logo

నిఘా నేత్రం.. పర్యవేక్షణ సులభం

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 50 శాతం పోలింగ్‌ కేంద్రాల్లో నిఘా   నేత్రాలు అమర్చాలని ఎన్నికల సంఘం సూచించింది.

Published : 09 May 2024 03:26 IST

ఖమ్మం నగరం, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 50 శాతం పోలింగ్‌ కేంద్రాల్లో నిఘా నేత్రాలు అమర్చాలని ఎన్నికల సంఘం సూచించింది. ఖమ్మం లోక్‌సభ స్థానంలో మాత్రం అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలని రిటర్నింగ్‌ అధికారి గౌతమ్‌ నిర్ణయించారు. 2023 నవంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల సమయంలో ఖమ్మం జిల్లాలో అయిదు నియోజకవర్గాల్లోని అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో నిఘానేత్రాలు అమర్చారు. తాజాగా ఖమ్మం లోక్‌సభ స్థానం  పరిధిలోని భద్రాద్రి జిల్లా కొత్తగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గాల్లోని ప్రతి పోలింగ్‌ కేంద్రంలో సీసీ    కెమెరాలు బిగించాలని ఆర్‌ఓ ఆదేశించారు. ఈ పనులు శుక్రవారం నాటికి పూర్తికానున్నాయి.

 ఖమ్మం కలెక్టరేట్‌, ఎన్నికల సంఘం కార్యాలయాలకు అనుసంధానం

 పోలింగ్‌ కేంద్రాల్లో అమర్చిన నిఘానేత్రాలను ఖమ్మం కలెక్టరేట్‌లోని కంప్యూటర్లకు అనుసంధానిస్తారు. ఇక్కడి నుంచి హైదరాబాద్‌, దిల్లీలోని ఎన్నికల సంఘం కార్యాలయాలకు    కలుపుతారు. పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ ప్రక్రియను ఉన్నతాధికారులు వీక్షించే అవకాశం కలుగుతుంది. పోలింగ్‌ రోజు ఏవైనా సమస్యలు ఉత్పన్నమైతే వాటిని సంబంధిత సెక్టార్‌ అధికారులకు తెలియజేస్తారు. గత శాసనసభ ఎన్నికల్లో కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లో తలెత్తిన సమస్యలను అక్కడి పోలింగ్‌ సిబ్బంది ఉన్నతాధికారులకు తెలిపేలోగా ఖమ్మం కలెక్టరేట్‌లో అధికారులు సీసీ కెమెరాల ద్వారా తెలుసుకొని పరిష్కార మార్గాలు సూచించారు. పోలింగ్‌ కేంద్రంలో సీసీకెమెరాలు అమర్చిన గదిలో రాత్రిపూట నిద్రించవద్దని ఇటీవల పోలింగ్‌ సిబ్బందికి నిర్వహించిన రెండోవిడత శిక్షణ కార్యక్రమంలో స్పష్టం చేశారు. భవనంలోని వేరే గదుల్లో బసచేయాలని తెలిపారు.
మొత్తమ్మీద 1,896 పోలింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలు బిగిస్తున్నారు. పోలింగ్‌ కేంద్రాల వెలుపల మరో 620 నిఘానేత్రాలు అమర్చుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని