logo

వేగ గణనకు వేదగణితం

తెలంగాణ కమిషనర్‌ ఆఫ్‌ కాలేజియేట్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు రాష్ట్ర స్థాయిలో ‘జిజ్ఞాస’ విద్యార్థి కేంద్రక అధ్యయన ప్రాజెక్టు పోటీలు నిర్వహించారు.

Updated : 09 May 2024 06:53 IST

‘జిజ్ఞాస’ పోటీల్లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి

ఎస్‌ఆర్‌బీజీఎన్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ప్రతిభ

 

పి.అనూరాధతో కలిసి ప్రశంస పత్రాలు చూపుతున్న విద్యార్థులు

ఖమ్మం విద్యావిభాగం, న్యూస్‌టుడే: ఇటీవల తెలంగాణ కమిషనర్‌ ఆఫ్‌ కాలేజియేట్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు రాష్ట్ర స్థాయిలో ‘జిజ్ఞాస’ విద్యార్థి కేంద్రక అధ్యయన ప్రాజెక్టు పోటీలు నిర్వహించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ పోటీల్లో ఖమ్మం ఎస్‌ఆర్‌బీజీఎన్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గణిత విభాగం నుంచి ‘పారామౌంట్‌ వాల్యూ ఆఫ్‌ వేదిక్‌ మేథమెటిక్స్‌ ఇన్‌ కంప్యూటర్‌ ఇరా’ అనే అంశంపై గణిత సహాయ ఆచార్యురాలు పి.అనూరాధ పర్యవేక్షణలో సమర్పించిన నివేదికకు రాష్ట్ర స్థాయి ప్రథమ బహుమతి లభించింది. మొత్తం 132 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు పోటీల్లో పాల్గొన్నాయి. విజేతగా నిలిచినందుకు రూ.30 వేల నగదు బహుమతి అందుకున్నారు. ప్రాజెక్టులో విద్యార్థులు ఎస్‌.రక్షిత, పి.రిషిక, కె.మనీషా, బి.లలిత, జి.చందు పాల్గొన్నారు.

అధర్వణ వేదంలో...

భారత దేశం ప్రపంచానికి అందించిన అద్భుత బహుమతి వేద గణితం. వేదం అంటే జ్ఞానం. వేద గణితం నాలుగు వేదాల్లో ఒకటైన అధర్వణ వేదంలో పొందుపరిచారు. 1911 నుంచి 1918 సంవత్సరాల మధ్య కాలంలో స్వామి భారతీకృష్ణతీర్థ చేసిన కృషి ద్వారా 16 సూత్రాలు, 13 ఉప సూత్రాల రూపంలో వేదగణితం అందుబాటులోకి వచ్చింది. దీని సాధన ద్వారా అమోఘమైన ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, గ్రహణశక్తి వస్తాయి.

‘వేగ’ గణనకు...

వేద గణితం ముఖ్య లక్షణం చాలా తక్కువ సమయంలో, అత్యంత వేగం, కచ్చితత్వంతో సులువైన పద్ధతిలో గణిత సమస్యలను సాధించటం. ముఖ్య సూత్రాల ద్వారా అంకశాస్త్రం, బీజగణితం, జ్యామితి, కాలిక్యులస్‌, త్రికోణమితి తదితర సమస్యలు సాధించే అవకాశం ఉంటుంది. ఇంతటి అద్భుత లక్షణాలున్న వేద గణిత సూత్రాలను ప్రస్తుతం కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌లో(ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌), స్పేస్‌ ఇంజినీరింగ్‌లో, ‘నాసా’ వంటి సంస్థల్లో అంతరిక్ష పరిశోధనల్లో, రాకెట్లు, ఉపగ్రహాలు ప్రవేశ పెట్టేందుకు, సుదీర్ఘ గణనలను చేసే విభాగాల్లో ఉపయోగిస్తున్నారు.
రీ రోబోటిక్స్‌, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, స్టాక్‌ ఎక్స్ఛేంజి రంగాల్లో దీన్ని ఉపయోగించేందుకు తయారుచేసిన ప్రాజెక్టే ‘పారామౌంట్‌ వాల్యూ ఆఫ్‌ వేదిక్‌ మేథమెటిక్స్‌’ రోజూ లక్షల సంఖ్యల్లో గణనలను ఉపయోగించే బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, స్టాక్‌ ఎక్ఛేంజ్‌ తదితర రంగాల్లో ఉపయోగించే కంప్యూటర్లు ఎంతో వేగంగా పని చేయాలి. సంప్రదాయ కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్స్‌ వల్ల ఎక్కువ మెమరీ, ఎక్కువ విద్యుత్తు, సమయం అవసరమవుతాయి. కంప్యూటర్‌ ప్రాసెసర్‌ వేగాన్ని పెంచేందుకు వెరీ లార్జ్‌ స్కేల్‌ ఇంటిగ్రేటెడ్‌ చిప్స్‌ను వేద గణిత సూత్రాల ద్వారా నిర్మిస్తున్నారు. దీనినే ‘వేదిక్‌ మల్టిప్లయర్స్‌’ అంటారు. వీటితో పనిచేసే కంప్యూటర్లు ఎక్కువ వేగంగా, తక్కువ పవర్‌, మెమొరీని ఉపయోగించుకుని సమర్థంగా పని చేస్తున్నాయి. ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర స్థాయి బహుమతి లభించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని