logo

ఆదాయమున్నా నిర్లక్ష్యమే!

కోస్గి పట్టణంలో ప్రతి ఆదివారం నిర్వహించే వారాంతపు సంత ద్వారా ఏటా రూ.కోటికి పైగా ఆదాయం వస్తోంది. అయినా సదుపాయాలు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. సంతకు మండలంలోని గ్రామాల నుంచే కాకుండా

Published : 12 Aug 2022 03:16 IST

కోస్గిలో రోడ్డుపైనే వార సంత
తరచూ ట్రాఫిక్‌ జాంతో  ఇబ్బందులు


కోస్గి శివాజీ కూడలిలో రోడ్డుపైనే దుకాణాలు పెట్టుకున్న వ్యాపారులు

న్యూస్‌టుడే, కోస్గి న్యూటౌన్‌: కోస్గి పట్టణంలో ప్రతి ఆదివారం నిర్వహించే వారాంతపు సంత ద్వారా ఏటా రూ.కోటికి పైగా ఆదాయం వస్తోంది. అయినా సదుపాయాలు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. సంతకు మండలంలోని గ్రామాల నుంచే కాకుండా ఇతర మండలాలు, జిల్లాల నుంచి కూడా వ్యాపారులు వస్తుంటారు. ప్రతి వారం కనీసం రూ.అరకోటికి పైగా వ్యాపారం సాగుతుంది. తాజా కూరగాయలు, ఆకు కూరలు, పండ్లు, తినుబండారాలు, వంట సామగ్రి, దినుసులు, దుస్తులు, వ్యవసాయ పరికరాలు, నిర్మాణ సామగ్రి ఇతరాత్ర అన్నీ లభిస్తాయి. వీటిని కొనుగోలు చేసేందుకు నియోజకవర్గ ప్రజలతో పాటు సమీపాన ఉన్న వికారాబాద్‌ జిల్లా, కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా, యాద్గీర్‌ జిల్లాల నుంచి కూడా ప్రజలు వేలాదిగా వస్తుంటారు. కూరగాయలు, పశువుల సంతతో కోస్గి పురపాలికకు ఏడాదికి రూ.1.20 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతోంది. కానీ సంతలో కనీస వసతులు కల్పించకపోవడం వ్యాపారులు, కొనుగోలు దారులను ఇబ్బందులు తప్పడం లేదు.

అమలుకు నోచుకోని హామీ..

ప్రతి ఆదివారం పట్టణంలో రోడ్డుపైనే సంత నిర్వహిస్తున్నారు. వేసవిలో ఎండకు, వానాకాలం వర్షాలకు ఇబ్బందులు పడుతున్నామని వ్యాపారులు, కొనుగోలు దారులు పలుమార్లు అధికారులు, పాలకుల దృష్టికి తీసుకెళ్లారు. వారాంతపు సంతకు పట్టణంలోని శివాజీ కూడలి సమీపంలో ఉన్న దేవాదాయ స్థలం లీజుకు తీసుకొని, అందులో దుకాణాలు ఏర్పాటు చేస్తామని పలు   సమావేశాల్లో ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు మాత్రం లేవు. ప్రస్తుతం ఎడతెరిపి లేని వర్షాల్లోనే సంత నిర్వహిస్తూ.. జనం, వ్యాపారులు అవస్థ పడుతూనే ఉన్నారు. దీంతో పాటు తాగునీటి సౌకర్యం, మూత్రశాలలు, మరుగుదొడ్ల సదుపాయం లేకపోవడంతో వ్యాపారులు, ఇతర గ్రామాల నుంచి వచ్చే కొనుగోలుదారులు పడుతున్న ఇబ్బందులు అంతాఇంతా కాదు.

పశువుల విక్రయాలకూ అవస్థలే..

పట్టణంలో కొనసాగే పశువుల సంతకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. సుదూర ప్రాంతాల నుంచి రైతులు పశువులను అమ్మడానికి, కొనడానికి వస్తుంటారు. ప్రతి వారం రూ.కోటికి పైగా వ్యాపారం ఉంటుంది. రెండు నెలల కిందటి వరకు బీసీ కాలనీలోని ప్రభుత్వ స్థలంలో పశువుల సంత నిర్వహించే వారు. అయితే పురపాలికలో సమీకృత మార్కెట్‌ సముదాయ నిర్మాణం కోసం ఈ స్థలాన్ని కేటాయించడంతో.. పశువుల సంతను పట్టణ శివారులోని ఓ ప్రైవేటు స్థలంలోకి మార్చారు. ఇక్కడ కనీస సదుపాయాల్లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పశువులకు కనీసం తాగునీరు కూడా లభించడం లేదు. అధికారులు స్పందించి వారాంతపు సంతకు ప్రత్యేక స్థలం కేటాయించాలని, పశువుల సంతలో మౌలిక వసతులు కల్పించాలని వ్యాపారులు, కొనుగోలుదారులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని