అమ్మకు అందని కాల్షియం
మూడు నెలలుగా గర్భిణుల ఇక్కట్లు
ఆసుపత్రి బడ్జెట్ నిధులు వెనక్కి
ఈనాడు డిజిటల్ - కర్నూలు: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కాల్షియం మాత్రలు కనిపించడం లేదు. మూడు నెలలుగా సరఫరా లేకపోవడంతో గర్భిణులు ఇబ్బంది పడుతున్నారు. గర్భం దాల్చిన తర్వాత మూడో నెల నుంచి ఆరు నెలలపాటు, ప్రసవం అయ్యాక మరో ఆరు నెలలు తప్పనిసరిగా వాడాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటులో తెచ్చు‘కొంటున్నారు.’
సెప్టెంబరు నుంచి కొరత
జిల్లాలో 87 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ప్రతి పీహెచ్సీల్లో సోమ, శుక్రవారాల్లో గర్భిణులకు పరీక్షలు చేస్తుంటారు. ఒక్కో కేంద్రంలో ప్రతి నెలా సరాసరిన వంద మంది వరకు వస్తుంటారు. వీరిలో 60 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి నెలా తొమ్మిదో తేదీన కచ్చితంగా పరీక్షలు చేస్తున్నారు. మూడు నెలలు దాటిన వారికి ఐరన్, కాల్షియం మాత్రలు ఉచితంగా ఇవ్వాలి. ఈ ఏడాది సెప్టెంబరు నుంచి అందుబాటులో లేవు.
ప్రతి నెలా రూ.1400 వెచ్చించాలి
ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రలు అందుబాటులో లేకపోవడంతో బయట కొనుగోలు చేస్తున్నారు. షల్కాల్ (కాల్షియం) మాత్రలు ఒక్కో షీటు రూ.350 వరకు పలుకుతోంది. ఒక్కో గర్భిణి నెలకు 60 మాత్రలు వాడాల్సి ఉంటుంది. నాలుగు షీట్లకు రూ.1400 ప్రతి నెలా వెచ్చించాల్సి వస్తోంది. ఆత్మకూరు, మహానంది, శ్రీశైలం, ఆలూరు, మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోసిగి వంటి చోట్ల ప్రైవేటులో కొనలేక వినియోగించడమే మానేశారు.
సూదిమందూ లేదు
ఆసుపత్రులకు వచ్చిన గర్భిణులకు బీపీ, రక్త పరీక్షలు చేయాలి. వారిలో అధిక రక్తహీనతతో బాధపడుతున్న వారిని గుర్తించి ‘ఐరన్ సుక్రోజ్’ ఇంజక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కొక్కరికి ఐదు ఇవ్వాల్సి ఉండగా.. పీహెచ్సీలకు కేటాయిస్తున్న అరకొర ఇంజక్షన్లు కొంత మంది దరికే చేరుతున్నాయి. 100ఎంఎల్ సాధారణ సెలైన్లు మూడేళ్లుగా అందడం లేదు. ఐవీ సెట్స్ కొరత తీవ్రంగా ఉంది.
ఎందుకీ పరిస్థితి
* పీహెచ్సీల్లో మరమ్మతులు, అత్యవసరాలకు ఉపయోగించుకొనేలా ఏటా నిధులు (బడ్జెట్) కేటాయిస్తారు. ఒక్కో పీహెచ్సీకి రూ.1.70 లక్షలఁ నుంచి రూ.2 లక్షల వరకు అందుతాయి.
* వారం రోజుల కిందట పీడీ, హెచ్డీ ఖాతాల్లోని నిధులు వెనక్కి ఇవ్వాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. చేసేది లేక కొందరు పీహెచ్సీ వైద్యులు దాతలను అడిగి కాల్షియం మందులు గర్భిణులకు సరఫరా చేస్తున్నారు.
* ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ) ఈఈ పి.సదాశివరెడ్డిని వివరణ అడగ్గా... మాత్రలు అందుబాటులో లేవన్న విషయం తన దృష్టికి రాలేదు.. కర్నూలులో కొరత ఉంటే ఏ జిల్లా నుంచైనా సర్దుబాటు చేసుకొనే అవకాశం ఉందన్నారు. వెంటనే అన్ని పీహెచ్సీలకు అందించే ఏర్పాటు చేస్తామన్నారు.
ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు/ సేవల గురించి ఈనాడు సంస్థకి ఎటువంటి అవగాహనా ఉండదు. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి, జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు/ సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు.