logo

శిథిల భవనాలు.. భయం గుప్పిట చిన్నారులు

దామరగిద్ద మండలంలోని బాపన్‌పల్లిలో ఎప్పుడో నిర్మించిన  అంగన్‌వాడీ కేంద్రం భవనం పూర్తి  శిథిలావస్థకు చేరింది. పదిహేను సంవత్సరాలుగా అది వినియోగానికి పనికి రాకున్నా అధికారులు పట్టించుకోలేదు.

Published : 05 Feb 2023 05:43 IST

మరమ్మతులకు నోచుకోని అంగన్‌వాడీ కేంద్రాలు
అద్దె గదుల్లో అరకొర వసతులు
న్యూస్‌టుడే, నారాయణపేట

దామరగిద్ద మండలం బాపన్‌పల్లిలో నిరుపయోగంగా మారిన అంగన్‌వాడీ కేంద్ర భవనం

దామరగిద్ద మండలంలోని బాపన్‌పల్లిలో ఎప్పుడో నిర్మించిన  అంగన్‌వాడీ కేంద్రం భవనం పూర్తి  శిథిలావస్థకు చేరింది. పదిహేను సంవత్సరాలుగా అది వినియోగానికి పనికి రాకున్నా అధికారులు పట్టించుకోలేదు. మరో భవనం నిర్మించక పోవడంతో అరకొర వసతులు ఉన్న అద్దె గదిలో కేంద్రం నిర్వహిస్తూ.. చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యను అందిస్తున్నారు. పిల్లలకు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించడం, చిన్నారులకు ఆటపాటలతో చదువు చెప్పడానికి అంగన్‌వాడీ టీచర్లు అవస్థ పడుతున్నారు. ఒక్కపూట సంపూర్ణ భోజనం వండి పెట్టడానికి ఆయాలు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

జిల్లాలో చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యనందించాల్సిన అంగన్‌వాడీ కేంద్రాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. భవనాలు శిథిలావస్థకు చేరినా కనీస మరమ్మతులు చేపట్టే దిక్కులేదు. చిన్నారులతో పాటు బాలింతలు, గర్భిణులకు రోజూ పౌష్టికాహారం అందించడానికి కూడా కొన్నిచోట్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పైకప్పులు పెచ్చులూడి పడుతుండటంతో చిన్నారులకు ప్రమాదం పొంచిఉంది. అద్దె భవనాల్లో ఇబ్బందులు తప్పడం లేదు. విద్యుత్తు సదుపాయం, ఫ్యాన్లు లేక కొన్నిచోట్ల వేసవిలో ఉక్కపోత సమస్య ఉంటోంది. కొన్ని కేంద్రాల్లో తాగునీటి వసతి, మరుగుదొడ్లు కూడా లేవు. జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల పరిస్థితి ఇది.

జిల్లాలో ఇదీ పరిస్థితి...

జిల్లాలో నారాయణపేట, మక్తల్‌, మద్దూరు ఐసీˆడీఎస్‌ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో 704 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. సుమారు 14వేల మందికిపైగా చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యనందిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 121 కేంద్రాలకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి. 288 కేంద్రాలు అద్దె భవనాల్లో, 295 కేంద్రాలు కమ్యూనిటీ హాళ్లు, పాఠశాల గదుల్లో నిర్వహిస్తున్నారు. సొంత భవనాలు లేనిచోట అరకొర వసతులతో అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్ని గ్రామాల్లో సొంత భవనాలు ఉన్నా ప్రహరీల్లేక చిన్నారులకు రక్షణ కొరవడింది.

శిథిలావస్థలో 146 కేంద్రాలు..

జిల్లాలోని మూడు ప్రాజెక్టుల పరిధిలో సుమారు 144 భవనాలు శిథిలావస్థల్లో ఉన్నాయి. కేంద్రాల్లో చాలా చోట్ల సరైన వసతుల్లేక పోయినా అలాగే నెట్టుకొస్తున్నారు. సంబంధిత శాఖ అధికారులు సైతం సొంత భవనాల నిర్మాణంపై శ్రద్ధ చూపకపోవడంతో ప్రభుత్వ పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లు, అద్దె భవనాల్లో కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొంది. ఆయా కేంద్రాల్లోనూ భవనాలకు కిటికీలు, తలుపులు సక్రమంగా లేకపోవడం, కూర్చోవడానికి సైతం సక్రమంగా ఫ్లోరింగ్‌లేక చిన్నారులు అవస్థలు పడుతున్నారు.


రూ.2.62 కోట్లతో ప్రతిపాదనలు..
- వేణుగోపాల్‌, జిల్లా శిశుసంక్షేమశాఖ అధికారి

జిల్లాలో సొంత భవనాల నిర్మాణం, శిథిలావస్థకు చేరిన భవనాల మరమ్మతుల గురించి కలెక్టర్‌ శ్రీహర్ష దృష్టికి తీసుకెళ్లాం. ఆయన ఆదేశాల మేరకు 144 కేంద్రాలకు మరమ్మతులు, వసతుల కల్పన కోసం రూ.2.62 కోట్లతో ప్రతిపాదనలు పంపించాం. నిధులు మంజూరైతే పనులు చేపడతాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని