logo

ఘనంగా సీతారామ కల్యాణోత్సవం

భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు సాగాయి. ఆంజనేయస్వామికి అభిషేకం చేసి అర్చన నిర్వహించడంతో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది.

Published : 08 May 2024 02:39 IST

భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు సాగాయి. ఆంజనేయస్వామికి అభిషేకం చేసి అర్చన నిర్వహించడంతో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. సింధూర తిలకాన్ని నుదట ధరించిన భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి హనుమాన్‌ చాలీసా పఠించారు. ప్రధాన ఆలయంలో కొలువైన కోదండ రాముడికి అర్చకులు భక్తిశ్రద్ధలతో సుప్రభాతం పలికి ఆరాధించారు. కన్యాదానం, కంకణధారణ చేశారు. సీతాదేవికి యోక్త్రధారణ, రామయ్యకు యజ్ఞోపవీత ధారణ కొనసాగించారు. నిత్య కల్యాణ క్రతువులో ముఖ్యమైన మాంగల్యధారణ, తలంబ్రాల వేడుక సంతోషాన్ని చాటాయి. దర్బారుసేవ మంత్రముగ్ధులను చేసింది. ఐదు రోజులపాటు కొనసాగే భగవద్రామానుజాచార్యుల వారి తిరునక్షత్ర ఉత్సవాలు బుధవారం ప్రారంభం కానున్నాయి.


శ్రీరామ భక్తుల చందన గోష్ఠి

భద్రాచలం రామాలయంలో మంగళవారం రాత్రి చందనగోష్ఠి పూజ అట్టహాసంగా సాగింది. శ్రీరామ నవమి సందర్భంగా గత నెల 17న భక్తులు దీక్షలను స్వీకరించారు. 13న వీటిని విరమించనున్నారు. బేడా మండపం వద్ద చందన గోష్ఠి కొనసాగించి భజనలు చేశారు. భక్తి కీర్తనలు ఆలపించి ఆధ్యాత్మికత చాటారు. ప్రధానార్చకుడు విజయరాఘవన్‌ నేతృత్వంలో అర్చకులు రాములోరికి ప్రత్యేక పూజలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని