logo

బదిలీలతో మూత... ఏదీ చేయూత

ప్రభుత్వ బదిలీల్లో భాగంగా ఉన్న కొద్దిపాటి సిబ్బంది వేరే ప్రాంతానికి వెళ్లిపోవడంతో చివరకు ఆసుపత్రినే మూసి వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో వ్యాధి నిర్ధరణ పరీక్షలు ఆగిపోయే పరిస్థితి రాగా రోగులకు ఇక్కట్లు తప్పడంలేదు. ఇందుకు

Published : 21 Jan 2022 02:12 IST

బోదకాల వ్యాధి నిర్ధరణ ప్రశ్నార్థకం
న్యూస్‌టుడే, కొడంగల్‌, వికారాబాద్‌ మున్సిపాలిటీ

కొడంగల్‌ పైలేరియా కేంద్రం

ప్రభుత్వ బదిలీల్లో భాగంగా ఉన్న కొద్దిపాటి సిబ్బంది వేరే ప్రాంతానికి వెళ్లిపోవడంతో చివరకు ఆసుపత్రినే మూసి వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో వ్యాధి నిర్ధరణ పరీక్షలు ఆగిపోయే పరిస్థితి రాగా రోగులకు ఇక్కట్లు తప్పడంలేదు. ఇందుకు నిదర్శనంగా  కొడంగల్‌లోని పైలేరియా (బోదకాల) వ్యాధి నిర్ధరణ, పరీక్షల నిర్వహణ కేంద్రంలో నెలకొంది. దీనికి సంబంధించి ‘న్యూస్‌టుడే’ కథనం.

జిల్లా వ్యాప్తంగా ఇదొక్కటే కేంద్రం
వికారాబాద్‌ జిల్లా వ్యాప్తంగా ఒకే ఒక బోదకాల వ్యాధి నిర్ధరణ కేంద్రం కొడంగల్‌ ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఉంది. దీన్ని 1986లో మాజీ ఎమ్మెల్యే దివంగత నందారం వెంకటయ్య కొడంగల్‌కు తీసుకొచ్చారు. ఆప్పట్లో ఒక ఇంట్లో అద్దెగదిలో ఏర్పాటు చేశారు. నాటి నుంచి నేటి వరకు సొంత భవనం లేకుండానే కొనసాగినా చివరకు బదిలీల దెబ్బకు మూత పడాల్సి వచ్చింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈ ప్రాంతంలోనే బోదకాల బాధితులు ఎక్కుగా ఉండటంతో కొడంగల్‌తో పాటు గోకపస్లాబాద్‌లో ఏర్పాట చేశారు. జిల్లాలో ఎక్కడ పైలేరియా కేసులు వచ్చినా కొడంగల్‌కు వచ్చి చికిత్స తీసుకోవాల్సిందే.  

అసలే అరకొర..
కొడంగల్‌ బోదకాల కేంద్రంలో మొత్తం 13 మంది సిబ్బందికిగాను 6 మంది మాత్రమే విధులు నిర్వహించే వారు. ఇందులో 5 మంది ఫీల్డ్‌ వర్కర్లు. వీరిపైన ఒక సుపీరియర్‌ ఫీల్డ్‌ వర్కర్‌ ఉండేవారు. ఈ 5 మంది గద్వాల్‌, నారాయణపేట, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ బదిలీ కావడంతో ఒక్కరు కూడా లేక మూతపడింది. దాదాపు 15 సంవత్సరాలుగా కనీసం ఒక్క పోస్టు కూడా భర్తీ చేయక పోవడంతో నేడు ఖాళీ కావాల్సి వచ్చింది.  


ఉన్నతాధికారులకు నివేదిస్తాం: డాక్టర్‌ రవీందర్‌ యాదవ్‌, క్షయ, బోదకాల వ్యాధి నివారణ జిల్లా అధికారి, వికారాబాద్‌
ఇటీవల 317 ఉత్తర్వుల ప్రకారం సిబ్బందిని ఇతర జిల్లాలకు కేటాయించారు. జిల్లాలో బోదకాల వ్యాధి నిర్ధరణ కేంద్రం కొడంగల్‌, గోకపస్లావాద్‌లోని ఉపకేంద్రం రెండూ సిబ్బంది బదిలీ కారణంగానే మూత పడేదశకు చేరాయి. సమస్యను ఉన్నతాధికారులు నివేదిస్తాం. కొడంగల్‌లో ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఈ కేంద్రం కూడా ఉంది. జిల్లా వ్యాప్తంగా మొత్తంగా 1800 మంది  బోదకాల బాధితులున్నారు. అయితే అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో బోధవ్యాధి నివారణకు మందులు ఉన్నాయి. వీటిని ఉచితంగా పంపిణీ చేస్తారు. రోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.


ఇక్కడే ఎందుకంటే...: దాసప్పయాదవ్‌, విశ్రాంత వైద్యులు, కొడంగల్‌
1974లో బోద వ్యాధి గ్రస్థులపై సర్వే చేసినప్పుడు నారాయణపేట, మద్దూరు, కోస్గి, కొడంగల్‌, అంగడిరైచూర్‌ ప్రాంతాల్లో ఎక్కువగా కేసులు వచ్చాయి. ఇందుకు ప్రధాన కారణం కర్ణాటకలోని ముదేళ్లిలో బోదకాల వ్యాధి బాధితులు అధికంగా ఉన్నారు. ఈ ప్రాంతానికి చెందిన వారు కొడంగల్‌ ఇతర ప్రాంతాలకు వెళ్లడం, బంధువుల ఇళ్లకు రాకపోకలు సాగించేవారు. వారి బోదకాలుపై కుట్టిన క్యూలెక్స్‌ దోమ నీటిలో, మురుగు కాలువలో చేరి గుడ్లు పెట్టివాటి సంతతిని పెంచింది. ఈ దోమలు కుట్టడంతో ఇక్కడా ఆ వ్యాధి బారిన పడి బాధికులు అధికంగా పెరిగారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని