logo

జగన్‌ ‘భూ’భక్ష చట్టం

ఖాళీ భూమి కనిపిస్తే చాలు.. వైకాపా నాయకులు గద్దల్లా వాలిపోతున్నారు.. ఆక్రమణల జెండా పాతేస్తున్నారు.. ఐదేళ్ల వైకాపా హయాంలో రూ.కోట్ల విలువైన దేవాదాయ, ప్రభుత్వ, వక్ఫ్‌, అసైన్డ్‌, ప్రైవేటు భూములు పెద్దఎత్తున ఆక్రమణలకు గురయ్యాయి.

Published : 05 May 2024 03:05 IST

ప్రభుత్వ తీరుపై రైతుల మండిపాటు
ల్యాండ్‌ టైటిలింగ్‌పై ఆందోళన

ఖాళీ భూమి కనిపిస్తే చాలు.. వైకాపా నాయకులు గద్దల్లా వాలిపోతున్నారు.. ఆక్రమణల జెండా పాతేస్తున్నారు.. ఐదేళ్ల వైకాపా హయాంలో రూ.కోట్ల విలువైన దేవాదాయ, ప్రభుత్వ, వక్ఫ్‌, అసైన్డ్‌, ప్రైవేటు భూములు పెద్దఎత్తున ఆక్రమణలకు గురయ్యాయి. ఇది చాలదన్నట్లు ఆంధ్రప్రదేశ్‌ భూయాజమాన్య హక్కు చట్టం (ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్‌్్ట)-2023 అంటూ కొత్త చట్టాన్ని వైకాపా ప్రజలపై ప్రయోగిస్తోంది. ‘‘ ఇది భూ రక్షణ చట్టం కాదని.. భూ భక్షణ చట్టం.. దీనిని అడ్డుపెట్టుకొని అక్రమార్కులు ప్రజల భూములను స్వాధీనం చేసుకునే ప్రమాదముందని విశ్రాంత రెవెన్యూ అధికారులు, న్యాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

న్యూస్‌టుడే,  కర్నూలు సచివాలయం

మూలాలు చెరిపివేత

  • వందేళ్లకు పైబడి భూములకు సంబంధించి సర్వే నంబర్లు, అడంగల్‌, ఆర్‌ఎస్‌ఆర్‌, 10(1), ఆర్‌వోఆర్‌ రిజిస్టర్లు ఉన్నాయి. ఒక వ్యక్తికి భూమి ఎలా సంక్రమించింది. వారసత్వంగా వచ్చిందా? లేదా? మరెలా వచ్చింది తదితర అంశాలను లింక్‌ డాక్యుమెంట్లు, ఆర్‌వోఆర్‌, ఆర్‌ఎస్‌ఆర్‌ తదితరాల ఆధారంగా రికార్డులు పరిశీలించి నిర్ధారిస్తారు.
  • ఆంధ్రప్రదేశ్‌ భూయాజమాన్య హక్కు చట్టం అమల్లో భాగంగా భూముల రీసర్వే చేపట్టారు. రీసర్వే పూర్తయితే భూ హక్కు రిజిస్టర్‌ మాత్రమే ఉంటుంది. దశాబ్దాలుగా ఉన్న ఆర్‌వోఆర్‌, అడంగల్‌, ఆర్‌ఎస్‌ఆర్‌, 10 (1), ఆర్‌ఎస్‌ఆర్‌, సర్వే నంబర్లు.. ఇవన్నీ కనుమరుగవుతాయి. భూ హక్కు రిజిస్టర్‌తో భూమి ఎలా సంక్రమించిందో నిర్ధారణ చేయడం చాలా కష్టమని విశ్రాంత రెవెన్యూ ఉద్యోగులు పేర్కొంటున్నారు.

కొత్త చట్టంతో జరిగే మోసం

ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌-2023ను గతేడాది అక్టోబరు 31న అమల్లోకి తెస్తూ వైకాపా ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ చట్టంతో భూయజమానులు, కొనుగోలుదారులు భూమి హక్కులపై భరోసా కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంది. భూ వివాదాల పరిష్కారాల కోసం కోర్టుకు వెళ్లకుండా యజమాని స్వేచ్ఛను వైకాపా ప్రభుత్వం హరించేలా నిబంధనలు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. కొనుగోలు సమయంలో జరిగే అవకతవకలను ఇక నుంచి ట్రైబ్యునల్‌లో ప్రభుత్వం నియమించే టీఆర్వో పరిష్కరిస్తారని చెప్పడంతో అసలు సమస్య మొదలైంది. భూముల రీసర్వే పూర్తయితే ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని అడ్డుపెట్టుకొని ఇష్టారీతిన వైకాపా నాయకులు భూహక్కులను హరిస్తారన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. శాశ్వత భూహక్కు.. భూరక్ష అంటే ఇదేనా అని భూయజమానులు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ భూముల పత్రాలపై జగన్‌ బొమ్మ ఎందుకని మండిపడుతున్నారు.

సర్వే నంబర్లు మాయం

దశాబ్దాలకాలంగా ఉన్న సర్వే నంబర్ల స్థానంలో ల్యాండ్‌ పార్సిల్‌ మ్యాప్‌ (ఎల్‌పీఎం)లను తీసుకొచ్చారు. సర్వే నంబర్లు ఒక వ్యక్తికి ఒక్కటే.. ఆయన వారసులకు అదే సర్వే నంబరు ఉండేది. కొత్త చట్టం ప్రకారం ఒక్కో వ్యక్తికి ఒక ఎల్‌పీఎం నంబర్లు కేటాయిస్తున్నారు. ఐదారుగురికి కలిపి ఒక ఎల్‌పీఎం నంబరు కేటాయించి భూ హక్కు పత్రాలు పంపిణీ చేస్తున్నారు. ఇలా చేయడాన్ని పరిశీలిస్తే రైతులను నిత్యం భూ వివాదాల్లోకి లాగడం తప్ప మరొకటి కాదన్నది తేలుతోంది. భూ వివాదాలు పరిష్కారం కావు. భూ విస్తీర్ణంలో తేడాలు సరిచేయడం లేదు. తప్పులను సవరించడం లేదు. కొన్ని సర్వే నంబర్లు పూర్తిగా గల్లంతవుతున్నాయి. అంతా హడావుడిగా రీసర్వే చేసి రైతుల మధ్య చిచ్చు రేపుతున్నారు. ఆన్‌లైన్‌ అడంగల్‌ కాపీలు కనుమరుగవుతున్నాయి. భూములకు పునాదులుగా ఉన్న ఆర్‌ఎస్‌ఆర్‌ కనుమరుగవుతుంది. ఉమ్మడి జిల్లాలో 5-6 లక్షల ఎఫ్‌ఎంబీలు లేవు.

మూడేళ్ల కిందట ప్రారంభించారు

ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2020 డిసెంబరులో భూరీసర్వేకు శ్రీకారం చుట్టారు. పందిపాడు, కాత్రికి, బిల్లలాపురం గ్రామాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టారు. అనంతరం మొదటి విడత 67 గ్రామాల్లో పూర్తి చేశారు. 2023 డిసెంబరు నాటికి ఉమ్మడి జిల్లాలోని 914 రెవెన్యూ గ్రామాల్లో గ్రామాల్లో రీసర్వే పూర్తి చేయాల్సి ఉండగా 490 గ్రామాల్లో పూర్తైందని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. వాస్తవంగా పరిశీలిస్తే మూడేళ్లు దాటినా మూడొందలకు మించలేదు. 2024 ఫిబ్రవరి నాటికి ఉమ్మడి జిల్లాలో సమగ్రంగా పూర్తైంది 289 గ్రామాల్లోనే మరి. మరో 201 గ్రామాల్లో సర్వే అయోమయంగా మారింది.

1.93 ఎకరాలు ఏమైంది

విశ్వేశ్వరరెడ్డి, శంకరబండ, ఆస్పరి

న్యూస్‌టుడే, ఆస్పరి: సర్వే నంబరు 107-2లో మెట్ట 3.44 ఎకరాలు ఉంది. మా అన్న సాగు చేస్తున్నారు. నేను ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నా. మా భూమి రీసర్వే చేసేటప్పుడు మాకెవరూ సమాచారం ఇవ్వలేదు. తీరా మా చేతిలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చిత్రమున్న పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వడంతో అందులో చూస్తే నాకున్న భూమి 107-2లో 3.44 ఎకరాలకుగాను కేవలం 0.81 సెంట్లు మాత్రమే చూపారు. నాది, మా అన్న భూములకు సంబంధించిన సర్వే నంబరు 107-2లో పరిశీలించగా మా అన్నకు కొత్త పుస్తకంలో ఎకరం భూమి కలిసింది. మిగిలిన 1.93 ఎకరాల భూమి ఏమైందో అర్థం కావడం లేదు.

రీసర్వే చేశారు భూమి తగ్గించారు

లక్కె గోవిందు, గోతులదొడ్డి

న్యూస్‌టుడే, కౌతాళం: సర్వే నంబరు 76-1లో 2.80 ఎకరాలు, సర్వే నంబరు 78లో ఎకరం భూమి ఉంది. మొత్తం కలిపి 3.80 ఎకరాల భూమి ఉంది. గతేడాది రీసర్వే చేసి పాసుపుస్తకంలోని భూమి కంటే తక్కువ చూపారు. సర్వే నంబరు 76-1లో 2.80 ఎకరాలకుగాను 2.54 ఎకరాలు, సర్వే నంబరు 78లో ఎకరానికి బదులుగా 0.87 సెంట్ల భూమి చూపారు. రెండు సర్వే నంబర్ల మీద 3.80 ఎకరాలు ఉన్న భూమిని 3.41 ఎకరాలు మాత్రమే చూపారు. మిగిలిన 39 సెంట్ల భూమి లేదంటున్నారు. రీసర్వే వల్ల చాలా నష్టపోయాం. మా పెద్దలు సంపాదించిన ఆస్తిని రీసర్వే పేరిట కోల్పోవడం బాధగా ఉంది. అధికారులను అడిగినా రీసర్వేలో ఎంతవస్తే అంతే భూమి అని అంటున్నారు.

32 సెంట్లు తక్కువగా చూపుతున్నారు

పక్కీరప్ప, బురుజుల, మద్దికెర

న్యూస్‌టుడే, మద్దికెర: నాకు సర్వే నంబరు 225లో 4.75 ఎకరాల నల్లరేగడి భూమి ఉంది. నా పొలం బహిరంగ మార్కెట్లో ఎకరం రూ.20 లక్షలకుపైగా పలుకుతోంది. నాకు 32 సెంట్లు తక్కువగా చూపారు. దీంతో కనీసం రూ.7 లక్షలకుపైగా నష్టపోయా. వైకాపా ప్రభుత్వం కావాలనే గ్రామాల్లో రీసర్వే పేరుతో అన్నదమ్ముల్లా ఉన్న రైతుల మధ్య చిచ్చుపెడుతోంది. భూరీసర్వే పక్క పొలాల రైతులతో సైతం గొడవలకు దారి తీసింది.

అందరికీ ఒకే నంబరు

చిన్నదస్తగిరి, లింగందిన్నె

న్యూస్‌టుడే, గోనెగండ్ల: నాకు గ్రామంలో సర్వే నంబరు 157లో 5 ఎకరాల పొలం ఉంది. గతంలోని పట్టాదారు పాసు పుస్తకంలో సైతం 5 ఎకరాలు ఉంది. అడంగళ్‌, ఆర్వోఆర్‌లో కూడా ఇదే భూవిస్తీర్ణం వచ్చేది. కానీ... భూసర్వే చేసిన తర్వాత కొత్త పాసుపుస్తకంలో 4.20 ఎకరాల పొలం చూపిస్తోంది. భూసర్వే వల్ల 0.80 సెంట్ల పొలం తక్కువ వచ్చింది.  తన పొలం సర్వే నంబరుతో తొమ్మిది మంది రైతులు ఉన్నారు. అందరికీ కలిపి ఒకే ఎల్‌పీ నంబరు ఇవ్వడంతో అమ్ముకోవాలంటే అందరి ప్రమేయం తీసుకోవాల్సి వస్తోంది.

98 సెంట్ల భూమి తక్కువ చూపారు  

హనుమంతు, సంగాల

న్యూస్‌టుడే, సి.బెళగల్‌ గ్రామీణం: మా పెద్దల నుంచి వచ్చిన భూమిలో 98 సెంట్లు తక్కువ చూపారు. 196 సర్వే నంబరులో 2.22 సెంట్లు ఉండగా రీసర్వే చేశాక 1.24 సెంట్ల భూమి చూపుతూ జగనన్న పాసు పుస్తకం ఇచ్చారు. ఎకరం విలువ రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలు ఉంది. రీసర్వేలో వచ్చిన తేడాతో రూ.15-20 లక్షలు నష్టపోవాల్సి వచ్చింది. దీర్ఘకాలిక భూసమస్యలు పరిష్కరించేందుకు సర్వే అంటూ కొత్త సమస్యలను తెచ్చారు.

న్యూస్‌టుడే, ఆస్పరి: ఆస్పరి మండలం చిరుమాన్‌దొడ్డిలో రెవెన్యూ లెక్కల ప్రకారం 2,235.490 ఎకరాల పొలం ఉంది.. 835 మంది రైతులు పంటలు సాగు చేస్తున్నారు... అధికారులు సర్వే చేసి 2,229.773 ఎకరాలు ఉన్నట్లు తేల్చారు. 20 సెంట్ల నుంచి దాదాపు రెండు, మూడు ఎకరాల వరకు కోత పెట్టారు. రీసర్వే తీరుపై గతేడాది డిసెంబరు చివరిలో తహసీల్దారు కార్యాలయం ఎదుట  పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని