logo

సలేశ్వరం జాతరకు ఏర్పాట్లు

ఏటా చైత్ర పూర్ణిమ నుంచి మూడు రోజుల పాటు నల్లమల కొండల్లో కొలువైన సలేశ్వరం జాతరకు అటవీ పరిసరాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు.

Published : 20 Apr 2024 04:06 IST

22 నుంచి నల్లమల కొండల్లో ఉత్సవాలు 

సలేశ్వర క్షేత్రంలో కొలువుదీరిన లింగమయ్య

అచ్చంపేట న్యూటౌన్‌, న్యూస్‌టుడే : ఏటా చైత్ర పూర్ణిమ నుంచి మూడు రోజుల పాటు నల్లమల కొండల్లో కొలువైన సలేశ్వరం జాతరకు అటవీ పరిసరాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. అమ్రాబాద్‌ అభయారణ్యంలోని ఎత్తైన కొండల నడుమ వెయ్యి అడుగుల లోయలో కొలువైన పురాతన సలేశ్వర క్షేత్ర దర్శనానికి భక్తులు పోటెత్తుతుంటారు. కృష్ణానది నుంచి జాలువారే జలపాతాల అలల మధ్య అటవీ జంతువులు కనువిందు చేస్తూ భక్తులను మరింతగా పరవశింపజేస్తాయి.

 ఈ నెల 22 నుంచి 24 వరకు నిర్వహించనున్న సలేశ్వర లింగమయ్య దర్శన ఘట్టం 200 అడుగుల ఎత్తైన కొండల్లో రాళ్లపై నుంచి కొనసాగుతుంది. ఫర్హాబాద్‌ నుంచి పుల్లయపల్లి చెంచు పెంటల మీదుగా సుమారుగా 30 కిలోమీటర్లు వాహనాల్లో ప్రయాణం సాగించాలి. అక్కడ నుంచి కొండలు, రాళ్ల దారిలో 4 కిలోమీటర్లు నడిచి వెళ్తే క్షేత్రానికి చేరుకుంటారు. సలేశ్వర క్షేత్రానికి ఎదురుగా ఉన్న ఎత్తైన కొండపై జలధారలు పడుతుంటాయి. అనాదిగా ఈ ఆలయంలో చెంచు పెద్దలే పూజారులుగా వ్యవహరిస్తుండటం విశేషం. ఉత్సవాలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కర్నూలు, మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌, రంగారెడ్డి, నల్గొండ, జోగులాంబ గద్వాల, వనపర్తి తదితర ప్రాంతాల నుంచి పర్యాటకులు లక్షలాదిగా తరలి వస్తుంటారు.

 భక్తుల సౌకర్యార్థం ఉమ్మడి మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌ ప్రాంతాలకు చెందిన స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఎండలో అలసిన భక్తులకు అన్నదానం, ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖ అధికారులు తాగునీటి వసతి ఏర్పాటు చేస్తారు. క్షేత్రానికి అచ్చంపేట ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులను నడపనున్నారు.

కొండపై నుంచి జాలువారుతున్న జలపాతం (పాత)

ఆద్యంతం అటవీ మార్గంలోనే..

వాహనాల్లో వెళ్లే పర్యాటకులు హైదరాబాద్‌-శ్రీశైలం ప్రధాన రహదారి అమ్రాబాద్‌ మండలంలోని మన్ననూర్‌ నుంచి 15 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఫర్హాబాద్‌ కూడలి వద్ద అటవీశాఖ అధికారుల అనుమతులతో అడవిలోకి వెళ్లాల్సి ఉంటుంది. క్షేత్రానికి 4 కిలోమీటర్ల దూరంలో వాహనాలను నిలిపేసి రాళ్లు, ప్రమాదకరమైన లోయ ప్రాంతం నుంచి నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని బల్మూర్‌ మండలంలోని అంబగిరి, లింగాల మండలంలోని భక్తులు అప్పాయిపల్లి మీదుగా 30 కిలో మీటర్లు చేరుకుంటే అక్కడ గుండంలో తాగునీటి వసతి ఉంటుంది. అక్కడ కొంత సమయం సేద తీరి మరో 20 కిలో మీటర్లు అడవి దారిలో నడక మార్గంలో వెళ్తే సలేశ్వరం క్షేత్రానికి చేరుకుంటారు.


మూడు రోజులు మాత్రమే అనుమతి..

సలేశ్వరం జాతర నేపథ్యంలో ఈ నెల 22 ఉదయం నుంచి 24 సాయంత్రం వరకు మూడు రోజులు మాత్రమే అడవిలోకి వాహనాలకు అనుమతులు ఉంటాయి. అడవిలో మంటలు ఏర్పాటు చేయడం, ప్లాస్టిక్‌, మత్తు పదార్థాలు పూర్తిగా నిషేధం. అడవిలోకి వెళ్లే భక్తులు, పర్యాటకులు నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని గుర్తించుకోవాలి. రానున్న రోజుల్లో 9 నెలలపాటు ఆంక్షలతో కూడిన సలేశ్వర దర్శనం కల్పించేందుకు చర్యలు చేపడుతున్నాం.

 రోహిత్‌ గోపిడి, డీఎఫ్‌వో నాగర్‌కర్నూల్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని