logo

నేతలకు కాసుల పంట.. రైతులకు కడుపు మంట

‘‘వ్యవసాయ పంటల మార్కెటింగ్‌లో కీలకపాత్ర వహించే ఏఎంసీలు (వ్యవసాయ మార్కెట్‌ యార్డులు) జగన్‌ పాలనలో నిర్వీర్యమయ్యాయి. అన్నదాతలకు కనీస సేవలందించలేదు. తెదేపా హయాంలో కళకళలాడిన ఏఎంసీలు ప్రస్తుతం శాఖాపరమైన కార్యకలాపాలతో సరిపెట్టుకుంటున్నాయి.

Published : 27 Apr 2024 05:14 IST

జగన్‌ హయాంలో నిర్వీర్యమైన ఏఎంసీలు
రూ.కోట్ల ఆదాయం వస్తున్నా అన్నదాతకు వెచ్చించింది శూన్యం  

‘‘వ్యవసాయ పంటల మార్కెటింగ్‌లో కీలకపాత్ర వహించే ఏఎంసీలు (వ్యవసాయ మార్కెట్‌ యార్డులు) జగన్‌ పాలనలో నిర్వీర్యమయ్యాయి. అన్నదాతలకు కనీస సేవలందించలేదు. తెదేపా హయాంలో కళకళలాడిన ఏఎంసీలు ప్రస్తుతం శాఖాపరమైన కార్యకలాపాలతో సరిపెట్టుకుంటున్నాయి. రూ.వందల కోట్ల విలువైన గిడ్డంగులు, విశాలమైన ఫ్లాట్‌ఫామ్‌లు, ఖాళీ స్థలాలు నిరుపయోగంగా మారాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వందల సంఖ్యలో ఉన్న ఉద్యోగుల సేవలను వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది.’’

న్యూస్‌టుడే, కర్నూలు సచివాలయం

వసూళ్లలో నంద్యాల జిల్లా వెనుకబాటు

2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆదోని మార్కెట్‌ కమిటీకి నిర్దేశించిన లక్ష్యం రూ.16.10 కోట్లు కాగా వర్షాభావ పరిస్థితులు, పత్తి దిగుబడులు భారీగా తగ్గడంతో రూ.14.16 కోట్లు మాత్రమే వసూలైంది. కర్నూలు మార్కెట్‌ కమిటీ నుంచి రూ.6.15 కోట్లు వసూలు చేయాలని లక్ష్యం నిర్ణయించగా రూ.7.57 కోట్లు వసూలవడం విశేషం. కర్నూలు జిల్లాలో ఏడు మార్కెట్‌ కమిటీల పరిధిలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో మార్కెట్‌ ఫీజు వసూళ్లలో లక్ష్యాన్ని అధిగమించింది. మార్కెటింగ్‌ శాఖ రూ.30.85 కోట్లు లక్ష్యం విధించగా రూ.32.75 కోట్లకుపైగా వసూలవడం విశేషం. ఆదోని, కోడుమూరు మార్కెట్‌ కమిటీలు మినహా మిగిలిన కర్నూలుతోపాటు మరో నాలుగు మార్కెట్‌ కమిటీలు లక్ష్యాలను అధిగమించాయి. 2023-24లో తీవ్ర వర్షాభావంతో పంట దిగుబడులు తగ్గినప్పటికీ అన్నిరకాల పంటల ధరలు మెరుగ్గా ఉండటంతో మార్కెట్‌ ఫీజు బాగా వసూలైంది.  

  • నంద్యాల జిల్లాలో ఎనిమిది మార్కెట్ల పరిధిలో రూ.25.50 కోట్లు లక్ష్యం కాగా రూ.23 కోట్లు మాత్రమే వసూలైంది. ఆదోని, కోడుమూరుతోపాటు నంద్యాల జిల్లాలోని మార్కెట్‌ కమిటీలు నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోలేకపోయాయి.  
  • గత మూడేళ్లలో సరాసరిన రూ.47 కోట్ల నుంచి రూ.55 కోట్లకుపైగా మార్కెట్‌ ఫీజు (సెస్సు) వసూలవుతోంది. అన్ని మార్కెట్‌ కమిటీలు బాగా పనిచేస్తే ఏటా రూ.100 కోట్ల ఆదాయం వచ్చే అవకాశముంది. ఉమ్మడి కర్నూలు జిల్లా మార్కెటింగ్‌ అధికారులు ఆ దిశగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగిన దాఖలాలు లేవు.

అన్నదాతకు అందని సాయం

ఏటా రూ.కోట్ల ఆదాయం వస్తున్నా.. మార్కెట్‌ కమిటీల్లో మౌలిక సదుపాయాలు, వసతులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. మార్కెట్‌ కమిటీల నుంచి వచ్చే ఆదాయాన్ని సైతం వైకాపా ప్రభుత్వం ఇతర పథకాలు, నవరత్నాలకు దారి మళ్లించడంతో మార్కెట్‌ కమిటీల్లో అభివృద్ధి అంతంతమాత్రంగానే ఉంది.  కనీసం తాగునీరు, మరుగుదొడ్లు లేని పరిస్థితి ఉంది. మార్కెట్లకు వచ్చే రైతులకు బీమా సౌకర్యం లేదు. వైద్య సదుపాయాలు కరవయ్యాయి. మార్కెట్‌కు పంట ఉత్పత్తులను తీసుకొచ్చిన రైతు ప్రమాదవశాత్తు చనిపోతే బీమా పరిహారం కూడా ఇవ్వలేని దుస్థితి నెలకొంది. మార్కెట్‌ కమిటీల ఛైర్మన్లు, పాలకవర్గాలు ఐదేళ్లు ఉత్సవ విగ్రహాలుగా ఉన్నారు. మార్కెట్‌ కమిటీల ఆదాయం ఇతర మార్గాల్లో మళ్లిపోతుంటే నాబార్డు దగ్గర రుణాలు తెచ్చుకొని అభివృద్ధి పనులు చేపట్టే పరిస్థితి నెలకొంది.

నాలుగింటిలోనే క్రయవిక్రయాలు

ఉమ్మడి జిల్లాలో 15 మార్కెట్‌ కమిటీలుండగా.. కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, నంద్యాల మార్కెట్‌ కమిటీల్లో పంటల క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. ఎమ్మిగనూరు, నందికొట్కూరు తదితర వాటిల్లో నామమాత్రంగా జరుగుతోంది. అన్నింటిలో క్రయవిక్రయాలు జరిపేలా మార్కెటింగ్‌ శాఖ దశాబ్దాలుగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలున్నాయి. కేవలం మార్కెట్‌యార్డుల పరిధిలో ఉండే చెక్‌పోస్టుల నుంచి మాత్రమే సెస్సు వసూలు చేస్తున్నారు. రైతులు పండించిన పంట ఉత్పత్తులకు మద్దతు ధర లేదా గిట్టుబాటు ధర కల్పించేలా మార్కెటింగ్‌ శాఖ అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉన్నా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.

అధికార పార్టీ నేతల గుప్పిట్లోనే చెక్‌పోస్టులు

ఉమ్మడి కర్నూలు జిల్లాలో 15 మార్కెట్‌ కమిటీలుండగా.. కర్నూలు జిల్లాలోని ఏడు మార్కెట్‌ కమిటీల పరిధిలో 10 చెక్‌పోస్టులున్నాయి. మిగిలిన వాటి పరిధిలో 20 చెక్‌పోస్టులు ఉన్నాయి. రైతులు పండించే పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్న వ్యాపారులు తప్పనిసరిగా ఆయా మార్కెట్‌ కమిటీలకు ఒక్క శాతం మార్కెటింగ్‌ ఫీజు (సెస్‌) చెల్లించాలి. సెస్సు ఎగ్గొట్టకుండా ఏర్పాటుచేసిన చెక్‌పోస్టుల వద్ద మార్కెట్‌ కమిటీల కార్యదర్శులు, సూపర్‌వైజర్లు, సెక్యూరిటీ గార్డులు పనిచేస్తున్నారు. అధికార పార్టీ నేతలు, వ్యాపారులు కుమ్మక్కై మార్కెట్‌ ఫీజు చెల్లించకుండానే పంట ఉత్పత్తులు తరలిస్తున్నారనే విమర్శలున్నాయి. అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే చెక్‌పోస్టులు నడుస్తున్నాయని పలువురు విమర్శిస్తున్నారు. అటు వ్యాపారుల నుంచి ఇటు మార్కెట్‌ కమిటీల నుంచి నేతలు జేబులు నింపుకొంటున్నారు. ఈ అక్రమ ఆదాయం కోసమే మార్కెట్‌ కమిటీల ఛైర్మన్‌ పోస్టులు తమకే ఇవ్వాలంటూ ప్రజాప్రతినిధుల దగ్గర పైరవీలు చేసిన ఘటనలు లేకపోలేదు.

పంట పొలాల దారులు కాదు.. ప్రధాన మార్గాల అభివృద్ధికే..

ఉమ్మడి కర్నూలు జిల్లాలో వ్యవసాయ మార్కెట్ల నుంచి సరాసరి రూ.50 కోట్ల ఆదాయం వస్తోంది. వచ్చిన దాంట్లో కొంత బడ్జెట్‌ను గ్రామీణ పల్లెల్లో రైతుల పంట పొలాలకు వెళ్లే రహదారులను అభివృద్ధి చేయాల్సి ఉంది. అలాంటి రహదారులను అభివృద్ధి చేయకుండా పంచాయతీరాజ్‌ శాఖ ద్వారా జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల నుంచి గ్రామీణ ప్రాంతాల రహదారులకు నిధులు వెచ్చిస్తున్నారు. కర్నూలు జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో 60 పనులకు సంబంధించి రూ.21.82 కోట్లు, నంద్యాల జిల్లాలో ఆరు నియోజకవర్గాల్లో 39 పనులకు రూ.15.04 కోట్లు కలిపి ఉమ్మడి జిల్లాలో రూ.36.86 కోట్లతో బీటీ రోడ్లు, ప్రస్తుతం ఉన్న రహదారులకు మరమ్మతులు, ప్రధాన రహదారుల నుంచి పల్లెలకు వెళ్లే దారులను అభివృద్ధి చేసేందుకు 99 పనులను పంచాయతీరాజ్‌ శాఖ ద్వారా చేపట్టనున్నారు. ఈ మేరకు ఆయా గుత్తేదారులకు పనులను కేటాయించినా నిధులు రాక పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి.

రైతు సేవకు నిధులు

గతంలో ఏఎంసీలు రైతులతో కళకళలాడేవి. ఏడాదికి రూ.కోటి నుంచి రూ.2 కోట్లతో డొంక రహదారులు, పంట పొలాలకు వెళ్లే రహదారులను అభివృద్ధి చేసేవారు. సదస్సులు నిర్వహించి పంటల మార్కెట్‌ ధరలు, పెరుగుదల, తగ్గుదల, వివిధ పంట సాగుపై అవగాహన కల్పించేవారు. వ్యవసాయ యాంత్రీకరణ, నూతన వంగడాలు, సేంద్రియ సాగు, ఉద్యాన పంటలపై వ్యవసాయ శాస్త్రవేత్తలతో సమావేశాలు నిర్వహించేవారు. ప్రస్తుతం అన్నీ కనుమరుగయ్యాయి. రైతుబంధు పథకం సైతం అటకెక్కింది. ప్రస్తుతం గతంలో ప్రత్యేక నిధుల నుంచి రుణాన్ని 24 గంటల్లోనే రైతులకు అందజేసేవారు. ప్రసుత్తం ఆ పరిస్థితి కానరావడం లేదు.

15 మార్కెట్‌ కమిటీలు

ఉమ్మడి కర్నూలు జిల్లాలో కర్నూలు, కోడుమూరు, మంత్రాలయం, ఎమ్మిగనూరు, ఆదోని, ఆలూరు, పత్తికొండ, నంద్యాల, డోన్‌, నందికొట్కూరు, ఆత్మకూరు, బనగానపల్లి,, పాణ్యం, ఆళ్లగడ్డ, కోవెలకుంట్ల కలిపి మొత్తం 15 మార్కెట్‌ కమిటీలను గతంలో తాలుకా స్థాయిలో ఏర్పాటుచేశారు. రైతులు తమ పంట ఉత్పత్తులను అమ్ముకోవడంతోపాటు గిట్టుబాటు ధరలు వచ్చేలా చూడటంతోపాటు ఒక్క శాతం సెస్సు రూపంలో మార్కెట్‌ కమిటీలకు ఆదాయాన్ని రాబట్టాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని