logo

అందని అభయ హస్తం డబ్బులు

మహిళా సంఘాల సభ్యులకు బీమా భరోసా కల్పించేందుకు చేపట్టిన అభయ హస్తం పథకాన్ని రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం డబ్బులను తిరిగి చెల్లించలేదు.

Published : 01 Jun 2023 04:00 IST

న్యూస్‌టుడే, కొత్తకోట

మహిళా సమాఖ్య సభ్యులు సమావేశం

మహిళా సంఘాల సభ్యులకు బీమా భరోసా కల్పించేందుకు చేపట్టిన అభయ హస్తం పథకాన్ని రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం డబ్బులను తిరిగి చెల్లించలేదు. జిల్లాలో స్వయం సహాయక సంఘాల సభ్యులకు సుమారు రూ.6.29 కోట్లకుపైగా అందాల్సి ఉంది. దీనికోసం ఏళ్ల తరబడి నిరీక్షణ తప్పడం లేదు.

ప్రకటనకే పరిమితం..

ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకు 2009లో అభయ హస్తం పథకాన్ని ప్రవేశ పెట్టింది. నెలనెలా కొంత ప్రీమియం కట్టించుకొంది.  2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎన్నికల హామీగా ప్రభుత్వం నెలకు రూ.2 వేల చొప్పున ఆసరా పింఛన్లు అమలు చేసింది. ఈ క్రమంలో అభయ హస్తం బీమా పథకాన్ని రద్దు చేసిన ప్రభుత్వం.. మహిళా సంఘాల సభ్యులు చెల్లించిన ప్రీమియం డబ్బులు తిరిగి వారి వ్యక్తిగత ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించింది. ఇప్పటి వరకు అది అమలుకు నోచుకోలేదు.

వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటుందని..

స్వయం సహాయక సంఘాల్లో 18 నుంచి 58 ఏళ్ల వయసున్న మహిళలకు మాత్రమే సభ్యులుగా ఉండే అర్హత కల్పించింది. ఆ తర్వాత సంఘం నుంచి తప్పుకోవాల్సింది. అలాంటి వారికి ఆసరా ఉండటం కోసం అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఈ అభయ హస్తం బీమా పథకం చేపట్టింది. ఏటా కొంత మొత్తం ప్రీమియం కట్టించుకొని, 58 ఏళ్ల వయసు తరవాత  నెల నెలా పింఛను అందేలా పథకం రూపొందింది. ఈ క్రమంలో వనపర్తి జిల్లాలో 28,755 మంది మహిళలు ఆరేళ్ల పాటు ఏడాదికి రూ.365 చొప్పున ప్రీమియం చెల్లించారు. వారు చెల్లించిన మొతం రూ.6,29,73,450 ప్రభుత్వ ఖాతాకు జమయ్యాయి. వీటితో పాటు అద]నంగా రూ.20 ప్రీమియం చెల్లిస్తే వారి పిల్లలకు 9, 10వ తరగతులు, ఇంటర్మీడియట్‌లో  ఉపకార వేతనాలు మంజూరు చేసేవారు. సభ్యులు మరణిస్తే బీమా వర్తించేది. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక పాలసీ పునరుద్ధరణ లేకపోవడంతో పలువురు మహిళలు మృతి చెందినా బీమా సొమ్ము అందలేదు.

ఇతర జిల్లాల్లో వచ్చాయి..

జిల్లాలో ప్రీమియం చెల్లించిన మహిళా సంఘాల సభ్యుల బకాయి వివరాలు ప్రభుత్వానికి పంపించాం. కొన్ని జిల్లాల్లో పాలసీదారుల వ్యక్తిగత ఖాతాల్లో డబ్బు జమ చేసినట్లు సమాచారం. అందువల్ల జిల్లాలోని అభయ హస్తం పాలసీదారులు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చెల్లించిన ప్రీమియం డబ్బులు త్వరలోనే జమ అవుతాయని ఎదురు చూస్తున్నాం.

నర్సింహులు, డీఆర్డీవో

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని