logo

అక్షర వెలుగులు నింపిన గాడిచెర్ల

బ్రిటిష్‌ పాలనపై విద్యార్థి దశలో పిడికిలెత్తారు.. వారి దమనకాండను సంపాదకుడిగా ఎండగట్టారు. రాజద్రోహం కింద అరెస్టైనా పోరాట పటిమ వీడలేదు.. తొలి రాజకీయ ఖైదీగా రాయవేలూరు జైలులో ఎన్నో బాధలు అనుభవించారు. ఆంధ్రా తిలక్‌గా పేరు పొందారు.. రాయలసీమ నామకరణంతో ఇక్కడ ప్రజల ఆత్మగౌరవాన్ని

Published : 10 Aug 2022 01:49 IST

న్యూస్‌టుడే, కర్నూలు విద్యా విభాగం

బ్రిటిష్‌ పాలనపై విద్యార్థి దశలో పిడికిలెత్తారు.. వారి దమనకాండను సంపాదకుడిగా ఎండగట్టారు. రాజద్రోహం కింద అరెస్టైనా పోరాట పటిమ వీడలేదు.. తొలి రాజకీయ ఖైదీగా రాయవేలూరు జైలులో ఎన్నో బాధలు అనుభవించారు. ఆంధ్రా తిలక్‌గా పేరు పొందారు.. రాయలసీమ నామకరణంతో ఇక్కడ ప్రజల ఆత్మగౌరవాన్ని ఎలుగెత్తి చాటారు. ప్రజలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు అక్షర యాత్ర చేశారు.. పల్లెల్లో గ్రంథాలయాల ఏర్పాటుకు కృషి చేసిన అక్షర యోధుడు గాడిచెర్ల హరిసర్వోత్తమరావు.

ఆంధ్రా తిలక్‌

గాడిచెర్ల తొలి రాజకీయ ఖైదీ. అదే రోజు తిలక్‌ ‘స్వాతంత్య్రం నా జన్మహక్కు’ అని నినదిస్తూ అరెస్టయ్యారు. అందుకే  హరిసర్వోత్తమరావును ‘ఆంధ్రా తిలక్‌’ అని పిలుస్తుంటారు. రాయవేలూరు జైలులో గాడిచెర్ల ఎన్నో బాధలు అనుభవించారు. కాలికి, మెడకు సంకెళ్లు వేసి వాటి మధ్య ఒక కొయ్య ముక్క తగిలించారు. పురుగుల అన్నం పెట్టడం.. పడుకునేందుకు చినిగిపోయిన చాప, కట్టుకునేందుకు రెండు చిన్న వస్త్ర ముక్కలు ఇచ్చారు. నూనె గానుగను నిరంతరం తిప్పించేవారు. ఎన్ని బాధలు పడినా ఆయనలో పోరాట పటిమ మాత్రం తగ్గలేదు.

1883 సెప్టెంబరు 14న భగీరథమ్మ, శ్రీవెంకటరావు దంపతులకు కర్నూలులో గాడిచెర్ల హరిసర్వోత్తమరావు జన్మించారు. ఆయన 1907లో రాజమండ్రిలో టీచర్‌ ట్రైనింగ్‌ చేస్తుండగా ‘వందేమాతరం’ ఉద్యమం ప్రారంభమైంది. ఆ సమయంలో దేశమంతా పర్యటిస్తున్న బిపిన్‌ చంద్రపాల్‌ ఉపన్యాసాలకు ప్రభావితుడై స్వరాజ్య ఉద్యమంలోకి ప్రవేశించారు. ఆయన నాయకత్వంలో ఓ రోజు విద్యార్థులంతా నల్లబ్యాడ్జీలు ధరించి వందేమాతరం నినాదాలతో కళాశాలకొచ్చారు. అక్కడి ప్రిన్సిపల్‌ హంటర్‌ వారిని అడ్డుకొని గాడిచెర్లను కళాశాల నుంచి బహిష్కరించారు. ప్రభుత్వ కొలువు ఇవ్వకూడదని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
స్వరాజ్య పత్రికలో గాడిచెర్ల సంపాదకుడిగా చేరారు. స్వరాజ్య పత్రికలో పని చేస్తున్న సమయంలోనే బ్రిటిషు అధికారి ‘ఏష్‌’ హత్య జరిగింది. దీనిని ఎండగడుతూ ‘విపరీత బుద్ధి’ అనే పేరుతో గాడిచెర్ల సంపాదకీయం రాశారు. దీంతో ప్రభుత్వం అతడిని రాజద్రోహం నేరం కింద అరెస్టు చేసి మూడేళ్లపాటు జైలు శిక్ష విధించింది.

నగరంలో గ్రంథాలయం

గ్రంథాలయోద్యమానికి గాడిచెర్ల హరిసర్వోత్తమరావు చేసిన సేవకు గుర్తుగా కర్నూలు జిల్లాలోని కేంద్ర గ్రంథాలయ నూతన భవనానికి ‘గాడిచెర్ల హరిసర్వోత్తమరావు భవనం’గా పేరు పెట్టారు. ఇక్కడ 60 వేలకుపైగా పుస్తకాలు ఉన్నాయి. 1,200 మందికిపైగా సభ్యత్వం పొందారు. నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధమవ్వడానికి ప్రత్యేక గదిని నిర్మించారు. వీరికి మధ్యాహ్న భోజనం అందిస్తుంటారు. ఇక్కడ చదువుకున్న వారిలో 150 మంది వరకు కొలువు సాధించారు.

  శ్రీబాగ్‌ ఒప్పందంలో కీలక పాత్ర

1927లో ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్‌ నిర్ణయం మేరకు మద్రాస్‌ కౌన్సిల్‌ ఎన్నికల్లో పాల్గొని జస్టిస్‌ పార్టీ అభ్యర్థిని ఓడించి కర్నూలు నుంచి ఎన్నికైన తొలి ఎంఎల్‌హెచ్‌గా గుర్తింపు పొందారు. 1937లో రాయలసీమ, ఆంధ్రా ప్రాంత నాయకుల మధ్య సఖ్యత చేకూర్చి ‘శ్రీబాగ్‌’ ఒప్పందంలో కీలక పాత్ర పోషించారు.

 గాడిచెర్ల నోట రాయలసీమ  

రాయలసీమ పేరు వ్యాప్తిలోకి రావడానికి గాడిచెర్ల ప్రధాన కారణం. దత్త మండలాలు అన్న పేరు బానిసత్వానికి చిహ్నంగా ఉంది.. ఈ ప్రాంత ప్రజల ఆత్మగౌరవాన్ని పెంచేలా రాయలు ఏలిన సీమను రాయలసీమగా పేరు పెట్టాలంటూ 1928లో సర్వేపల్లి రాధాకృష్ణ అధ్యక్షతన నంద్యాలలో జరిగిన ఆంధ్ర మహాసభలో ప్రతిపాదించారు. అప్పటి నుంచి ఈ ప్రాంతానికి రాయలసీమ అనే పేరుతో పిలవడం మొదలై అది బహుళ వ్యాప్తి చెంది ఆఖరుకు అదే పేరు స్థిరపడింది.

అక్షరయాత్ర

1930 తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ గ్రంథాలయ, వయోజన ఉద్యమాలకు ఎంతగానో కృషి చేశారు. 1934 నుంచి జీవితాంతం గ్రంథాలయ సంఘానికి అధ్యక్షుడిగా పని చేశారు. వయోజన విద్య డైరెక్టర్‌గా ఆంధ్ర దేశమంతా పర్యటిస్తూ ప్రజలను అక్షరాస్యులుగా మార్చేందుకు కృషి చేశారు. అనేక గ్రామాల్లో గ్రంథాలయాలు ఏర్పడటానికి కారణమయ్యారు. నిరంతరం ప్రజల కోసం పని చేస్తూ.. వారితోనే గడుపుతూ అనారోగ్యానికి గురై చివరికి 1960 ఫిబ్రవరి 29న తుది శ్వాస విడిచారు.


బాపూ.. అందుకో మా పూజ

గాంధీజీకి పూజలు చేస్తున్న విద్యార్థులు

ముందుండి ఉద్యమాన్ని నడిపించి.. భావితరాలకు స్వాతంత్య్రాన్ని బహుమతిగా అందించి.. మహాత్ముడిగా అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన గాంధీజీ నిత్యం పూజలందుకుంటున్నారు. ఆదోని పురపాలక ఉన్నత పాఠశాల మైదానంలో 1930లో ఏర్పాటు చేసిన సభలో గాంధీ మాట్లాడారు. అందుకు గుర్తుగా పాఠశాలలో నాటి ప్రధానోపాధ్యాయుడు ప్రాణేష్‌రావు ఆధ్వర్యంలో 1975లో మహాత్ముడి పాలరాతి  విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 1857 మొదటి స్వాతంత్య్ర సంగ్రామం నుంచి 1950 వరకు సంపూర్ణ స్వరాజ్యం సిద్ధించే వరకు నాటి పోరాటాలను చిత్రాల రూపంలో చిత్రించారు. ఉప్పు సత్యాగ్రహం,  క్విట్‌ ఇండియా ఉద్యమం, విదేశీ వస్తు బహిష్కరణ, బ్రిటిష్‌ వారితో భారతీయుల పోరాట ఘట్టాలు చిత్రాల రూపంలో   ఉంచారు. విద్యార్థులు గాంధీజీ విగ్రహానికి నిత్య పూజలు చేసి మహాత్ముడిని స్మరించుకుంటున్నారు.

- న్యూస్‌టుడే, ఆదోని పురపాలకం


గాంధీజీ అడుగులో అడుగేస్తూ..

1913లో జైలు నుంచి విడుదల కాగానే ఆంధ్ర పత్రికకు కొంతకాలం సంపాదకుడిగా పని చేశారు. 1916లో హోంరూల్‌ ఉద్యమంలో పాల్గొన్నారు. 1920లో గాంధీ ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని వారి వెంట ఆంధ్ర దేశమంతా పర్యటించి గాంధీ ఉపన్యాసాలను తెలుగులోకి అనువదించారు. తెలుగు, ఇంగ్లిషు, హిందీ, కన్నడ, మరాఠీ, తమిళ భాషలను గాడిచెర్ల అనర్గళంగా మాట్లాడేవారు. ‘ది నేషనలిస్ట్‌’ అనే ఆంగ్ల పత్రికను కొంత కాలం నడిపారు.


చిత్రలేఖనంలో దేశాభిమానం

హేమచంద్ర, పదోతరగతి

నా పేరు హేమచంద్ర. పదోతరగతి చదువుతున్నా. చదువుతో పాటు చిత్రలేఖనంపై దృష్టి సారించా. సమయం దొరికినప్పుడల్లా ఆర్ట్స్‌ గదికి వెళ్లి చిత్రలేఖనం సాధన చేస్తా. దేశ స్వాతంత్య్రం కోసం పోరాటాలు చేసిన  చంద్రశేఖర ఆజాద్, గాంధీజీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, అల్లూరి సీతారామరాజు, సర్దార్ వల్లభాయ్‌ పటేల్‌ తదితర నాయకుల చిత్రాలు గీసి ప్రదర్శనలో పాల్గొన్నా. 2017, 18లో జాతీయస్థాయి పోటీల(నవోదయ) పరిధిలో రెండుసార్లు రెండో స్థానంలో నిలిచి అవార్డు అందుకున్నా. ఆజాదీ కా అమృత్ కార్యక్రమంలో భాగంగా జాతీయ పోటీలకు సుభాష్‌ చంద్రబోసు, మహాత్మాగాంధీజీ, భారతదేశం, పావురాలు వంటి చిత్రాలు గీసి పోటీల్లో ఉంచాను.

-న్యూస్‌టుడే ఎమ్మిగనూరు


పంపించాల్సిన వాట్సప్‌ నంబరు మీరూ పంపించండి

దేశ వ్యాప్తంగా స్వాతంత్య్ర వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. పిల్లలూ ఈ వేడుకల్లో మీరూ భాగస్వాములు కండి. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు ప్రతిబింబించేలా మీరు గీసిన చిత్రాలు, స్వాతంత్య్ర ఉద్యమ సమరంలో జిల్లాలో జరిగిన ఘటనల పాత చిత్రాలు తదితర అంశాలు పంపించొచ్చు. వాటిని ఎంపిక చేసి మీ ఫొటో, మీ పేరుతో ప్రచురిస్తాం.

800 877 1080


తిరంగా పరుగులు

ఆజాదీకా అమృత్‌ మహోత్సవంలో భాగంగా నగరంలో స్కేటింగ్‌ క్రీడాకారులు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. డీఎస్‌ఏ స్టేడియం నుంచి కొండారెడ్డి బురుజు వరకు చిన్నారులు మంగళవారం స్కేటింగ్‌ చేస్తూ ప్రదర్శనలో పాల్గొన్నారు. ముందుగా యాక్సిస్‌ బ్యాంకు మేనేజర్‌ అవినాష్‌రెడ్డి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్కేటింగ్‌ సంఘం జిల్లా కార్యదర్శి సునీల్‌కుమార్‌, శిక్షకుడు అబూబకర్‌, వ్యాయామ ఉపాధ్యాయులు విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

-న్యూస్‌టుడే, వెంకటరమణ కాలనీ

Read latest Kurnool News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని