logo

అందరూ రావాల్సిందే.. నిబంధనలు పాటించాల్సిందే

సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ నిర్వహణకు అధికారులు సమాయత్తమవుతున్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఇప్పటికే ఈవీఎంలు, సిబ్బందిని సిద్ధం చేసి ఆయా శాసనసభ నియోజకవర్గాలకు కేటాయించారు.

Updated : 10 May 2024 06:01 IST

ఈనాడు డిజిటల్‌, కొత్తగూడెం: సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ నిర్వహణకు అధికారులు సమాయత్తమవుతున్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఇప్పటికే ఈవీఎంలు, సిబ్బందిని సిద్ధం చేసి ఆయా శాసనసభ నియోజకవర్గాలకు కేటాయించారు. పోలింగ్‌కు రెండు రోజుల ముందు (ఈనెల 11న) తుది ర్యాండమైజేషన్‌ ద్వారా సిబ్బందికి పోలింగ్‌ కేంద్రాలను నిర్ణయించనున్నారు. ఆదివారం ఉదయం పోలింగ్‌ సామగ్రి పంపిణీ చేసి అదేరోజు సాయంత్రం సిబ్బందిని పోలింగ్‌ కేంద్రాలకు తరలిస్తారు. పోలింగ్‌ సామగ్రి పంపిణీ, సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమగ్ర కథనం.


సెక్టార్ల వారీగా టేబుళ్ల ఏర్పాటు

శాసనసభ నియోజకవర్గాల్లోని పోలింగ్‌ సామగ్రి పంపిణీ కేంద్రాల్లో సెక్టార్ల వారీగా టేబుళ్లు ఏర్పాటు చేస్తారు. అంతకుముందే నియోజకవర్గాన్ని సెక్టార్లుగా విభజిస్తారు.       ఏ సెక్టార్‌ పరిధిలో ఏఏ పోలింగ్‌ కేంద్రాలు వస్తాయనేది టేబుల్‌ ముందుంచుతారు. దీని ఆధారంగా ఆయా పోలింగ్‌ కేంద్రాలకు కేటాయించిన పీఓ, ఏపీఓ, ఓపీఓలు టేబుల్‌ వద్దకు వెళ్లి పోలింగ్‌ సామగ్రి తీసుకోవాలి. వాటిలో అన్ని రకాల వస్తువులు ఉన్నాయా? లేదా తనిఖీ చేసుకోవటానికి సమయమిస్తారు. అన్ని సరిగ్గా ఉంటే ఏఆర్‌ఓ ఇచ్చే ఫాంపై పీఓ సంతకం చేయాలి. పోలింగ్‌ ముగిసిన తర్వాత తిరిగి వాటిని అప్పగించే వరకు పూర్తి బాధ్యత ప్రిసైడింగ్‌ అధికారి(పీఓ)దే.


ఏఆర్‌ఓలకు సహాయకులుగా రెవెన్యూ అధికారులు

పోలింగ్‌ సామగ్రి పంపిణీ బాధ్యత సహాయ రిటర్నింగ్‌ అధికారి(ఏఆర్‌ఓ)దే. అయినప్పటికీ ఆయా నియోజకవర్గాల్లోని మండలాల్లో విధులు నిర్వర్తించే తహసీల్దారు, డిప్యూటీ తహసీల్దారు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు ఏఆర్‌ఓకు సహాయకులుగా వ్యవహరిస్తారు. పోలింగ్‌ సిబ్బందికి సామగ్రి పంపిణీ సమయంలో సహకరిస్తారు. ఈక్రతువుకు సెక్టోరల్‌ అధికారులు, శాసనసభ నియోజకవర్గ మాస్టర్‌ ట్రెయినీలు హాజరవుతారు. పోలింగ్‌ నిర్వహణపై సిబ్బందికి ఎలాంటి సందేహాలున్నా మాస్టర్‌ ట్రెయినీలు నివృత్తి చేస్తారు. అక్కడే భోజన సదుపాయం ఏర్పాటుచేసి సిబ్బంది, సెక్టోరల్‌ అధికారులను వాహనాల్లో పోలింగ్‌ కేంద్రాలకు పంపిస్తారు.


ఒక్కో రూట్‌కు ఒక్కో వాహనం

సిబ్బందిని తరలించటానికి సౌలభ్యంగా ఉండేందుకు సెక్టార్లను రూట్లుగా విభజిస్తారు. ఒక్కో రూట్‌కు ఒక్కో వాహనాన్ని కేటాయిస్తారు. ఇలా కేటాయించిన ప్రతి వాహనానికి ఒక్కో రూట్‌ అధికారిని నియమిస్తారు. సిబ్బందిని తరలించటం, పోలింగ్‌ అనంతరం తిరిగి తీసుకురావటం వీరి బాధ్యత. ఆయా పోలింగ్‌ కేంద్రాలకు ఎంపిక చేసిన సిబ్బంది హాజరును నమోదుచేసుకుని పోలింగ్‌ కేంద్రాలకు తరలిస్తారు. ఆయా శాసనసభ నియోజకవర్గాల్లో విధులు నిర్వర్తించే సిబ్బందిని సంబంధిత ఏఆర్‌ఓలు పర్యవేక్షిస్తుంటారు.


ఇలా చేస్తే క్రిమినల్‌ చర్యలే..

పోలింగ్‌ సమయంలో సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలి. అదే సమయంలో ఎన్నికల నిబంధనలనూ పాటించాలి. ఎన్నికల సామగ్రి తీసుకెళ్లే సమయంలో పీఓ, ఏపీఓ, ఓపీఓలు తప్పనిసరిగా ఎన్నికల అధికారులు ఏర్పాటు చేసిన వాహనాల్లోనే ప్రయాణించాల్సి ఉంటుంది. సొంత వాహనాల్లో వెళ్లటానికి వీల్లేదు. అతి ముఖ్యమైన పోలింగ్‌ సామగ్రిని ఎక్కడైనా మరిచిపోయినా, తిరిగి అధికారులకు అప్పగించకపోయినా సంబంధిత సిబ్బందిపై క్రిమినల్‌ చర్యలు తప్పవు. ఒకవేళ ఎవరైనా పీఓ.. ఈవీఎంను తిరిగి అప్పగించకపోతే జిల్లా  ఎన్నికల అధికార యంత్రాంగమంతా బాధ్యత వహించాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని