logo

రక్షక భటులను దగా చేసిన జగన్‌

తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పోలీసుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తాం. వారికి రావాల్సిన బకాయిలు మొత్తం చెల్లిస్తాం. వారంతపు సెలవు అమలు చేస్తాం. వారికి అండగా ఉంటాం.

Published : 27 Apr 2024 05:11 IST

అటకెక్కిన వారాంతపు సెలవు

  • తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పోలీసుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తాం. వారికి రావాల్సిన బకాయిలు మొత్తం చెల్లిస్తాం. వారంతపు సెలవు అమలు చేస్తాం. వారికి అండగా ఉంటాం.

ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చెప్పిన మాటలివి..

  • ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక పోలీసు సంక్షేమాన్ని జగన్‌ అటకెక్కించారు. నిత్యం పోలీసు బందోబస్తు మధ్య తిరిగే ఆయన వారి కష్టాన్ని పట్టించుకోలేదు. నిత్యం పరదాల మాటున తిరుగుతూ.. కాన్వాయ్‌ వెంట పోలీసులను పరుగులు పెట్టించారు. తన భద్రత పేరుతో రూ.కోట్ల ప్రజాధనాన్ని మంచినీళ్లలా ఖర్చు చేశారు. నిత్యం పోలీసుల భద్రత మధ్య తిరిగే జగన్‌ వారికి రావాల్సిన బకాయిలు చెల్లించడంలో మాత్రం వంకలు పెడుతున్నారు.

కర్నూలు నేరవిభాగం, నంద్యాల నేరవిభాగం న్యూస్‌టుడే : ఉమ్మడి కర్నూలు జిల్లాలో 3,300 మంది పోలీసులు పనిచేస్తున్నారు. వీరిలో 30 శాతం మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. నిత్యం విధుల్లో ఉండాల్సి రావడం.. కనీసం వారాంతపు సెలవు కూడా లేకపోవడంతో తీవ్ర ఒత్తిడితో సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగుల లాగానే పోలీసులకు వారాంతపు సెలవు అవసరమని, కచ్చితంగా తాను అమలు చేస్తానని ఎన్నికల ముందు జగన్‌మోహన్‌రెడ్డి ఘనంగా హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన అనంతరం 2019, అక్టోబర్‌ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకుని వారాంతపు సెలవును ఘనంగా ప్రకటించారు. నెల రోజులపాటు పలు పోలీసుస్టేషన్లలో అమలైంది. దీంతో పోలీసు సిబ్బంది ఎంతగానో సంతోషించారు. మరుసటి నెలకే అటకెక్కింది.

ప్రజా ఉద్యమాల నేపథ్యంలో..

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన పోలీసులకు తీవ్ర అవస్థలు మిగులుస్తోంది. ఇచ్చిన హామీని నిలబెట్టుకోక వారి సంక్షేమాన్ని జగన్‌ అటకెక్కించారు.   క్రమశిక్షణ కలిగిన శాఖ కావటంతో ప్రశ్నించలేక పోలీసులు నలిగిపోతున్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో అన్ని ప్రాంతాల్లో ఉద్యమాలు ఉద్ధృతమయ్యాయి. ఈ నేపథ్యంలో విశాఖపట్నం వంటి సుదూర ప్రాంతాల్లో బందోబస్తు విధులు నిర్వహించాల్సి రావడం.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ఆందోళనలు అణిచివేత బాధ్యతలు పెరిగిపోవటంతో వారాంతపు సెలవు అటకెక్కింది. అత్యవసర సెలవులు తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో పనిభారం పెరిగిపోయి తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు.

ఎన్నికల సమయాన ఎరేస్తూ..

తీవ్ర అసంతృప్తితో ఉన్న పోలీసు సిబ్బందిని ఎన్నికల నేపథ్యంలో కాకాపట్టేందుకు వైకాపా ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. గడిచిన కాలంలో పోలీసు అధికారుల సంక్షేమాన్ని పట్టించుకోని జగన్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో వారి సేవలు అవసరం కావడంతో వారిని తనవైపు మళ్లించుకునేందుకు చూస్తోంది. ఇందులో భాగంగా గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉంచిన సరెండర్‌ లీవ్‌లకు సంబంధించిన మొత్తాలను శుక్రవారం అకస్మాత్తుగా జమ చేసింది. ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తున్న పోలీసులు ఉదయం ఖాతాల్లో నగదు జమ కావటంతో ఆశ్చర్యపోయారు. ప్రయోజనాల మంజూరు విషయంలో గందరగోళం నెలకొంది. కర్నూలు జిల్లా పోలీసులకు ఒక సరెండర్‌ లీవ్‌ మొత్తం మాత్రమే జమకాగా నంద్యాల జిల్లా పోలీసులకు రెండు సరెండర్‌ లీవుల మొత్తాలు జమ చేశారు. రెండు జిల్లాలకు చెందిన పోలీసులకు ఇంకనూ రెండు సరెండర్‌ లీవులకు సంబంధించి మొత్తాలు పెండింగ్‌లో ఉంచటంతో వారు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. కొందరికి రెండు టీఏలు జమ చేయగా.. మరికొందరికి ఒక్క రూపాయి కూడా రాకపోవడం గమనార్హం.

ఆరోగ్య భద్రత ఏదీ?

ఉమ్మడి జిల్లాలో 14 ఆస్పత్రుల్లో మాత్రమే ఆరోగ్య భద్రత కింద చికిత్స పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. అవసరమైన వైద్యాలయాల్లో చికిత్స పొందే సౌకర్యం లేకపోవటం ఇబ్బందిగా మారింది. జీపీఏ, భద్రతా రుణాలు సకాలంలో మంజూరు కావడం లేదు. దరఖాస్తు చేసుకున్న ఆరు నెలలకుగానీ రాకపోవడంతో పలువురు ఉద్యోగులు అప్పులపాలయ్యారు. ఏడు డీఏలు, రెండు బోనస్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. పోలీసు సిబ్బంది వాటి కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు.  పీఆర్‌సీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. చివరికి అవన్నీ అడియాశలయ్యాయి. అవినీతి నిరోధకశాఖ, నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసే పోలీసులకు ఇచ్చే ప్రోత్సాహకాల్లో కోత విధించడం గమనార్హం. జగన్‌ పాలనతో అన్నివిధాలా నష్టపోయామని.. ఆరోగ్యం సైతం దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు సైతం సరిగా నిర్వర్తించలేని పరిస్థితి నెలకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని