అర్జీలతోనే సరి..ఆసరా’ ఎప్పుడో?
న్యూస్టుడే, సంగారెడ్డి టౌన్: ఆసరా పింఛనుకు అర్హత వయస్సును కుదిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకునేందుకు ఆగస్టు 31 వరకు గడువు ఇచ్చారు. ఆ తర్వాత అక్టోబరులో మరోసారి మరో అవశమూ కల్పించగా.. మీసేవ కేంద్రాల ద్వారా అర్హులు దరఖాస్తు చేసుకున్నారు. అర్జీలు స్వీకరించినా ఇప్పటి వరకు వీటిపై ఎలాంటి మార్గదర్శకాలు వెలువడలేదు. జిల్లాలో 57-64 ఏళ్ల వారి వివరాలను అధికారులు మొదట ఓటరు జాబితా ఆధారంగా సేకరించారు. ఇదే సమాచారంతో ప్రభుత్వానికి అప్పట్లో సెర్ప్ కార్యాలయానికి నివేదిక ఇచ్చారు.
29వేలకు పైగా దరఖాస్తులు: ఆసరా పథకం కింద ప్రతినెలా పింఛను పొందుతున్న లబ్ధిదారులు జిల్లాలో 1.40 లక్షల మంది ఉన్నారు. దివ్యాంగులకు నెలకు రూ.3,016 చెల్లిస్తుండగా మిగతా వారికి రూ.2,016 చొప్పున అందజేస్తున్నారు. ఇలా ప్రతినెలా రూ.30కోట్లకు పైగా జిల్లాకు విడుదల అవుతోంది. 57ఏళ్ల వయస్సు పైబడిన వారికీ పింఛను మంజూరు కానుండటంతో లబ్ధిదారుల సంఖ్య మరింత పెరగనుంది. 57 సంవత్సరాలకు పైబడిన వారు ఆసరా పింఛనుకు జిల్లా నుంచి 29,695 మంది దరఖాస్తు చేసుకున్నారు. అంచనాకు మించి దరఖాస్తులు రావడం గమనార్హం. అత్యధికంగా జహీరాబాద్ మండలానికి చెందిన 2,544 మంది దరఖాస్తు చేసుకోగా అత్యల్పంగా జిన్నారం మండలం నుంచి 491 మాత్రమే వచ్చాయి. దరఖాస్తుల పరిశీలన తర్వాతే అర్హుల ఎంపిక చేయనున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు రాకపోడంతో అర్హులకు ఎదురుచూపులు తప్పడం లేదు.
కొందరు అనర్హులు సైతం..: వయస్సు 57 ఏళ్లు నిండి ఉండాలి. వార్షిక ఆదాయం గ్రామీణులకు రూ.1.50లక్షలు, పట్టణవాసులు అయితే రూ.2లక్షలు మించకూడదు. మెట్ట అయితే 7 ఎకరాలలోపు, మాగాణి 5 ఎకరాల లోపు ఉండాలి. నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు. ఈ నిబంధనలకు అనుగుణంగా ఉన్న వారే దరఖాస్తు చేయాల్సి ఉండగా అనర్హులు సైతం అర్జీలు ఇచ్చారు. అధికారుల క్షేత్ర స్థాయి పరిశీలనలో ఇలాంటి వారిని గుర్తించి తిరస్కరించే అవకాశాలు ఉన్నాయి.
మార్గదర్శకాలు అందగానే ఎంపిక
-రంగాచార్యులు, ఏపీవో (పింఛన్లు)
57-64 ఏళ్ల వయస్సు వారి నుంచి ఆసరా పింఛనుకు వచ్చిన దరఖాస్తుల్లో అర్హులనే ఎంపిక చేస్తాం. అర్జీలన్నింటినీ పరిశీలిస్తాం. ప్రభుత్వ మార్గదర్శకాలు అందాల్సి ఉంది.