logo

పోస్టల్‌ బ్యాలట్‌ చెల్లుబాటయ్యేనా

ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగుల ఓటు చెల్లుబాటు ప్రశ్నార్ధకంగా మారింది. ఫెసిలిటేషన్‌ కేంద్రాల వద్ద జాబితాల్లో పేర్లు కనిపించక పోవటం, సాంకేతిక తప్పిదాలు ఉద్యోగులను గందరగోళానికి గురిచేస్తున్నాయి.

Published : 09 May 2024 03:08 IST

ఆర్వో కేంద్రాల జాబితాలో కనిపించని ఎన్నికల సిబ్బంది పేర్లు
ఓటుకు భద్రత కరవు


ఆత్మకూరులో ఓటుకు మరోసారి ద]రఖాస్తు చేసుకుంటున్న ఉద్యోగులు

ఆత్మకూరు, న్యూస్‌టుడే : ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగుల ఓటు చెల్లుబాటు ప్రశ్నార్ధకంగా మారింది. ఫెసిలిటేషన్‌ కేంద్రాల వద్ద జాబితాల్లో పేర్లు కనిపించక పోవటం, సాంకేతిక తప్పిదాలు ఉద్యోగులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఇప్పటి దాకా సాగిన పోస్టల్‌ బ్యాలట్‌లో అధికారుల సమాచార సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఆర్వో కేంద్రాల జాబితాలో పేర్లు గల్లంతవడం, ఇతర ప్రాంతం నుంచి వచ్చిన వారిని సొంత నియోజకవర్గాలకు వెళ్లి ఓటేయమని ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేశారు. ఉద్యోగుల ఓటు చెల్లబాటు కాకుండా చేసేందుకు ఉద్దేశపూర్వకంగా ఇలా ప్రవర్తించారేమోననే ఉద్యోగులు చెబుతున్నారు.  

ఓటు చెల్లుబాటు ప్రశ్నార్ధకం

డిక్లరేషన్‌ ఫాంపై స్టాంపు వేయక పోవటం, సంతకాలు చేయక పోవటం, పోస్టల్‌ బ్యాలట్‌ పత్రాల కొరత, బి. కవర్‌ కొరత ఉండటంతో సీ కవర్‌పై బీ రాసి ఇవ్వటం, కవర్ల కొరతతో డిక్లరేషన్‌ ఫాం, ఓట్లు రెండు ఒకే కవర్‌లో వేయాల్సి రావటం చూస్తే ఓటు చెల్లుబాటు ప్రశ్నార్ధకంగా మారింది. నిబంధనల ప్రకారం ఓటేశాక బ్యాలట్‌ పేపర్‌ను 13బీ చిన్న కవర్‌లో పెట్టి సీల్‌ చేయాలి. డిక్లరేషన్‌ 13ఏ లో పెట్టి సీల్‌ చేయాలి. ఈ రెండింటిని 13సీలో ఉంచాలి. ఓటు వేసిన పెట్టెలకు తాళం వేసి లక్కతో సీల్‌ వేయాల్సి ఉండగా తాళం, సీల్‌ వేయకుండానే ఓటరు కవర్లు అందులో వేయించారు. వాటి భద్రతపై ఉద్యోగులు అభద్రతా భావంతో ఉన్నారు.

  • విధుల్లో పాల్గొనే ఉద్యోగులు తమ పోస్టల్‌ బ్యాలట్‌ పత్రంలో నచ్చిన పార్టీకి ఓటేసి దాన్ని ఇన్నర్‌ కవర్‌లో పెట్టి సీల్‌ చేయాలి. తర్వాత ఇన్నర్‌ కవర్‌, డిక్లరేషన్‌ ఫాం పెద్ద కవర్‌లో పెట్టి సీల్‌ చేసి బాక్సులో వేయాలి. ఆత్మకూరు డీపాల్‌ పాఠశాల కేంద్రంలో ముందుగా ఓటేసిన మహిళలు కవర్ల కొరతతో బ్యాలట్‌ పత్రం, డిక్లరేషన్‌ ఫాం రెండింటిని ఒకే కవర్లో పెట్టి బాక్సుల్లో వేశారు. స్థానిక అధికారులు ఓటు చెల్లుతుందని చెప్పినా కౌంటింగ్‌ సమయంలో నిబంధనలు పాటించని వారి ఓట్లు పరిగణలోకి తీసుకోరని చర్చించుకుంటున్నారు.

కొట్టొచ్చిన సమాచార లోపం

విధుల్లో పాల్గొనే ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలట్‌ వినియోగంపై సమాచార లోపం  కనిపించింది. ఆత్మకూరులోని ఫెసిలిటేషన్‌ కేంద్రాల వద్ద విధుల్లో పాల్గొనే ఉద్యోగుల ఓటరు జాబితాను మొదటి రోజు మధ్యాహ్నం వరకు ప్రదర్శించలేదు. రాజకీయ పార్టీల ప్రతినిధుల వద్ద జాబితాల్లో తమ పేర్లు ఉన్నాయా లేదా అని సరిచూసుకోవాల్సి వచ్చింది. జాబితాలోను పేర్లు లేక మళ్లీ ఫారం-12 దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చింది. ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు.

జాబితాల్లో పేర్లు కనపడట్లేదు

వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఉద్యోగుల పేర్లు జాబితాలో కనిపించలేదు. దీంతో వారు మా ఓటు హక్కు ఎక్కడుందోనని ఆందోళన చెందారు. శిక్షణ కేంద్రాల వద్ద కనిపించకపోతే స్థానిక నియోజక వర్గాల్లో చూసుకోవాలని అధికారులు సూచించడంతో కొందరు ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చారు. కొందరు ఇక్కడ నుంచి వారి సొంత నియోజకవర్గాలకు వెళ్లారు. అయిన పేర్లు లేకపోవడంతో తమ ఓటు ఏమైందని ప్రశ్నిస్తున్నారు. ఫాం-12 ద]రఖాస్తు చేసుకున్నా జాబితాలో పేర్లు గల్లంతుకావటం ప్రశ్నార్ధకంగా మారింది.

ఉద్దేశ పూర్వకంగానే అడ్డంకులు?:

Ëసిబ్బంది ఓటు వినియోగంపై ఉద్దేశ పూర్వకంగానే ఇలా చేసి ఉంటారనే చర్చ కొనసాగింది. జాబితా ప్రదర్శనలో జాప్యం, జాబితాలో పేర్లు లేకపోవడం, శిక్షణ కేంద్రాల నుంచి సొంత నియోజక వర్గాలకు వెళ్లమనటం, బ్యాలట్‌ పత్రాల కొరత, కవర్ల కొరత, సరైన సమాచారం ఇవ్వక పోవడం, చూస్తే అధికారులు ఉద్దేశ పూర్వకంగానే చేసి ఉంటారని మాట్లాడుకున్నారు.

  • 2019 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 19,404 మంది పోస్టల్‌ బ్యాలట్‌ ఓట్లు పొందారు. అసెంబ్లీకి 16,405, పార్లమెంటుకు 14,680 మంది ఓటేశారు. కర్నూలు 8,290 మందిలో 4,310, నంద్యాల 11,114 కి గాను 6,587 మంది ఓటేశారు. 30% నుంచి 40% ఓట్లు చెల్లలేదు.
  • 2024 ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలట్‌ ఓట్లకు దరఖాస్తులు పెరిగాయి. నంద్యాల జిల్లాలో 17,939 మంది కర్నూలులో 20,351 మంది దరఖాస్తు చేసుకున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి 18 వేల ఓట్లు ఎక్కువగా దరఖాస్తు చేసుకున్నారు. ఓటు వినియోగించుకున్నప్పటికి సాంకేతిక తప్పిదాలతో ఎన్ని చెల్లుబాటవుతాయో తెలియని పరిస్థితి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని