logo

నాయకుల ఉత్సాహం.. వలసలకు ప్రోత్సాహం

ఎన్నికల్లో పైచేయి సాధించాలని ప్రధాన పార్టీలు చేరికలపై దృష్టి పెట్టాయి. ప్రజల్లో పరపతి ఉన్న నియోజకవర్గం, మండల స్థాయి నేతలపై ప్రత్యేకంగా ఫోకస్‌ చేస్తున్నారు.

Published : 26 Apr 2024 01:17 IST

అధికార పార్టీ జోరు
గజ్వేల్‌లో బడా నేతలపై కాంగ్రెస్‌ ఫోకస్‌

న్యూస్‌టుడే, గజ్వేల్‌: ఎన్నికల్లో పైచేయి సాధించాలని ప్రధాన పార్టీలు చేరికలపై దృష్టి పెట్టాయి. ప్రజల్లో పరపతి ఉన్న నియోజకవర్గం, మండల స్థాయి నేతలపై ప్రత్యేకంగా ఫోకస్‌ చేస్తున్నారు. అవతలి పార్టీ మానసిక  స్థైర్యాన్ని దెబ్బతీసేలా చేరికలను నాయకులు ప్రోత్సహిస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ నేతలు స్థానికంగా పెద్ద నేతలను చేర్చుకోవాలని ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నారు. వారితో పాటు ఇతర ఛోటా నాయకులు, అనుచరులూ వస్తారనేది పార్టీ పెద్దల నమ్మకం.

ప్రభావం చూపనుందా?

పార్లమెంట్‌ ఎన్నికల్లో మెదక్‌ అసెంబ్లీ నియోజకవర్గ పరిధి ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్న ఉమ్మడి మెదక్‌ జిల్లా డీసీసీబీ ఛైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి తన అనుచరగణం, ఎనిమిది మంది డైరెక్టర్లు, మాజీ సర్పంచులతో ఇటీవల భారాసను వీడటం సంచలనంగా మారింది. తూప్రాన్‌కు చెందిన డీసీసీబీ మాజీ ఛైర్మన్‌, భారాస సీనియర్‌ నేత గంగుమల్ల ఎలక్షన్‌రెడ్డి సైతం కాంగ్రెస్‌లో చేరారు. మండల స్థాయిలోని మాజీ ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరుగా కారు దిగిపోతున్నారు. గ్రామాల్లో, మండలాల్లో ప్రచారం ముమ్మరం కావాల్సిన ఈ సమయంలో ప్రభావం చూపనుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చిట్టి దేవేందర్‌రెడ్డితోపాటు ఆయన సతీమణి మాధురికి సిద్దిపేట జిల్లాలో పట్టుంది. గతంలో కాంగ్రెస్‌లో ఉండగా డీసీసీబీ ఛైర్మన్‌ పదవి దక్కించుకున్న ఆయన భారాసలో చేరి మళ్లీ అదే పదవిని చేపట్టి కొనసాగుతున్నారు. దంపతులు ఇద్దరూ భారాస పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. ఆమె జడ్పీటీసీ సభ్యురాలిగా, సర్పంచిగా చేశారు.


గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ బల్దియా మాజీ ఛైర్మన్‌ గాడిపల్లి భాస్కర్‌, జగదేవపూర్‌, ములుగు, గజ్వేల్‌ మండలాలకు చెందిన పలువురు నాయకులు హస్తం పార్టీలోకి చేరిపోయారు. అధికంగా అధికార పార్టీవైపు వెళుతుండటంతో భారాస అధినేత చేతిలో ఉన్న గజ్వేల్‌ నియోజకవర్గంపై ఆశలు పెట్టుకోగా వలసలు రాజకీయంగా ఇబ్బంది పెడుతున్నాయి. గజ్వేల్‌ నియోజకవర్గంలో మాజీ మంత్రి హరీశ్‌రావు, స్థానికంగా ఎఫ్‌డీసీ మాజీ ఛైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రచారం కొనసాగుతోంది. భాజపా తరఫున మండల స్థాయి నేతలు ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్‌ నుంచి డీసీసీ అధ్యక్షుడు, గజ్వేల్‌ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి జోరుగా చేరికలను ప్రోత్సహిస్తున్నారు. భారాసపై పైచేయి సాధించి కాంగ్రెస్‌ అధిష్ఠానం వద్ద పేరు తెచ్చుకుంటేనే రాజకీయ భవిష్యత్తు ఉండనుండటంతో ఆయన దూరదృష్టితో వ్యూహం అమలు చేస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. గజ్వేల్‌ నియోజకవర్గంలో మొత్తం 2,74,654 మంది  ఓటర్లున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో భారాసకు 1,11,684 ఓట్లు రాగా భాజపాకు 66,653 వచ్చాయి. కాంగ్రెస్‌కు 32,568 ఓట్లు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఓట్ల కంటే మరిన్ని ఎక్కువగా సాధించాలని భారాస నాయకులు వ్యూహం రూపొందిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని