logo

ఈ పాపం ఇసుకాసురులదే !

ఇసుకాసురులు సహజ వనరులను దోచుకుని పర్యావరణానికి హాని తలపెట్టడమే కాకుండా ప్రజల ప్రాణాలు కూడా బలి తీసుకుంటున్నారు. ఇదే నెల 11న హన్వాడ మండలం చిర్మల్‌కుచ్చతండాలో ఫిల్టర్‌ ఇసుక తయారీకి తవ్విన నీటిగుంతలో పడి శివ, గణేశ్‌ అనే ఇద్దరు గిరిజన చిన్నారులు మృతిచెందారు.

Published : 26 Jul 2023 04:54 IST

మొన్న చిర్మల్‌కుచ్చతండాలో చిన్నారులు.. నిన్న కొండేడులో ఇద్దరు యువతుల మృత్యువాత

అనూష(పాత), స్వాతి చిన్ననాటి చిత్రం

న్యూస్‌టుడే, జడ్చర్ల గ్రామీణం: ఇసుకాసురులు సహజ వనరులను దోచుకుని పర్యావరణానికి హాని తలపెట్టడమే కాకుండా ప్రజల ప్రాణాలు కూడా బలి తీసుకుంటున్నారు. ఇదే నెల 11న హన్వాడ మండలం చిర్మల్‌కుచ్చతండాలో ఫిల్టర్‌ ఇసుక తయారీకి తవ్విన నీటిగుంతలో పడి శివ, గణేశ్‌ అనే ఇద్దరు గిరిజన చిన్నారులు మృతిచెందారు. ఆ ఘటన మరవక ముందే మరో విషాదం చోటు చేసుకుంది. జడ్చర్ల మండలం కొండేడు గ్రామంలో ఇసుక కోసం తవ్విన గుంతలో పడి నీట మునిగి ఇద్దరు యువతులు అనూష(19), స్వాతి(17) ప్రాణాలు కోల్పోయారు. కొండేడు గ్రామస్థులు తమ పొలాలకు ఊకవాగు(కొండేడు వాగు)లోని  బండల మీదుగా వెళ్తుంటారు. వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తే మరో వైపు నుంచి చుట్టూ తిరిగి పొలాలకు వెళ్తారు. మంగళవారం ప్రవాహం తక్కువగా ఉండటంతో బండ మీదుగా అనూష, స్వాతి దాటే ప్రయత్నం చేశారు. బండపై నాచు వల్ల జారి నీటిలోపడ్డారు. అక్కడే అక్రమ రవాణాదారులు ఇసుక కోసం భారీ గుంత తవ్వారు. గుంత 15 అడుగుల లోతు ఉండటంతో నీట మునిగి మృత్యువాత పడ్డారు. లేదంటే నీటిలో పడినా మళ్లీ లేచి ముందుకు వెళ్లేవారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

ఇద్దరు యువతులు వాగు దాటుతూ జారి పడింది ఇక్కడే


కలిసొచ్చే బిడ్డలు కానరాని లోకాలకు..

అనూష, స్వాతి మృతదేహాల వద్ద రోదిస్తున్న కుటుంబీకులు

కొండేడుకు చెందిన పడకంటి మల్లయ్య, యాదమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అనూష రెండో కుమార్తె. పెద్ద ఆదిరాల పాఠశాలలో పదో తరగతి పూర్తిచేసిన ఆమె చదువు మానేసింది. తల్లిదండ్రులకు ఆసరాగా ఇంటి పనులు, వ్యవసాయ పనులు చేస్తోంది. వారి దాయాదులు పడకంటి కేశవులు, నాగమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. రెండో సంతానమైన స్వాతి జడ్చర్లలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతోంది. ఐదు రోజులుగా స్వాతి వాళ్ల పొలంలో అనూష పనిచేసింది. ఇందుకు బదులుగా మంగళవారం నుంచి అనూష వాళ్ల పొలంలో స్వాతి ఐదు రోజులు పని చేయాల్సి ఉంది. ఇందుకోసం ఇద్దరు కలిసి పొలానికి బయలుదేరారు. అనూష తల్లిదండ్రులు కూలీలను తీసుకొచ్చేందుకు ఇంటి వద్ద ఆగారు. కొంత సమయానికి తండ్రి అనూషకు ఫోన్‌ చేయగా కలవలేదు. అతడికి అనుమానం వచ్చి వెతకగా మార్గమధ్యంలోని ఊకవాగులో రాయిపై పడి ఉన్న భోజనం డబ్బాలు, చెప్పులు కనిపించాయి. నీటిలో గాలించగా 100 మీటర్ల దూరంలో వాగులో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. యువతుల మృతితో రెండు కుటుంబాలు శోకసంద్రంగా మారాయి. తల్లిదండ్రులు, తోబుట్టువులు విలపించిన తీరు గ్రామస్థులను కంటతడి పెట్టించింది. కేసు నమోదు చేసి పోస్టుమార్టం తర్వాత మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించామని సీఐ రమేశ్‌బాబు తెలిపారు. ఘటనా స్థలాన్ని ఎస్పీ కె.నరసింహ పరిశీలించారు. వర్షాకాలంలో వాగులు దాటేటప్పుడు అక్కడి పరిస్థితిని అంచనా వేయాలని, ఈతరాని వాళ్లు నీటిలోకి వెళ్లవద్దని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని