logo

రవ్వలకొండ చరిత్రకు సమాధి

కాలజ్ఞానం చరిత్రను మట్టి మాఫియా ఖతం చేస్తోంది.. ‘అధికారం’ తోడుగా ఉండటం.. యంత్రాంగం పట్టించుకోకపోవడంతో రెచ్చిపోతోంది.. 2000 హెక్టార్లలో విస్తరించిన రవ్వలకొండను మట్టి మాఫియా తవ్వేస్తోంది.

Published : 07 May 2024 06:38 IST

మట్టిమాఫియా ఆగడాలు
అధికార అండదండలు

అనుమతులు లేకుండా ట్రాక్టర్‌లో మట్టి నింపుతున్న చోదకుడు

బనగానపల్లి, న్యూస్‌టుడే: కాలజ్ఞానం చరిత్రను మట్టి మాఫియా ఖతం చేస్తోంది.. ‘అధికారం’ తోడుగా ఉండటం.. యంత్రాంగం పట్టించుకోకపోవడంతో రెచ్చిపోతోంది.. 2000 హెక్టార్లలో విస్తరించిన రవ్వలకొండను మట్టి మాఫియా తవ్వేస్తోంది. పోతులూరి వీరబ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన వేదిక.. పర్యాటకులను ఆకట్టుకునే గుహలకు ప్రమాదం తెచ్చిపెడుతున్నారు.అక్రమంగా మట్టి తవ్వి పట్టపగలే ట్రాక్టర్లు, టిప్పర్లలో తీసుకెళ్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. నిత్యం టన్నుల కొద్ది మట్టి తవ్వి వందల వాహనాల్లో తరలిస్తున్నా మా పరిధి కాదంటే మాది కాదని రెవెన్యూ, అటవీ, గనుల శాఖలు కార్యాలయాలకే పరిమితమయ్యాయి. మట్టినంతా 60 కి.మీ దూరంలో ఉన్న నంద్యాల జిల్లా కేంద్రానికి తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం రవ్వలకొండలో ఎక్కడ చూసిన గోతులే దర్శనమిస్తున్నాయి.

అటువైపు తొంగి చూడని అధికారులు

అటవీ, రెవెన్యూ, గనులశాఖ, పంచాయతీ అధికారుల మధ్య సమన్వయ లోపం అక్రమార్కులకు వరంగా మారింది. టన్నుల కొద్ది మట్టి అక్రమంగా తరలిపోతున్నా ఏ ఒక్క అధికారి ఇటువైపు తొంగి చూడటం లేదు. రవ్వలకొండపై అటవీశాఖ అధికారుల పర్యవేక్షణ ఎక్కువగా ఉండాలి. వారెక్కడ ఉంటారో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొంది. చాలామంది మామూళ్ల మత్తులో జోగుతున్నారనే విమర్శలు రేగుతున్నాయి. అప్పుడప్పుడూ చిన్నపాటి జరిమానాలతో సరిపెడుతున్నారు. ఎంతో చరిత్ర ఉన్న రవ్వకొండను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది.. తవ్వకాలు నిలిపివేయకుంటే చరిత్ర ఆనవాళ్లు సమాధి కావడం ఖాయమని స్థానికులు పేర్కొంటున్నారు. అధికారుల నిఘా పెంచాలని స్థానికులు కోరుతున్నారు.

కొండ నిండా ఎర్రమన్నే

రవ్వలకొండపై ఎర్రమట్టి ఎక్కువ దొరుకుతుంది. దీన్ని ఇళ్ల నిర్మాణానికి ఎక్కువగా వినియోగిస్తారు. మార్కెట్లో ఎర్రమట్టికి డిమాండు ఎక్కువగా ఉండటంతో అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. నిత్యం 50 టిప్పర్లు, 50 ట్రాక్టర్లలో మట్టి తరలివెళ్తోంది. ఒక టిప్పర్‌లో 3-4 టన్నులు, ట్రాక్టర్‌లో టన్ను వరకు మట్టి పడుతోంది. దూరాన్ని బట్టి టిప్పర్‌ మట్టిని రూ.3 వేలు- రూ.5 వేల వరకు, ట్రాక్టర్‌కు రూ.1000 నుంచి రూ.2000 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన నిత్యం రూ.35 వేలు, ప్రతి నెల సుమారు రూ.10 లక్షల ఆదాయం అక్రమార్కుల పరమవుతోంది. ఏడాదికి రూ.1.20 కోట్ల ఆదాయానికి గండి పడుతోంది. మట్టిని తరలించే యజమానులు టిప్పర్‌కు రూ.3 వేలకు పైగా, ట్రాక్టర్లకు రూ.1000 వరకు బయట విక్రయించి ఆదాయం పొందుతున్నారు. దూరాన్ని బట్టి టిప్పర్‌, ట్రాక్టర్లకు ఇంకా ఆదాయం పెరిగే అవకాశం ఉంది.

గుత్తేదారులూ తీసుకెళ్తున్నారు

బనగానపల్లి చుట్టుపక్కల అభివృద్ధి పనులు చేపట్టే గుత్తేదారులు ఇక్కడి నుంచే మట్టిని తీసుకెళ్తున్నారు. నిబంధనల ప్రకారం వారు ముందస్తుగా దరఖాస్తు చేసుకోవాలి. గనులశాఖ వారి అనుమతి ఇస్తే రాయల్టీ చెల్లించి తీసుకెళ్లాల్సి ఉంటుంది. కానీ గుత్తేదారులకు అధికార పార్టీ అండదండలు ఉండటంతో ఎలాంటి అనుమతుల్లేకుండా తోడేస్తున్నారు. మట్టి కోసం ఇప్పటి వరకు మండల రెవెన్యూ అధికారులకు ఇప్పటి వరకు ఒక్క దరఖాస్తు రాలేదు. అధికారులు అనుమతులిచ్చిన దాఖలాలు లేవు. కానీ కొండ మాత్రం తరిగిపోతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని