logo

పాలమూరు పోరు @50

పాలమూరులోని మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల లెక్క తేలింది.

Updated : 30 Apr 2024 06:30 IST

మహబూబ్‌నగర్‌లో 31, నాగర్‌కర్నూల్‌లో 19 మంది అభ్యర్థులు

ఈనాడు, మహబూబ్‌నగర్‌: పాలమూరులోని మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల లెక్క తేలింది. మహబూబ్‌నగర్‌లో 31, నాగర్‌కర్నూల్‌లో 19 మంది బరిలో ఉన్నారు. ఎన్నికల అధికారులు సోమవారం నామపత్రాల ఉపసంహరణ అనంతరం సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే తుది జాబితాను ప్రకటించారు. మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో మొత్తం 42 మంది 72 సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. ఏడుగురి దరఖాస్తులు తిరస్కరించగా మరో నలుగురు తమ పత్రాలను ఉపసంహరించుకున్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 31 మంది పోటీ చేస్తున్నట్లు రిటర్నింగ్‌ అధికారి రవినాయక్‌ ప్రకటించారు. నాగర్‌కర్నూల్‌ పరిధిలో  34 మంది అభ్యర్థులు 53 సెట్ల నామపత్రాలను సమర్పించారు. అందులో 13 తిరస్కరణకు గురి కాగా ఇద్దరు తమ పత్రాలను ఉపసంహరించుకున్నారు.   మొత్తం 19 మంది బరిలో నిలిచినట్లు రిటర్నింగ్‌ అధికారి ఉదయ్‌కుమార్‌ తెలిపారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు రిజిస్ట్రర్‌ పార్టీలకు చెందిన అభ్యర్థులు, స్వతంత్రులు బరిలో నిలిచారు.

 రెండు బ్యాలెట్‌ యూనిట్లు..:  ఒక్క బ్యాలెట్‌ యూనిట్‌లో 16 గుర్తులకే అవకాశం ఉంటుంది. అందులో 15 మంది అభ్యర్థుల గుర్తులు ఒక గుర్తు నోటాకు ఉంటుంది. 15 మంది కంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటే రెండో బ్యాలెట్‌ యూనిట్‌ను ఉపయోగించాల్సిందే. మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ స్థానాల్లో రెండేసి చొప్పున బ్యాలెట్‌ యూనిట్లను ఉపయోగించాల్సి ఉంటుంది. రిటర్నింగ్‌ అధికారులు అదనపు బ్యాలెట్‌ యూనిట్లపై దృష్టి సారించాల్సి ఉంటుంది. గత శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో మొత్తం 6,289 బ్యాలెట్‌ యూనిట్లు, 4,820 కంట్రోల్‌ యూనిట్లు, 4,845 వీవీ ప్యాట్లను కేటాయించారు. శాసనసభ ఎన్నికల్లో రెండు బ్యాలెట్‌ యూనిట్ల అవసరం రాలేదు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో రెండు బ్యాలెట్‌ యూనిట్లు అవసరం రానుండటంతో ప్రత్యేకంగా ఇండెక్స్‌ ప్రతిపాదనలు పెట్టాల్సి ఉంటుంది. ఉమ్మడి జిల్లాలోని రెండు నియోజకవర్గాలకు అదనంగా 7 వేల బ్యాలెట్‌ యూనిట్లు అవసరం అవుతాయి. ఇప్పటికే ఈవీఎంలకు మొదటి దశ ర్యాండమైజేషన్‌ను పూర్తి చేశారు. ఇండెక్స్‌లో పేర్కొన్న బ్యాలెట్‌ యూనిట్లు వచ్చిన తర్వాత వాటికి కూడా ర్యాండమైజేషన్‌ను చేస్తారు. వీటిని భద్రపరచడం, మాక్‌ పోలింగ్‌ నిర్వహించడం, ఓట్ల లెక్కింపు వంటి వాటిపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని