logo

ఇసుకాసురుల దారిదోపిడీ

అధికార పార్టీ నేతల అండదండలతో ఇసుకను తోడేస్తున్నారు. వందల మెట్రిక్‌ టన్నుల లోడుతో లారీలను తిప్పుతుండటంతో.. రహదారులు రూపుకోల్పోతున్నాయి. తారు చెదిరి.. వాహనదారులను బెదిరిస్తున్నాయి.

Published : 27 Apr 2024 05:09 IST

ఈనాడు, కర్నూలు: అధికార పార్టీ నేతల అండదండలతో ఇసుకను తోడేస్తున్నారు. వందల మెట్రిక్‌ టన్నుల లోడుతో లారీలను తిప్పుతుండటంతో.. రహదారులు రూపుకోల్పోతున్నాయి. తారు చెదిరి.. వాహనదారులను బెదిరిస్తున్నాయి. అడుగడుగునా గోతులు పడి.. గండాలు తెచ్చిపెడుతున్నాయి. ఆంధ్ర-కర్ణాటక రాష్ట్రాలకు పరీవాహక ప్రాంతంగా ఉన్న తుంగభద్ర నదితో పాటు పలు రేవుల్లో ఇష్టానుసారంగా ఇసుకను తోడేస్తున్నారు. భారీ వాహనాలు రహదారులపై రాకపోకలు సాగిస్తుండటంతో తారు చెదిరిపోయి.. కంకర తేలుతోంది. పలు చోట్ల భారీ గుంతలు ఏర్పడ్డాయి. ఇసుక వ్యాపారం వైకాపా నాయకులకు ఆదాయ వనరుగా  మారింది. నిత్యం వందల టిప్పర్లు, ట్రాక్టర్లతో ఇసుకను వేదవతి నుంచి ఆలూరు, ఆదోని, సి.బెళగల్‌, కౌతాళం, కోడుమూరు, బళ్లారి వంటి ప్రాంతాలకు తరలించి జేబులు నింపుకొంటున్నారు. దారులు చెదిరిపోవడమే కాకుండ భూగర్భ జలాలు తగ్గిపోయాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక రవాణాపై గతంలో అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం లేదని పేర్కొంటున్నారు.

కంకర పోసి..ఇబ్బందులు తెచ్చి: సి.బెళగల్‌ మండలం కొత్తకోట నుంచి కె.సింగవరం రహదారిపై కంకర పోశారు. నిత్యం భారీ ఇసుక వాహనాలు తిరగడంతో వాహనచోదకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కి.మీ.ల మేర దెబ్బతిన్నా.. పట్టించుకోరు: రేమట-ఉల్చాల రహదారి ఇలా గోతులమయంగా మారింది. కొత్తకోట నుంచి భారీ ఇసుక వాహనాలు తిరగడంతో కి.మీల మేర రహదారి దెబ్బతిని అధ్వానంగా మారింది. కొత్తకోట నుంచి రోడ్డు నిర్మాణ పనులు చేపట్టినా బిల్లులు రాకపోవడంతో గుత్తేదారు పనులు మధ్యలో వదిలేశారు.

అంతా అస్తవ్యస్తం: జి.సింగవరం వద్ద అధిక లోడుతో ఇసుక వాహనాలు తిరగడంతో రహదారి అస్తవ్యస్తంగా మారింది. రాకపోకలు సాగించేందుకు ఇబ్బందిగా  మారిందని వాహనదారులు వాపోతున్నారు.

ఈ దారి ప్రమాదకారి: ఇసుక టిప్పర్ల వాహనాలతో ఆర్‌.కొంతలపాడు ప్రధాన దారి గుంతలమయంగా మారింది. ఈ దారిలో వాహనదారులు ఏ మాత్రం అజాగ్రత్తగా  వాహనాలు నడిపినా ప్రమాదం జరిగే అవకాశం ఉంది.

దుమ్ము లేస్తోంది: కర్నూలు మండలం సుంకేసుల నుంచి సి.బెళగల్‌ మండలం కొత్తకోట రహదారిపై కి.మీ.ల మేర కంకర పోశారు. ఈ దారిలో భారీ ఇసుక వాహనాలు తిరగడంతో దుమ్ము లేస్తోందని వాహనదారులు వాపోతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని