logo

ప్రతి గ్రామానికి సాగునీరందిస్తాం

సిద్ధాపురం చెరువు వద్ద ప్రత్యేక తూము ఏర్పాటుచేసి పక్కనున్న ఐదారు గ్రామాలకు సాగునీరందిస్తామని శ్రీశైలం నియోజకవర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బుడ్డా రాజశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు.

Published : 05 May 2024 02:46 IST

బైర్లూటి గూడెంలో చెంచులతో మాట్లాడుతున్న బుడ్డా

ఆత్మకూరు, న్యూస్‌టుడే : సిద్ధాపురం చెరువు వద్ద ప్రత్యేక తూము ఏర్పాటుచేసి పక్కనున్న ఐదారు గ్రామాలకు సాగునీరందిస్తామని శ్రీశైలం నియోజకవర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బుడ్డా రాజశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆత్మకూరు మండలంలోని వెంకటాపురం, బైర్లూటి గూడెం, సంజీవనగర్‌ తండా, సిద్ధాపురం గ్రామాల్లో శనివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బుడ్డా మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీశైలంలో రూ.70 కోట్లతో ఆరున్నర కి.మీలు రింగ్‌రోడ్డు నిర్మిస్తే దాన్ని శిల్పా చేసినట్లు తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారన్నారు. శ్రీశైల దేవస్థాన మాన్యం భూమి 5,300 ఎకరాలు దేవస్థానానికి తానే ఇప్పించినట్లు శిల్పా చెప్పుకోవడం దారుణమన్నారు. గత తెదేపా హయంలో ఆత్మకూరులో తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.116 కోట్ల మంజూరు చేయిస్తే దాన్ని ప్రస్తుత నాయకులు ఆపివేశారని చెప్పారు. తెల్లరేషన్‌ కార్డుదారులందరికి వివాహనికి రూ.లక్ష ఇస్తామన్నారు.

సారా మానేస్తే మీరు కోరినవన్నీ ఇస్తా

జగన్‌ ప్రభుత్వంలో రద్దు చేసిన ప్రత్యేక చెంచు ఉపాధి పథకం మళ్లీ తీసుకొస్తామని బుడ్డా అన్నారు. నాగలూటి గూడేనికి చెందిన బయ్యన్న మాట్లాడుతూ గూడేంలో రహదారి, తాగునీటి కుళాయిలతో పాటు గృహాలు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే జంగిల్‌ సఫారిలో చెంచులకు ఉద్యోగాలు ఇప్పించాలన్నారు. విషయంపై బుడ్డా మాట్లాడుతూ చెంచులకు ఇళ్లు, ఇంటింటికి నీటి కుళాయి ఏర్పాటు చేస్తామన్నారు. చంద్రబాబును అడిగి భూములు కూడా ఇచ్చేందుకు కృషి చేస్తామన్నారు. చెంచు యువకులు తాగుడు మానేస్తే ఉద్యోగాలు చేసుకోవచ్చన్నారు. యువతులకు ఉద్యోగాలు ఇస్తామన్నారు. సారా మానేల చూడాలని చెంచు మహిళలు కోరగా దానికి బుడ్డా సారా మానుకుంటామని మాట ఇస్తే మీరు కోరినవన్నీ తీరుస్తానని చెప్పారు.

మద్యం నిషేధంపై మాట తప్పిన జగన్‌: తెదేపా

కొలిమిగుండ్ల, న్యూస్‌టుడే: ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో అధికారం చేపట్టిన వెంటనే మద్యనిషేధం అమలు చేస్తానని మాటిచ్చి ప్రస్తుతం మాట తప్పారని బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. శనివారం ‘ప్రజాగళం’లో భాగంగా మండలంలోని బందార్లపల్లె, తుమ్మలపెంట, గొర్విమానుపల్లె గ్రామాల్లో రోడ్‌ షోలను నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతు నవరత్నాల పేరిట జగన్‌ నవమోసాలకు పాల్పడ్డారన్నారు. విద్యుత్తు, ఆర్టీసీ ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని తెలిపారు. మల్లారెడ్డి, కల్యాన్‌రెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, నరసింహ్ముడు, బాలస్వామిరెడ్డి, రామేశ్వరెడ్డి, శివారెడ్డి, వుశేన్‌రెడ్డి, రాము పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని