logo

పారిశ్రామిక వాడ.. జగన్‌ విధ్వంస జాడ

వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత పరిశ్రమల ఏర్పాటు పక్కన పెట్టింది. తెదేపా ప్రభుత్వ హయాంలో ఏర్పాటుచేసిన శిలాఫలకాలను వైకాపా నాయకులు ధ్వంసం చేయడం తప్ప ఒక్క పరిశ్రమ ఏర్పాటుకు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

Published : 23 Apr 2024 04:38 IST

వైకాపా అరాచకం
న్యూస్‌టుడే, కర్నూలు సచివాలయం, ఓర్వకల్లు

వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత పరిశ్రమల ఏర్పాటు పక్కన పెట్టింది. తెదేపా ప్రభుత్వ హయాంలో ఏర్పాటుచేసిన శిలాఫలకాలను వైకాపా నాయకులు ధ్వంసం చేయడం తప్ప ఒక్క పరిశ్రమ ఏర్పాటుకు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

మీ కోసం పరి‘శ్రమిసా’్తం.. ఉన్న ఊళ్లో ఉపాధి కల్పిస్తాం.. వలసెళ్లాల్సి పని ఉండదంటూ పాదయాత్ర సమయంలో జగన్‌ ప్రగల్బాలు పలికారు. గద్దెనెక్కిన తర్వాత ‘రివర్స్‌’ నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారు. గత ప్రభుత్వం హయాంలో పునాదులు వేసిన పారిశ్రామిక ప్రాంతాలను పక్కన పడేశారు. డెడ్‌రెంట్‌ పెంచి నాపరాయి పరిశ్రమలు మూతపడేలా చేశారు.. వి‘పత్తి’లో ఆదుకోవడం మరిచారు.!! పారిశ్రామిక పార్కులంటూ భూములు సేకరించారు.. వాటిలో మౌలిక సదుపాయాలు మరిచారు. యువతరం ఉపాధి ఆశలను చిదిమేశారు.


మేలురకం విత్తుకోకుండా కుట్ర

ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ విత్తన కేంద్రంగా రూపొందించే లక్ష్యంతో నంద్యాల జిల్లా తంగడంచలో 623 ఎకరాల్లో రూ.670 కోట్లతో మెగా సీడ్‌ పార్కు ఏర్పాటు చేయాలని గతంలో తెదేపా ప్రభుత్వం నిర్ణయించింది. 2017 అక్టోబరు తొమ్మిదో తేదీన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు. విత్తన ఉత్పత్తి రంగానికి చెందిన పలు పరిశ్రమలూ ముందుకొచ్చాయి. అమెరికాలోని అయోవా విశ్వవిద్యాలయ సహకారంతో సీడ్‌ పార్కు ఏర్పాటు చేయాలని, రూ.670 కోట్ల మేర ఖర్చవుతుందని అప్పట్లో నిర్ణయించారు. 2018-19 బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించారు. ముందుకొచ్చిన కంపెనీలకు పలు రాయితీలు ప్రకటించారు. అందుబాటులోకి వస్తే 40 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కే అవకాశం ఉంది. తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం వీటన్నిటినీ పక్కన పెట్టింది.


కొరవడిన ప్రోత్సాహం

ఓర్వకల్లు మండలం గుట్టపాడులో నాటి తెదేపా ప్రభుత్వం ‘జైరాజ్‌ ఇస్పాత్‌’ ఉక్కు తయారీ పరిశ్రమకు 413.19 ఎకరాలు కేటాయించింది. రూ.2,938 కోట్లతో 2.2 మిలియన్‌ టన్నుల ఉక్కు తయారీ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు సదరు సంస్థ పనులు ప్రారంభించింది. ఈ ఒక్క పరిశ్రమలోనే 3,200 మందికి ప్రత్యక్షంగా, 12 వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించేలా ప్రణాళిక రూపొందించారు. ఉక్కు రంగ అభివృద్ధికి అవసరమైన ఫౌండ్రీస్‌, ఆక్సిజన్‌ ప్లాంట్లు, మెషిన్‌ షాప్స్‌, ఫోర్జింగ్‌, లాజిస్టిక్స్‌, కెమికల్‌ ల్యాబ్స్‌ ఏర్పాటయ్యే అవకాశం ఏర్పడింది. మరో 28 బేసిక్‌ మెటల్‌, ఎల్లాయిస్‌ పరిశ్రమలు పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపాయి. అవీ వస్తే సుమారు మరో 28 వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని నాటి తెదేపా ప్రభుత్వం అంచనా వేసింది. వైకాపా ప్రభుత్వ హయాంలో కొన్ని సంస్థలు హబ్‌ పరిధిలో భూములు తీసుకున్నా పనులు మాత్రం మొదలు పెట్టలేదు.


ఓర్వకల్లు ప్రాధాన్యం మరిచారు

‘ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌’ (ఓహెచ్‌ఎం) ప్రాజెక్టుకు తెదేపా ప్రభుత్వ హయాంలో శ్రీకారం చుట్టారు. హైదరాబాద్‌- బెంగళూరు రహదారి వెంట 11 గ్రామాల పరిధిలో గత తెదేపా హయాంలో 10,900 ఎకరాలను ప్రభుత్వం సేకరించి ఏపీఐఐసీకి అప్పగించింది. ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌ను నోడ్‌ పాయింట్‌గా కేంద్రం 2020 ఆగస్టులో నోటిఫై చేసింది. నోడ్‌ పరిధిలోకి పలు రెవెన్యూ గ్రామాలను చేర్చారు. పనులు పూర్తయితే ప్రత్యక్షంగా వెయ్యి, పరోక్షంగా మూడు వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది.

ఓర్వకల్లు ఇండస్ట్రియల్‌ హబ్‌ పరిధిలో పూడిచర్లలో 719.36 ఎకరాలు, కన్నమడకల 243.69, గుట్టపాడు 5,092.32, బ్రాహ్మణపల్లె 447.90, పాలకొలను 61.50, కొమరోలు-1లో 845.42 ఎకరాలు, కొమరోలు-2లో 619.69, సోమయాజులపల్లె 1,275.77.. ఇలా మొత్తం 9,305.65 ఎకరాలకు సంబంధించి ఓర్వకల్లు ఇండస్ట్రియల్‌ నోడ్‌ జీఐఎస్‌ ఆధారిత డ్రాఫ్ట్‌ మాస్టర్‌ ప్లాన్‌ను ఈ ఏడాది సెప్టెంబరులో ప్రకటించారు. కానీ ఇప్పటివరకు ముందుకు కదలలేదు.


తెదేపా సంకల్పం

తుంగభద్ర, కృష్ణమ్మ పారుతున్న నేల.. ఖనిజాల ఖిల్లా.. సాగు ఆధారిత జిల్లా.. దండిగా వనరుల ప్రాంతం.. మానవ వనరులకు కొదవలేదు..  ఉద్యోగాలు, ఉపాధి లేక వేలాది మంది ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి వలస వెళ్లాల్సి వస్తున్న నేపథ్యంలో జిల్లాలో పారిశ్రామికాభివృద్ధే లక్ష్యంగా గతంలో తెదేపా ప్రభుత్వం ఒ.ఎం.ఐ.హెచ్‌. ప్రాజెక్టును తెరపైకి తెచ్చింది. హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారికి ఆనుకుని ఈ హబ్‌ను అభివృద్ధి చేయాలని సంకల్పించింది.


నీళ్లు లేకుండా నిర్మాణాలు ఎలా?

‘ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌’ (ఓహెచ్‌ఎం)కు నీటి సదుపాయం కల్పించాలని వైకాపా రూ.560 కోట్లు కేటాయించింది. నీటిని సరఫరా చేసే పనులు పూర్తి చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. ముచ్చుమర్రి నుంచి కృష్ణా జలాలు తరలించాల్సి ఉంది. ఇందుకోసం ఏకంగా 57 కి.మీ.ల మేర పైపులైను ఏర్పాటు చేయాలి. ఇన్‌టేక్‌ వెల్‌, పంపింగ్‌ స్టేషన్లు, సంపులను నిర్మించాలి. రూ.288 కోట్లతో చేపడుతున్న పనులు సా...గుతున్నాయి. పారిశ్రామికవాడ అవసరాలకు వీలుగా ఒక టీఎంసీ సామర్థ్యంతో జలాశయాన్ని నిర్మించాల్సి ఉండగా ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం పక్కన పెట్టింది.


సేకరించారు.. ఖాళీగా ఉంచారు

ప్రతి నియోజకవర్గానికి ఒక ఎంఎస్‌ఎంఈ పార్కు అని ఐదేళ్లుగా చెబుతున్నారే తప్ప.. కార్యరూపం దాల్చడం లేదు. ఎంఎస్‌ఎంఈల కోసం కర్నూలు జిల్లాలో 4,542 ఎకరాలు సేకరించారు. అందులో ప్రస్తుతం 3,962 ఎకరాలు ఖాళీగా ఉంది. నంద్యాలలో 1,262 ఎకరాలకు 327 ఎకరాలు ఖాళీగా ఉన్నాయి.


మౌలిక వసతులు మమ

ఓర్వకల్లు మండల పరిధిలోని గుట్టపాడులో సిగాచీ ఇండస్ట్రీస్‌, ఆర్‌పీఎస్‌ ఇండస్ట్రీస్‌తో పాటు మారుతి సుజుకి, మరో ఐదు ఫార్మా కంపెనీలు ఏపీఐఐసీలో దరఖాస్తు చేసుకున్నాయి. ప్రైమో పాలిప్యాక్‌ (ప్లాస్టిక్‌ ఇండస్ట్రీ), బ్లాక్‌హ్యక్‌, ఎక్సైల్‌ ఇమ్యూన్‌ లాజిక్‌ ఇండియా ప్రై.లి. (వెటర్నరీ ఫార్మా) భారీ ఆక్సిజన్‌ తయారీ ప్లాంట్‌తో పాటు మరో 13 బడా కంపెనీలు పరిశ్రమల స్థాపనకు దరఖాస్తులు చేసుకున్నాయి.

పరిశ్రమల ఏర్పాటుకు మౌలిక సదుపాయాల కల్పన కూడా కీలకం. నీటి వసతితో పాటు విద్యుత్తు, అవసరమయ్యే గ్యాస్‌ సరఫరా, సీనరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌, వీధి దీపాల వ్యవస్థ, అంతర్గత రహదారుల నిర్మాణం తదితర పనులు చేపట్టాల్సి ఉంది. ప్రస్తుతం ఇక్కడ విద్యుత్తు సదుపాయం మినహా మిగిలిన వసతులను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయలేదు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత మౌలిక సదుపాయాలపై దృష్టి సారించలేదు. అక్కడ నీటి వసతి లేకపోతే పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రావడం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని