logo

ఈ శోకం తీర్చలేనిది

ఆ ఇద్దరు తల్లుల శోకం తీర్చలేనిది. అందులో ఓ మాతృమూర్తి తన భర్త   చనిపోయాక పొట్టచేత పట్టుకుని ఇద్దరు పిల్లలతో కలిసి నగరానికి వచ్చింది. గురుకులంలో చదువుతూ వేసవి సెలవుల్లో ఇంటికొచ్చిన చిన్న కొడుకు కానరాని లోకాలకు వెళ్లిపోవటాన్ని చూసి స్పృహతప్పి పడిపోయింది.

Updated : 10 May 2024 06:02 IST

మున్నేరులో వంతెన కోసం తీసిన గోతిలో మునిగి ముగ్గురు విద్యార్థుల మృతి

లోకేశ్‌, హరీశ్‌ మృతదేహాలపై పడి రోదిస్తున్న తల్లి లక్ష్మి, బంధువులు

ఖమ్మం గ్రామీణం, ఖమ్మం నేరవిభాగం, న్యూస్‌టుడే: ఆ ఇద్దరు తల్లుల శోకం తీర్చలేనిది. అందులో ఓ మాతృమూర్తి తన భర్త   చనిపోయాక పొట్టచేత పట్టుకుని ఇద్దరు పిల్లలతో కలిసి నగరానికి వచ్చింది. గురుకులంలో చదువుతూ వేసవి సెలవుల్లో ఇంటికొచ్చిన చిన్న కొడుకు కానరాని లోకాలకు వెళ్లిపోవటాన్ని చూసి స్పృహతప్పి పడిపోయింది. ఇంకో తల్లిది  ఎవరూ తీర్చలేని గర్భశోకం. తన ఇద్దరు పిల్లల్నీ మున్నేరు మింగేయటంతో గుండెలు బాదుకుంటోంది. మూగబోయిన గొంతుల కోసం గొంతు మూగబోయేలా రోదిస్తోంది.

ఖమ్మం నగరం మమతారోడ్డులోని రామచంద్రయ్య నగర్‌లో గుడిసె వేసుకొని నివాసం ఉంటున్న ఆముదాల చిరంజీవి ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. చిరంజీవి, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. లోకేశ్‌(14), హరీశ్‌(12).. వారి ఇంటి పక్కనే నివాసం ఉంటున్న బానోత్‌ కళావతికి ఇద్దరు కుమారులు. రఘునాథపాలెం మండలం రాంక్యాతండా స్వస్థలం. భర్త చనిపోవటంతో నగరానికి వచ్చి రోడ్డుపక్కనే రాగి జావ విక్రయిస్తూ ఇద్దరు కుమారులను పోషిస్తున్నారు. బానోత్‌ గణేశ్‌ (14) ఈమె చిన్నకొడుకు. గురువారం సాయంత్రం మున్నేరులో ఈతకోసం వెళ్లిన   చిరంజీవి ఇద్దరు కొడుకులు, పొరుగున ఉన్న గణేశ్‌ ముగ్గురూ మృత్యువాతపడటంతో రామచంద్రయ్యనగర్‌లో విషాదం అలుముకుంది.

జాగ్రత్త చర్యలేవి..!

ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్‌ జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా గుదిమళ్ల సమీపంలో మున్నేరుపై వంతెన నిర్మాణ ప్రదేశంలో జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్లే ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వాస్తవంగా వంతెన నిర్మాణ సమయంలో పనుల ప్రారంభం వద్ద, చివరలో పని జరుగుతున్నట్లు బోర్డులు ఏర్పాటు చేయాలి. అటుగా ఎవరూ రాకుండా చూడాలి. ఒకవేళ నిర్మాణ ప్రదేశంలో రహదారి మార్గం ఉంటే దానికి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలి. పిల్లర్ల కోసం లోతైన గుంతలు తవ్వినప్పుడు హెచ్చరిక బోర్డులతోపాటు ఆ గుంత చుట్టూ రిబ్బన్‌ లేదా రక్షిత గోడలు ఏర్పాటు   చేయాలి. ఒకవేళ నిర్మాణ పనులు ఆగిపోతే అక్కడ హెచ్చరిక బోర్డులతో పాటు కాపలాదారు ఉండాలి. ఘటన చోటుచేసుకున్న గుదిమళ్ల వద్ద ఇవేమీ కనిపించలేదు.

చిన్నారుల కోసం గాలిస్తున్న వ్యక్తులు, గుమిగూడిన స్థానికులు

స్వచ్ఛందంగా గాలింపు

ముగ్గురు పిల్లలు మునిగిపోతుండగా, చిరంజీవి సమీపంలో చేపలు పట్టుకుంటున్న వారిని అప్రమత్తం చేశారు. గుదిమళ్లకు చెందిన బాణోతు రఘురాం, ఖమ్మం మంచికంటినగర్‌కు చెందిన మక్కల నరసింహారావు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహాలు దొరికే వరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందితో కలిసి రెండు గంటలకుపైగా వెతికారు. అగ్నిమాపక ఎస్‌ఎఫ్‌ఓ రాజేశ్వరరావు, ఏఎల్‌ఎఫ్‌ రమేశ్‌, సిబ్బంది  సేవలందించారు.

  • ప్రమాదం విషయం తెలుసుకున్న  నాయకులు ఆళ్ల అంజిరెడ్డి, బిక్కసాని జశ్వంత్‌ సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ నాయకుడు గుత్తా వెంకటేశ్వరరావు, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్‌, షేక్‌ జానీమియా ఘటనా స్థలిని సందర్శించారు. శవపరీక్ష అనంతరం మృతదేహాలను బాధిత కుటుంబాలకు అప్పగించారు.

శిక్షణ ఐపీఎస్‌ భావోద్వేగం..

మృతుల బంధువుల రోదనలతో ఘటనా స్థలిలో శిక్షణ ఐపీఎస్‌ మౌనిక భావోద్వేగానికి గురయ్యారు. కొంతసేపు కన్నీరు పెట్టుకున్నారు. ఘటనా స్థలికి ఆమెతోపాటు రూరల్‌ సీఐ రాజిరెడ్డి, ఖానాపురం హవేలి ఇన్‌స్పెక్టర్‌ భానుప్రకాశ్‌, రూరల్‌ ఎస్‌ఐ రామారావు, సిబ్బంది వెళ్లారు. గణేశ్‌ తల్లి కళావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రామారావు తెలిపారు.

  • బాధిత కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని సీపీఐ జాతీయ నాయకుడు బాగం హేమంతరావు డిమాండ్‌ చేశారు. విద్యార్థుల మృతదేహాలకు ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో నివాళి అర్పించారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు