logo

ఐదేళ్ల అధికారం.. 2కి.మీ కాల్వ నిర్మించలేదు

 శ్రీశైలం ఎగువన (ఫోర్‌ షోర్‌) సుమారు 4.8 కి.మీ. దూరంపాటు అప్రోచ్‌ కాలువ నిర్మించి 40 టీఎంసీల కృష్ణా జలాలను మల్యాల ఎత్తిపోతల పథకం వరకు తరలించి అక్కడ నీటిని ఎత్తిపోస్తున్నారు.

Published : 23 Apr 2024 04:14 IST

ముచ్చుమర్రి అప్రోచ్‌ కెనాల్‌ నిర్మాణాన్ని వదిలేసిన జగన్‌


గుర్తించిన తెదేపా

మల్యాల వద్ద హంద్రీనీవా సుజల స్రవంతి (హెచ్‌.ఎన్‌.ఎస్‌.ఎస్‌) ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో సుమారు 6.03 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు అందించాలని తెదేపా హయాంలో ప్రణాళిక రూపొందించారు.

వదిలేసిన వైకాపా

ముచ్చుమర్రి ఎత్తిపోతల.. రాయలసీమ జీవనాడి.. గత ప్రభుత్వ హయాంలో కేవలం 15 నెలల సమయంలో పూర్తి చేసింది.. ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్‌ కేవలం రెండు కిలోమీటర్లలోపు అప్రోచ్‌ కాలువ నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోయింది. ఫలితంగా ఆ పథకాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది.


నందికొట్కూరు, న్యూస్‌టుడే:  శ్రీశైలం ఎగువన (ఫోర్‌ షోర్‌) సుమారు 4.8 కి.మీ. దూరంపాటు అప్రోచ్‌ కాలువ నిర్మించి 40 టీఎంసీల కృష్ణా జలాలను మల్యాల ఎత్తిపోతల పథకం వరకు తరలించి అక్కడ నీటిని ఎత్తిపోస్తున్నారు. 565 కి.మీ. పొడవైన కాలువ నిర్మించి ఆ నీటిని రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాలకు తరలిస్తున్నారు. ఈ పథకం పనిచేయాలంటే శ్రీశైలంలో నీటిమట్టం 834 అడుగులు ఉండాలి. ఈ నేపథ్యంలో ముచ్చుమర్రి దగ్గర మరో ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. ఇక్కడ శ్రీశైలం నీటిమట్టం 798 అడుగులు ఉన్నా నీటిని ఎత్తిపోసేలా ప్రణాళికలు రూపొందించారు. ఆ మేరకు ఎత్తిపోతల పథకం నిర్మాణం పూర్తైనా శ్రీశైలం జలాశయం నీటిమట్టం 810 అడుగుల వరకు ఉన్నప్పుడు మాత్రమే నీటిని ఎత్తిపోయగలుగుతున్నారు. ముందుగా ప్రతిపాదించిన విధంగా శ్రీశైలం నీటిమట్టం 798 అడుగులు ఉన్న సమయంలో నీటిని ఎత్తిపోయాలంటే ప్రస్తుతం ఉన్న సుమారు 5.5 కి.మీ. పొడవైన అప్రోచ్‌ కాలువను కొంత వెడల్పు, మరికొంత లోతు చేయాలి.


కలగా విస్తరణ పనులు

ముచ్చుమర్రి అప్రోచ్‌ కాలువ నిర్మాణ పనులు సుమారు 3.5 కి.మీ. దూరంపాటు తెదేపా హయాంలోనే పూర్తయ్యాయి. కేవలం రెండు కి.మీ.లోపు మాత్రమే విస్తరణ పనులు పూర్తి చేయాల్సి ఉంది. గుత్తేదారుకు బిల్లులు చెల్లించలేకపోవడం.. ధరలు పెరిగినప్పటికీ అంచనాలు పెంచకపోవడంతో పనులు ఆగిపోయాయి. . దీని నిర్మాణానికి సుమారు రూ.30 కోట్లు ఖర్చవుతుందని అంచనా .వేశారు. 80శాతం పనులు పూర్తైనప్పటికీ మిగిలినవి ఎప్పటికీ పూర్తవుతాయన్నది ప్రశ్నార్థకంగా మారింది.ఫలితంగా శ్రీశైలం నీటిమట్టం 798 అడుగులు ఉన్నప్పుడు నీటిని ఎత్తిపోయాలన్న కల సాకారం కావడం లేదు.


అనుసంధానం ఆగింది

ముచ్చుమర్రి నుంచి 17.7 కి.మీ. దూరంలోని మల్యాల వరకు లింక్‌ కాలువ నిర్మించారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం దగ్గర ఎత్తిపోసిన నీటిని మల్యాలలోని హెచ్‌.ఎన్‌.ఎస్‌.ఎస్‌ వద్దకు తీసుకెళ్లేందుకు లింక్‌ కాలువ అత్యంత కీలకం. దీని విస్తరణ పనులు సైతం ఆగిపోవడంతో ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోలేని దుస్థితి తలెత్తింది


50శాతం సామర్థ్యంతోనే వినియోగం

ముచ్చుమర్రి దగ్గర హెచ్‌.ఎన్‌.ఎస్‌.ఎస్‌ కోసం మొత్తం 12 మోటార్లు, పంపులు ఏర్పాటు చేయగా ప్రస్తుతం ఆరింటిని మాత్రమే ఉపయోగించగలుగుతున్నారు. అప్రోచ్‌ ఛానెల్‌, లింక్‌ ఛానెల్‌ నిర్మాణాలు పూర్తయితే శ్రీశైలం నీటిమట్టం 798 అడుగులు ఉన్నప్పుడు సైతం తాగు, సాగునీటి అవసరాలకు వినియోగించుకునే అవకాశం ఉన్నా ఆ మేరకు పూర్తిస్థాయిలో వాడుకోవడం నేటికీ సాధ్యంకాని దుస్థితి తలెత్తింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని