logo

రక్తహీనత.. బాధితులకు చేయూత

థలసీమియా.. చిన్నారులకు ఒక శాపం. వంశపారంపర్యంగా, మేనరికం వివాహాల వల్ల ఇది సంక్రమిస్తుందని వైద్యులు చెబుతున్నారు. వ్యాధి బయటపడిన చిన్నారులు నెలకోసారి రక్తం ఎక్కించుకుంటూ జీవితకాలాన్ని పొడిగించుకుంటూ నరకయాతన అనుభవిస్తున్నారు.

Updated : 08 May 2024 05:47 IST

న్యూస్‌టుడే, ఖమ్మం వైద్యవిభాగం

థలసీమియా.. చిన్నారులకు ఒక శాపం. వంశపారంపర్యంగా, మేనరికం వివాహాల వల్ల ఇది సంక్రమిస్తుందని వైద్యులు చెబుతున్నారు. వ్యాధి బయటపడిన చిన్నారులు నెలకోసారి రక్తం ఎక్కించుకుంటూ జీవితకాలాన్ని పొడిగించుకుంటూ నరకయాతన అనుభవిస్తున్నారు. ఇటువంటి చిన్నారులకు కొన్ని సంస్థలు చేయూత ఇస్తున్నాయి. ఉచితంగా రక్తం ఎక్కించడంతోపాటు అవసరమైన చికిత్సను ఉచితంగా అందజేస్తున్నాయి. బ్లడ్‌ గ్రూపు సరిపోయే దాతలు ఎముక మజ్జ దానం చేయడానికి ముందుకొస్తే దాని మార్పిడి ద్వారా బాధిత చిన్నారులు శాశ్వతంగా వ్యాధి నుంచి బయట పడవచ్చు. ఖమ్మం జిల్లాలో 600 మందికి పైగా బాధితులు ఉండగా.. పలువురికి ఎముక మజ్జ మార్పిడి చికిత్స అందించి ప్రాణాలు నిలబెట్టారు. నేడు ‘ప్రపంచ థలసీమియా దినం’ సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బాధితులు, స్వచ్ఛంద సంస్థల సేవలు, జాగ్రత్తలపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం..

వ్యాధి లక్షణాలు

థలసీమియా బాధితుల్లో ఎర్ర రక్తకణాలు వృద్ధి చెందవు. హిమోగ్లోబిన్‌ తగినంత లేక గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆయాసం, తలనొప్పి, ఏకాగ్రత లోపం, చర్మం పాలిపోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఫలితంగా జీవితకాలం తగ్గిపోతుంది. బాధితులకు సమస్య తీవ్రతను బట్టి పదిహేను/నెల రోజులకోసారి రక్తం ఎక్కించాలి. ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువ మంది సమస్యను ఎదుర్కొంటున్నారు. వివాహానికి ముందు సంబంధిత జన్యు పరీక్షలు చేయించుకొని వ్యాధిని అరికట్టవచ్చు.

శాశ్వత పరిష్కారం

వ్యాధి పూర్తిగా నయం కావడానికి ఎముక మజ్జ(మూలిగ) మార్పిడి దోహదపడుతుంది. దాతలు మజ్జ ఇచ్చేందుకు ముందుకు రావాలి. చికిత్స ఖరీదైంది. ప్రభుత్వాలు ఆరోగ్యశ్రీలో చేర్చినా పూర్తిగా సేవలు లభించడం లేదు. దీంతో బాధితులు స్వచ్ఛంద సంస్థల సాయంపైన ఆధారపడాల్సి వస్తోంది. కుటుంబంలో ఒకరికి థలసీమియా ఉందని తేలితే మొత్తం సభ్యులు పరీక్షలు చేయించుకోవాలి. మేనరికం థలసీమియాకు ఓ కారణమని వైద్య పరీక్షల్లో నిర్ధారించారు.

జిల్లాలో సంస్థల సహకారం..

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో స్వచ్ఛంద సంస్థలు, సొసైటీలు బాధితులకు అండగా నిలుస్తున్నాయి. ఉచితంగా రక్తదానం, మందులు పంపిణీ చేస్తున్నాయి. మూలకణ పరీక్షలు చేయిస్తూ ఖరీదైన ఎముక మజ్జ మార్పిడి చికిత్సలకు సహకరిస్తున్నాయి.

సంకల్ప స్వచ్ఛంద సంస్థ..

సంకల్ప స్వచ్ఛంద సంస్థ రితన్య డేకేర్‌ సెంటర్‌లో 250 మంది బాధితులు తమ వివరాలను నమోదు చేసుకున్నారు. ఇప్పటి వరకు 100 కుటుంబాలకు మూలకణ(హెచ్‌ఎల్‌ఏ) పరీక్షలు చేయించారు. దాతల సాయంతో మందులు, రక్తాన్ని సేకరించి ఉచితంగా అందిస్తున్నారు. బాధిత చిన్నారుల్లో 12 మందికి బోన్‌మ్యారో(ఎముక మజ్జ మార్పిడి) చికిత్సలు ఇప్పించగా 8 మంది వ్యాధి నుంచి విముక్తి పొందారు. ఆర్టీసీ కండక్టర్‌గా పని చేస్తున్న అనిత తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ సంస్థ నిర్వహణ బాధ్యతలను చూస్తున్నారు.

సికిల్‌ సెల్‌ సొసైటీ..

హైదరాబాద్‌ కేంద్రంగా నిర్వహిస్తున్న థలసీమియా సికిల్‌ సెల్‌ సొసైటీ ఖమ్మంలో బ్రాంచిని ఏర్పాటు చేసింది. ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు కూరపాటి ప్రదీప్‌కుమార్‌ ఈ కేంద్రాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఖమ్మంతో పాటు పరిసర జిల్లాలకు చెందిన 300 మంది పిల్లలు ఇక్కడ ఉచిత సేవలు పొందుతున్నారు. ఇప్పటివరకు 12 మందికి బోన్‌మ్యారో చికిత్సలు చేయించగా ఒకరు మినహా అందరూ వ్యాధి బారి నుంచి బయటపడ్డారు.


నయం చేసే మందులు లేవు..

- నెట్టెం సింధూర, పిల్లల వైద్య నిపుణురాలు

పుట్టిన ఆరు నెలల తర్వాత వ్యాధి లక్షణాలు బయటపడతాయి. దీన్ని పూర్తిగా నయం చేసే మందులు లేవు. బోన్‌మ్యారో చికిత్సతోనే నిర్మూలన సాధ్యం. బాధితులకు శరీరంలో రక్తం తగ్గిపోతుంటుంది. వైద్యుల సలహా మేరకు దాతల నుంచి సేకరించిన ఆరోగ్యకరమైన రక్తాన్ని ఎక్కించాలి. బరువు ప్రకారం తగిన మోతాదుతో అందించాలి. దీనివల్ల దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. వాటిని తగ్గించడానికి మందులు వాడాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు