logo

ఆలస్యమైతే.. బుగ్గిపాలే

ఎండ తీవ్రత, గ్యాస్‌ లీకేజీలతో అగ్ని ప్రమాదాలు జరిగి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. కర్నూలు జిల్లాలోని వెల్దుర్తి, కృష్ణగిరి మండలాల్లో అగ్నిమాపక కేంద్రం లేకపోవడంతో ప్రమాదాలు జరిగితే నంద్యాల జిల్లాలోని డోన్‌ నుంచి అగ్నిమాపక వాహనం రావాల్సిందే.

Published : 27 Apr 2024 05:00 IST

వెల్దుర్తి పాతబస్టాండు సమీపంలో జరిగిన అగ్నిప్రమాదం

వెల్దుర్తి, న్యూస్‌టుడే: ఎండ తీవ్రత, గ్యాస్‌ లీకేజీలతో అగ్ని ప్రమాదాలు జరిగి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. కర్నూలు జిల్లాలోని వెల్దుర్తి, కృష్ణగిరి మండలాల్లో అగ్నిమాపక కేంద్రం లేకపోవడంతో ప్రమాదాలు జరిగితే నంద్యాల జిల్లాలోని డోన్‌ నుంచి అగ్నిమాపక వాహనం రావాల్సిందే. పత్తికొండ నియోజకవర్గంలో వెల్దుర్తి, కృష్ణగిరి, తుగ్గలి, పత్తికొండ, మద్దికెర మండలాలు ఉన్నాయి. పత్తికొండలోని అగ్నిమాపక కేంద్రం సమీపంలోని మద్దికెర, తుగ్గలి మండలాలకు దగ్గరగా ఉండటంతో ఆయా ప్రాంతాల్లో జరిగే ప్రమాదాలను నివారిస్తున్నారు. కాగా.. నియోజకవర్గ కేంద్రానికి 70 కి.మీ. దూరంలో ఉన్న వెల్దుర్తి, కృష్ణగిరి మండలాలకు మాత్రం అగ్నిమాపక వాహనం వచ్చే అవకాశం లేదు. దీంతో ఈ మండలాల్లో అగ్ని ప్రమాదం సంభవిస్తే నంద్యాల జిల్లాలోని డోన్‌ నుంచి అగ్నిమాపక వాహనం వస్తోంది. ఆ వాహనం ప్రమాద స్థలానికి చేరుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది.

పాలకులు సమస్యను పరిష్కరించాలి

పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి సొంత మండలమైన వెల్దుర్తికి అగ్నిమాపక కేంద్రం అవసరం ఉంది. ఈ మేరకు వెల్దుర్తిలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఈ ప్రాంతంలో కేంద్రం ఏర్పాటు చేస్తే వెల్దుర్తి, కృష్ణగిరి మండలాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఈ రెండు మండలాల్లో 70 గ్రామాలు ఉన్నాయి. పాలకులు గుర్తించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

జీవనాధారం కోల్పోయాను:

రామకృష్ణ, సెలూన్‌ దుకాణ నిర్వాహకులు

వెల్దుర్తి పాత బస్టాండు సమీపంలో సెలూన్‌ దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నా. ఈ నెల 24న జరిగిన అగ్ని ప్రమాదంలో దుకాణం పూర్తిగా కాలిపోయింది. రూ.4లక్షల మేర నష్టం జరిగింది. జీవనాధారంగా ఉన్న దుకాణం కాలిపోవడంతో దిక్కుతోచడం లేదు. అగ్నిమాపక వాహనం అందుబాటులో ఉంటే నష్టం జరిగి ఉండేది కాదు.

జరిగిన సంఘటనలు

  • వెల్దుర్తి పాత బస్టాండు సమీపంలో ఈ నెల 24న ఓ దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు మరో రెండు దుకాణాలకు వ్యాపించాయి. దీంతో మూడు దుకాణాలు పూర్తిగా కాలిపోయాయి. విషయం తెలుసుకున్న డోన్‌లోని అగ్నిమాపక వాహనం ఘటన స్థలానికి చేరుకునేలోగా నష్టం జరిగిపోయింది.
  • ఈ నెల 9న వెల్దుర్తిలోని ఐజీ నగర్‌లో గ్యాస్‌ లీకై ప్రశాంతి అనే గృహిణి అగ్ని ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డారు. అగ్నిమాపక వాహనం ఘటనా స్థలానికి ఆలస్యంగా చేరుకోవడంతో ఇంట్లో మంటలు వ్యాపించాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని