్‌, వేదికపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి, అభ్యర్థి రఘురాంరెడ్డి, ఎమ్మెల్యే రాందాస్‌నాయక్‌, కాంగ్రెస్‌ నాయకులు కోనేరు చిన్ని,  నాగసీతారాములు, సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్‌పాషా, జడ్పీ ఛైర్మన్‌ కె.చంద్రశేఖర్‌రావు, మువ్వా విజయ్‌బాబు

కొత్తగూడెం పట్టణం, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డిని గెలిపిస్తే ఖమ్మం లోక్‌సభ స్థానాన్ని అభివృద్ధిలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలబెడతారని సినీనటుడు విక్టరీ వెంకటేశ్‌ అన్నారు. పట్టణ ప్రముఖులు, వైద్యులతో కొత్తగూడెం క్లబ్‌లో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ‘రఘురాంరెడ్డి కుటుంబం చాలా మంచిది. వారి నడవడిక నచ్చే నా కుమార్తెను కోడలిగా పంపించా. ఆయన్ను ఎంపీగా గెలిపిస్తే ఖమ్మం లోక్‌సభ స్థానంలోని ప్రజలు, నాయకులు, కార్యకర్తలను కూడా తన కుమార్తె మాదిరి జాగ్రత్తగా చూసుకుంటారన్న నమ్మకం ఉంది. ఈనెల 13న జరిగే పోలింగ్‌లో హస్తం గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతో రఘురాంరెడ్డిని గెలిపించాలి’ అని వెంకటేశ్‌ కోరారు. కార్యక్రమానికి హాజరైనవారు డైలాగ్‌ చెప్పాలని కోరగా, ‘డైలాగ్‌లు సినిమాలకే పరిమితం. ఇప్పుడంతా ఒకటే డైలాగ్‌. 13న పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లాలి. హస్తం గుర్తుపై ఓటెయ్యాలి. అంతే..!’ అని తనదైన శైలిలో స్పందించారు. 18 ఏళ్లు నిండిన వారంతా ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఓటుహక్కు మనందరి చేతుల్లో ఆయుధం వంటిదని చెప్పారు. కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి, వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు. 

కొత్తగూడెం సింగరేణి: గడిచిన పదేళ్లలో భాజపా భారాస.. కార్మికులకు తీరని అన్యాయం చేశాయని  కాంగ్రెస్‌ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి ఆరోపించారు. కొత్తగూడెంలోని శేషగిరిభవన్‌లో సీపీఐ అనుబంధ కార్మిక సంఘం సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మిక చట్టాలను భాజపా ప్రభుత్వం కాలరాసిందన్నారు.  దక్షిణ భారత అతిపెద్ద సంస్థ సింగరేణి ప్రైవేటీకరణకు కుట్రలు పన్నుతోందని విమర్శించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్‌పాషా, యూనియన్‌ నాయకులు వంగా వెంకట్, క్రిస్టోఫర్‌, వట్టికొండ మల్లికార్జున్‌, రమణమూర్తి, వీరాస్వామి, నగేష్‌, కాంగ్రెస్‌ నాయకులు ఆళ్లమురళి, నాగేంద్ర త్రివేది, శివప్రసాద్‌ పాల్గొన్నారు.  


ఇద్దరూ కలిశారు.. భారీ మెజారిటీ సాధించాలి: మంత్రి తుమ్మల

వాజేడు, ఏటూరునాగారం, మంగపేట, న్యూస్‌టుడే: ‘శాసనసభ ఎన్నికల్లో భద్రాచలం నియోజకవర్గంలో పోటీపడిన ఇద్దరు కలిశారు. ఆ ఎన్నికల్లో ఇద్దరికి పోలైన ఓట్లు లోక్‌సభ ఎన్నికల్లో సాధించి భారీ మెజారిటీతో కాంగ్రెస్‌ అభ్యర్థి బలరాంనాయక్‌ను గెలిపించాలి’ అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ములుగు జిల్లా మంగపేట, ఏటూరునాగారం, వాజేడు మండలాల్లో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్కతో కలిసి మంగళవారం పర్యటించారు. వాజేడులో వాజేడు, వెంకటాపురం, చర్ల మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశంలో తుమ్మల మాట్లాడారు. గోదావరి పరివాహక ప్రాంతంలో భద్రాచలం నియోజకవర్గ అభివృద్ధికి తాను బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కాంగ్రెస్‌ అభ్యర్థి పోరిక బలరాంనాయక్‌, భద్రాద్రి కొత్తగూడెం డీసీసీ అధ్యక్షుడు పొదెం వీరయ్య తదితరులు పాల్గొన్నారు.
మహబూబాబాద్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారంటీ పథకాల్లో ఇప్పటికే అయిదింటిని అమలుచేసిందని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షీ అన్నారు. రాష్ట్రంలో అధిక స్థానాల్లో కాంగ్రెస్‌ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మహబూబాబాద్‌లోని డీసీసీ కార్యాలయంలో మాట్లాడారు.ఏఐసీసీ కార్యదర్శి రోహిత్‌చౌదరి, మహబూబాబాద్‌, డోర్నకల్‌, ఇల్లెందు, పినపాక ఎమ్మెల్యేలు మురళీనాయక్‌, రాంచంద్రునాయక్‌, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, లోక్‌సభ స్థానం కాంగ్రెస్‌ అభ్యర్థి పోరిక బలరాంనాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు