logo

సమాచారం లేక ఇబ్బందులపాలు

డా.బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం పరిధిలో ఈనెల 17 నుంచి నిర్వహించాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. ఎలాంటి ముందస్తు సమాచారం లేకపోవడంతో పరీక్ష రాసేందుకు సుదూర ప్రాంతాల నుంచి

Published : 18 Jan 2022 01:47 IST

సార్వత్రిక డిగ్రీ పరీక్షల వాయిదాతో తిరిగి వెళ్లిన అభ్యర్థులు

నిరాశగా వెనుదిరుగుతున్న అభ్యర్థులు

మహబూబ్‌నగర్‌ అర్బన్‌, న్యూస్‌టుడే : డా.బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం పరిధిలో ఈనెల 17 నుంచి నిర్వహించాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. ఎలాంటి ముందస్తు సమాచారం లేకపోవడంతో పరీక్ష రాసేందుకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సార్వత్రిక విశ్వవిద్యాలయం పరిధిలో యూజీ (ఓల్డ్‌ బ్యాచ్‌) విద్యార్థులకు మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రం క్రిస్టియన్‌పల్లి సమీపంలోని ఎంవీఎస్‌ అర్డ్స్‌, సైన్స్‌ కళాశాలలో సోమవారం నుంచి జరగాల్సిన పరీక్షలపై అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. పరీక్షలు నిర్వహిస్తారా.. వాయిదా వేస్తారా.. అనే విషయం తెలియక తీవ్ర అయోమయానికి గురయ్యారు. కొందరు సోమవారం ఉదయం 11 గంటలకే జిల్లా కేంద్రానికి చేరుకుని మధ్యాహ్నం వరకు నిరీక్షించారు. అధికారుల నుంచి స్పందన కరవైంది. చివరికి రాష్ట్ర అధికారుల నుంచి అందిన ఆదేశాల మేరకు పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు మధ్యాహ్నం 2 గంటల సమయంలో ప్రకటించడంతో అభ్యర్థులు తీవ్ర నిరాశలో వెనుదిరిగారు. జోగులాంబ- గద్వాల, హైదరాబాదు, అచ్చంపేట, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, గండీడ్‌, కోస్గి ఇలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చామని, ఒక్క రోజు ముందుగా సమాచారం ఇచ్చి ఉంటే బాగుండేదని వాపోయారు. ఈ విషయంపై సంబంధిత అధికారులను సంప్రదించగా.. కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 30వ తేదీ వరకు అన్ని పరీక్షలు వాయిదా వేసినట్లు తెలిపారు. వాయిదా పడిన పరీక్షలను ఎప్పుడు నిర్వహిస్తారనే వివరాలు త్వరలోనే ప్రకటిస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని