logo

మార్కెట్‌ లక్ష్యం నెరవేరలేదు..!

జిల్లా కేంద్రంలో కూరగాయల మార్కెట్‌ భవన నిర్మాణానికి గ్రహణం వీడటంలేదు. పట్టణ ప్రజల అవసరాల దృష్ట్యా ఏర్పాటుచేసిన భవనం లక్ష్యం నెరవేరకుండా నిరుపయోగంగా మారింది.

Published : 01 Feb 2023 04:48 IST

వనపర్తిలో నిరుపయోగంగా మారిన కూరగాయాల షెడ్లు

న్యూస్‌టుడే, వనపర్తి న్యూటౌన్‌: జిల్లా కేంద్రంలో కూరగాయల మార్కెట్‌ భవన నిర్మాణానికి గ్రహణం వీడటంలేదు. పట్టణ ప్రజల అవసరాల దృష్ట్యా ఏర్పాటుచేసిన భవనం లక్ష్యం నెరవేరకుండా నిరుపయోగంగా మారింది. వనపర్తిలోని పాతకోట, దళితవాడ మధ్య కందకం సమీపంలో కూరగాయాల మార్కెట్‌ భవన నిర్మాణానికి ఐదేళ్ల కింద పనులు ప్రారంభించారు. రూ.కోట్లు వెచ్చించి బహిరంగ అంగడి ఏర్పాటుచేసినా వ్యాపారులు, ప్రజలకు దీనిపై అవగాహన కల్పించకపోవడంతో షెడ్లు ప్రస్తుతం నిరుపయోగంగా మారాయి. ఇలాగే నిర్లక్ష్యం వహిస్తే భవనం శిథిలావస్థకు చేరుకునే ప్రమాదముందని పట్టణవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రూ.6 కోట్లతో షెడ్డు నిర్మాణం..

పట్టణంలోని పాతకోట, గాంధీచౌక్‌ను అనుసరించి సంస్థానాధీశుల కాలం నాటి కందకాన్ని కూరగాయల మార్కెట్‌కు ఉపయోగించారు. దీని కోసం పలు ఆక్రమణలను తొలగించారు. కందకంలో మట్టిని వేసి చదునుచేశారు. 2018లో అప్పటి కలెక్టర్‌ శ్వేతామహంతి రూ.1.23 కోట్లు కేటాయించి 23 దుకాణాలు నిర్మించేలా అనుమతులు ఇచ్చారు. షెడ్డు నిర్మాణం పూర్తవడంతో శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అప్పటి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రారంభించారు. మొదట్లో కొందరితో కూరగాయల విక్రయాలు చేయించారు. అవగాహన లేకపోవడంతో పట్టణ వ్యాపారులు ఆసక్తి చూపలేదు. దీంతో అనతికాలంలోనే షెడ్డు నిరుపయోగంగా మారింది. ఇదిలా ఉండగా కందకం వద్ద మరో 143 దుకాణాల నిర్మాణానికి 2021లో రూ.5 కోట్ల ఎస్సీ, ఎస్టీ నిధులతో ఆధునిక మార్కెట్‌ నిర్మాణానికి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌, మంత్రి నిరంజన్‌రెడ్డి భూమిపూజ చేశారు. గుత్తేదారు కూరగాయల షెడ్ల నిర్మాణాలను పిల్లర్ల వరకు తీసుకొచ్చి అలాగే వదిలేశారు. అధికారుల నిర్లక్ష్యంతో దుకాణ నిర్మాణాలు అసంపూర్తిగా మిగిలాయి. ప్రస్తుతం రహదారులపైనే కూరగాయల విక్రయాలు సాగుతున్నాయి. దీనివల్ల పట్టణంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

పునాదుల వరకే నిర్మించిన షెడ్డు


త్వరలో నిర్మాణాలు..

విక్రమసింహారెడ్డి, పుర కమిషనర్‌

పట్టణంలోని పాతకోట, దళితవాడలననుసరించి కందకం వద్ద నిర్మిస్తున్న కూరగాయల సముదాయ భవనం నిర్మాణ పనులు నిధుల కొరతతో తాత్కాకలికంగా నిలిచిపోయాయి. భవన నిర్మాణం పూర్తిచేసేందుకు నిధుల కోసం ప్రతిపాదనలు పంపించాం. నిధులు మంజూరైన వెంటనే పనులు చేపట్టి త్వరలోనే వినియోగంలోకి తీసుకువస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని