logo

ఎన్నికల వేళ మందుపాతరల దడ..!

సార్వత్రిక ఎన్నికల వేళ మావోయిస్టుల మందుపాతరల ఏర్పాటుతో ఏజెన్సీలో దడ పుడుతోంది. భద్రాచలం ఏజెన్సీలోని అత్యంత మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఈనెల 13న జరగనున్న పార్లమెంట్‌ ఎన్నికలకు అధికారులు

Updated : 10 May 2024 06:08 IST

రహదారి వెంట బాంబు స్క్వాడ్‌ తనిఖీలు

చర్ల, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల వేళ మావోయిస్టుల మందుపాతరల ఏర్పాటుతో ఏజెన్సీలో దడ పుడుతోంది. భద్రాచలం ఏజెన్సీలోని అత్యంత మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఈనెల 13న జరగనున్న పార్లమెంట్‌ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లల్లో నిమగ్నమైన వేళ.. చర్ల మండలం చెన్నాపురం అటవీ ప్రాంతంలో పోలీసులనే లక్ష్యంగా చేసుకొని ఏర్పాటు చేసిన ఐఈడీని (ఇంప్రూవైజ్డ్‌ ఎక్స్‌ప్లోజివ్‌ డివైజ్‌) బీడీఎస్‌(బాంబు డిస్పోషల్‌ స్క్వాడ్‌) బృందం బుధవారం గుర్తించడంతో భారీ ప్రమాదం తప్పినట్లయింది.

  • తిప్పాపురం పోలింగ్‌ కేంద్రం పరిధిలోని చెన్నాపురం అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు ఓ పక్కన మావోయిస్టుల కోసం జల్లెడ పడుతూనే బీడీఎస్‌ బృందంతో అటవీ ప్రాంతాలను చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న క్రమంలో ఈ ఐఈడీని గుర్తించారు. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో ఎన్నికల వేళ ఏదో రూపేణా విధ్వంసానికి తెగబడేందుకు మావోయిస్టులు వ్యూహాలు పన్నినట్లుగా నిఘా వర్గాలకు సమాచారం అందడంతో సున్నితమైన ప్రాంతాల్లో అనువణువునా బాంబుస్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌ బృందాలు నిరంతరం పరిశీలిస్తున్నాయి. చర్ల మండలంలో అత్యంత సమస్మాత్మక పోలింగ్‌ కేంద్రాలైన తిప్పాపురం, ఉంజుపల్లి, పెదమిడిసిలేరు, చిన్నమిడిసిలేరు తదితర ప్రాంతాలల్లో పెద్దఎత్తున నిఘా ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాలల్లో రహదారులతో పాటు అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు ఎక్కడైనా మందుపాతరలు ఏర్పాటు చేశారా? అనే దానిపై కొద్ది రోజులుగా అనువణువు భద్రాతా బలగాలు గాలిస్తున్నాయి.

అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ..

గత నాలుగు నెలల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల వేళ పెదమిడిసిలేరు ఎన్నికల కేంద్రానికి అతి సమీపంలో పోలీసులు అత్యంత శక్తివంతమైన మందుపాతరను గుర్తించారు. ఇక్కడ ఎన్నికల కేంద్రానికి సమీపంలో ప్రధాన రహదారిపై మావోయిస్టులు అమర్చిన భారీ మందుపాతరను ఎన్నికలు జరుగుతున్న రోజునే గుర్తించి నిర్వీర్యం చేయడంతో భారీ ప్రమాదం తప్పింది. తాజాగా సార్వత్రిక ఎన్నికల వేళ చెన్నాపురం అటవీ ప్రాంతంలో ఐఈడీను గుర్తించడంతో మళ్లీ మందుపాతరల కలకలం నెలకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని