logo

భాజపా అధికారంలోకి వస్తే రాజ్యాంగానికి ప్రమాదం

కేంద్రంలో భాజపా మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగానికి ప్రమాదమని నాగర్‌కర్నూల్‌ భారాస ఎంపీ అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ పేర్కొన్నారు.

Published : 07 May 2024 02:54 IST

నాగర్‌కర్నూల్‌ భారాస ఎంపీ అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌

వనపర్తి పట్టణం, న్యూస్‌టుడే: కేంద్రంలో భాజపా మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగానికి ప్రమాదమని నాగర్‌కర్నూల్‌ భారాస ఎంపీ అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ పేర్కొన్నారు. సోమవారం వనపర్తిలోని ఓ ఫంక్షన్‌ హాలులో మాదిగల ఐక్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన ఆత్మగౌరవ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ చేస్తామని భాజపా హామీ ఇస్తే ఎమ్మార్పీఎస్‌ నాయకులు మద్దతిస్తున్నారన్నారు. మాదిగల ఆత్మగౌరవ సభ ఏ కులానికి వ్యతిరేకం కాదని మాదిగలు రాజకీయంగా ఎదిగి చట్టసభల్లో అడుగుపెట్టాలన్నారు. గురుకులాల కార్యదర్శిగా మాజీ సీఎం కేసీఆర్‌ సహకారంతో ఎంతోమంది పేద విద్యార్థులను ప్రయోజకులను చేశానని పేర్కొన్నారు. మాజీమంత్రి నిరంజన్‌ రెడ్డి మాట్లాడుతూ.. కులమతాలకు అతీతంగా కారు గుర్తుకు ఓటు వేసి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ను గెలిపించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్‌ రెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో భారాస జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్‌, మీడియా కన్వీనర్‌ రంగినేని అభిలాశ్‌రావు, మాదిగ ఐక్య వేదిక నాయకులు మంగి విజయ్‌, గోవర్ధన్‌, ఎంపీపీలు, జడ్పీటీసీలు, పెబ్బేరు పుర ఛైర్‌పర్సన్‌ కరుణశ్రీ, గాయకుడు గిద్దె రాంనరసయ్య పాల్గొన్నారు.

ఖిల్లాగణపురం, (వనపర్తి న్యూటౌన్‌), న్యూస్‌టుడే: సీఎం రేవంత్‌రెడ్డి మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చారని, ప్రజలకు నిజాలు చెప్పి ఓట్లడగుతానని నాగర్‌కర్నూల్‌ భారాస ఎంపీ అభ్యర్థి ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. ఖిల్లాగణపురంలో భారాస ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన గిరిజనుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. గతంలో గెలిచిన ఎంపీలు ఈ ప్రాంత సమస్యలను విస్మరించి విలాసవంతమైన జీవితాన్ని గడిపారని ఆరోపించారు. సమ్మేళనంలో మాజీమంత్రి నిరంజన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్‌రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, భారాస నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఖిల్లాగణపురంలో రోడ్‌షో నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని