logo

ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తా

ఆదోని పట్టణంతో పాటు పల్లెలు తాగునీటి సమస్యతో తల్లడిల్లుతున్నాయి. ప్రతి ఇంటికి కుళాయి నీటిని అందిస్తానని ఆదోని భాజపా అభ్యర్థి డాక్టర్‌ పార్థసారథి హామీ ఇచ్చారు.

Published : 06 May 2024 03:32 IST

ఆదోనిలో రాజ్‌నాథ్‌ సింగ్‌ పర్యటన
భాజపా శ్రేణుల్లో నూతనోత్సాహం

ఈనాడు, కర్నూలు, ఆదోని పాతపట్టణం, న్యూస్‌టుడే: ఆదోని పట్టణంతో పాటు పల్లెలు తాగునీటి సమస్యతో తల్లడిల్లుతున్నాయి. ప్రతి ఇంటికి కుళాయి నీటిని అందిస్తానని ఆదోని భాజపా అభ్యర్థి డాక్టర్‌ పార్థసారథి హామీ ఇచ్చారు.

ఆదోనిలో ఆదివారం జరిగిన కేంద్ర రక్షణశాఖ మంత్రి సభలో ఆయన మాట్లాడారు. ఆదోని నియోజకవర్గ ప్రజలకు తాగునీటి కోసం కేంద్రం రూ.400కోట్లు కేటాయిస్తే... ఆ నిధులు ఖర్చు పెట్టలేక వెనక్కి పంపించిన విషయం వాస్తవమా? కాదా? అని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులు కాజేసి స్థానిక ఎమ్మెల్యే ప్రజల్ని మోసం చేశారన్నారు. కూటమి తరఫున భాజపా అభ్యర్థిగా పోటీచేస్తున్న తనను గెలిపిస్తే కేంద్రం నుంచి నిధుల వరద పారిస్తానన్నారు. ఆదోని నియోజకవర్గంలో గత పదేళ్లుగా రౌడీయిజం రాజ్యమేలుతోందని, కబ్జాలు, దౌర్జన్యాలు జరుగుతున్నాయని గుర్తుచేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారబోతోందని కబ్జాలు, దౌర్జన్యాలు మానుకోకపోతే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. కర్నూలు పార్లమెంటు అభ్యర్థి బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ.. కర్నూలు నియోజకవర్గం నుంచి ఏటా లక్షలాది మంది వలస వెళ్తున్నారని, ఆ సమస్యను పరిష్కరించాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. కేంద్రం సాయంతో గుండ్రేవుల, వేదవతి ప్రాజెక్టులు పూర్తిచేస్తామన్నారు. కార్యక్రమంలో భాజపా మాజీ ఎంపీ టి.జి.వెంకటేశ్‌, తెదేపా కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు తిక్కారెడ్డి, తెదేపా ఆదోని నియోజకవర్గ ఇన్‌ఛార్జి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మీనాక్షినాయుడు, ఆదోని నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జి మల్లప్ప తదితరులు పాల్గొన్నారు.

తరలివచ్చిన జనం..

కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ఆదోని భాజపా, తెదేపా, జనసేన శ్రేణులతో పాటు స్థానిక ప్రజలు సైతం బ్రహ్మరథం పట్టారు. మధ్యాహ్నం మూడు గంటలకు సభ నిర్వహిస్తామని చెప్పడంతో పలువురు ఆ సమయానికి భీమాస్‌ సర్కిల్‌కు చేరుకుని మండుటెండను సైతం లెక్కచేయకుండా వేచిచూశారు. సభ విజయవంతం అయినట్లు ఆయా పార్టీల శ్రేణులు తెలిపాయి.

ఆదోని అభివృద్ధికి నిధులు

ఆదోని భాజపా అభ్యర్థి డాక్టర్‌ పార్థసారథిని తానే పార్టీలోకి తీసుకొచ్చి, ఎమ్మెల్యేగా నిలబెట్టామని... ఆయనను గెలిపిస్తే ఒక సీనియర్‌ మంత్రిగా కేంద్రం నుంచి నియోజకవర్గ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించే బాధ్యత తీసుకుంటానని రాజ్‌నాథ్‌సింగ్‌ సభాముఖంగా ప్రకటించారు. కర్నూలు పార్లమెంటు అభ్యర్థి బస్తిపాటి నాగరాజును భారీ మెజారిటీతో  గెలిపించాలని కోరారు. ముందుగా రాజ్‌నాథ్‌సింగ్‌కు భాజపా, తెదేపా, జనసేన నేతలు హెలిప్యాడ్‌ దగ్గర ఘనంగా స్వాగతం పలికారు. కూటమి పార్టీల నేతలు, శ్రేణులతో పాటు పోలీసు కంట్రోల్‌ రూం నుంచి ర్యాలీగా బయల్దేరి భీమాస్‌ సర్కిల్‌ వరకు ప్రజలకు అభివాదం చేసుకుంటూ వెళ్లారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని