logo

ఉల్లి రైతుకు కన్నీరు

ఆరుగాలం కష్టపడి పండించిన ఉల్లి ధరలు తగ్గటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రోజురోజుకు మార్కెట్‌లో ఉల్లి ధరలు పడిపోతుండటంతో రైతులకు పెట్టుబడి కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది.

Published : 07 May 2024 03:19 IST

ధర పడిపోయి తీవ్ర నష్టం

న్యూస్‌టుడే, దేవరకద్ర గ్రామీణం : ఆరుగాలం కష్టపడి పండించిన ఉల్లి ధరలు తగ్గటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రోజురోజుకు మార్కెట్‌లో ఉల్లి ధరలు పడిపోతుండటంతో రైతులకు పెట్టుబడి కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ప్రభుత్వం ఉల్లికి మద్దతు ధర కల్పించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. దేవరకద్ర మార్కెట్‌ యార్డుకు దేవరకద్ర, చిన్నచింతకుంట, మరికల్‌, కోయిలకొండ మండలాల్లో రైతులు పండించిన ఉల్లి విక్రయించేందుకు తీసుకువస్తుంటారు. నెల కిందట క్వింటా ఉల్లికి రూ.3వేల వరకు వచ్చిన ధర ఇప్పుడు సగానికి పడిపోయింది. ఎకరాలో ఉల్లి సాగుకు రైతులు రూ.45వేల వరకు ఖర్చు చేశారు. ఎకరాలో 35 క్వింటాళ్ల వరకు ఉల్లి దిగుబడి వచ్చింది. క్వింటాకు రూ. 1,200 వరకే ధర పలుకుతోంది. ఎకరాలో పండిన పంటకు రూ.42వేలే వస్తోంది. సాగు ఖర్చులు పెరిగినా మార్కెట్‌లో ఉల్లికి మద్దతు ధర లభించకపోవడంతో రైతులు కంటతడి పెడుతున్నారు.


పెట్టుబడి కూడా రాలేదు..

- కొండన్న, గూరకొండ

ఎకటిన్నర ఎకరాలో ఉల్లి సాగుచేశా. రూ.50వేలు ఖర్చు చేయగా 42 క్వింటాళ్ల ఉల్లి పండింది. మార్కెట్‌లో క్వింటా రూ.1,200 చొప్పున విక్రయించడంతో రూ.50,400 ఆదాయం వచ్చింది. పెట్టుబడి కంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ రాలేదు. ప్రభుత్వం ఉల్లి రైతులకు మద్దతు ధర ఇచ్చి ఆదుకోవాలి.


ప్రభుత్వం ఆదుకోవాలి..

- వెంకటేశ్‌, గూరకొండ

ఉల్లి రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలి. గత నెలతో పోల్చితే ఉల్లి ధరలు బాగా తగ్గిపోయాయి. తగినంత సాగునీరు అందక ఉల్లి పంట దిగుబడి సగం పడిపోయింది. మార్కెట్‌లో ధరలు లేకపోవడంతో పెట్టుబడి కూడా రావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని