logo

మెతుకుసీమ గులాబీ జెండా అడ్డా...

మెతుకుసీమ గులాబీ జెండాకు అడ్డా అని... ఈ ఎన్నికల్లోనూ మరోసారి జెండా ఎగరవేస్తామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు.

Updated : 26 Apr 2024 06:39 IST

మాజీ మంత్రి హరీశ్‌రావు

హరీశ్‌రావుతో కలిసి నామినేషన్‌ వేస్తున్న వెంకట్రామిరెడ్డి

మెదక్‌, న్యూస్‌టుడే: మెతుకుసీమ గులాబీ జెండాకు అడ్డా అని... ఈ ఎన్నికల్లోనూ మరోసారి జెండా ఎగరవేస్తామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి గురువారం హరీశ్‌రావుతో కలిసి మరో సెట్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. అంతకుముందు స్థానిక బోధన్‌ చౌరస్తా నుంచి రాందాస్‌ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. వాహనంలో హరీశ్‌రావు, ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి దారి వెంట ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. రాందాస్‌ చౌరస్తాలో కార్నర్‌ మీటింగ్‌ నిర్వహించారు. హరీశ్‌రావు మాట్లాడుతూ.. పదేళ్లలో ఏం అభివృద్ధి చేశారని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారని.. మెదక్‌ పట్టణాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసి ప్రజల ఆకాంక్షను నెరవేర్చామని, ఎంపీ అభ్యర్థికి నామినేషన్‌ వేసేందుకు ఆయనను మెదక్‌కు రప్పించిన ఘనత గులాబీ జెండాదని పేర్కొన్నారు. భెల్‌ 1952లో ఏర్పాటైతే... ఇందిరాగాంధీ హయాంలో ఏర్పాటైందని సీఎం అబద్ధాలు మాట్లాడారని.. సీఎం కుర్చీ గౌరవాన్ని కాపాడాలని సూచించారు. భారాస హయాంలో ఉమ్మడి మెదక్‌ను మూడు జిల్లాలుగా చేసి, వైద్య కళాశాలలను మంజూరు చేశామని, రూ.100 కోట్లతో రైలు తీసుకువచ్చామని గుర్తుచేశారు. హల్దీ, మంజీరా నదిపై చెక్‌డ్యాంలను నిర్మించి.. వేసవిలో కాళేశ్వరం జలాలను అందించామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌ ధరలను, జీఎస్టీ పేరుతో ఉప్పు, పప్పుల ధరలను పెంచిందని.. అలాంటి భాజపాకు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. ఇంటింటికి ఎడ్లు, నిరుద్యోగభృతి, రైల్వేలైన్‌, దవాఖానాను ఇస్తామని చెప్పి రఘునందన్‌రావు మోసం చేశారని విమర్శించారు. కార్యకర్తలకు అండగా ఉంటానని.. కాంగ్రెస్‌ వాళ్లు భయపెట్టినా ఆందోళన చెందవద్దన్నారు.

వాహనం తనిఖీ: నర్సాపూర్‌లో చెక్‌పోస్ట్‌ వద్ద ఎమ్మెల్యే హరీశ్‌రావు వాహనాన్ని ఎన్నికల సిబ్బంది తనిఖీ చేశారు. ఆయన వాహనం దిగి వారికి సహకరించారు.

కార్నర్‌ మీటింగ్‌లో పాల్గొన్న కార్యకర్తలు, ప్రజలు


రూ.100 కోట్లతో ట్రస్టు

అభ్యర్థుల గుణగణాలను చూసి ఓటు వేయాలని అభ్యర్థి వెంకట్రామిరెడ్డి విజ్ఞప్తి చేశారు. రూ.100 కోట్లతో ట్రస్టు ఏర్పాటు చేసి పేదలకు సాయం చేస్తానన్నారు. ఎమ్మెల్యే సునీత మాట్లాడుతూ.. గత పదేళ్లలో ఒక్క ఎకరా పంట ఎండలేదని, నేడు 20 లక్షల ఎకరాల వరకు పొలాలు ఎండిపోయాయని, అకాల వర్షాలకు ఐదు వేల ఎకరాల్లో నష్టం జరిగిందన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ అభ్యర్థి నీలం మధును బలిచేశారని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌ అమలు చేయకపోవడంతో.. ప్రజలు మాజీ సీఎం కేసీఆర్‌ వెంట ఉన్నారని అన్నారు.


బోనాలు, డప్పుచప్పుళ్లు

భారీ ర్యాలీలో బోనాల ఊరేగింపు.. కళాకారుల డప్పుచప్పుళ్లతో సందడి చేశారు. రాందాస్‌ చౌరస్తా వద్ద భారీ గజమాలతో సత్కరించారు. సిద్దిపేట భాజపా సభలో కార్యకర్తలకు ఏసీ, కూలర్లు పెట్టి కూర్చోబెట్టారని, అదే ఎండలో ర్యాలీ చేపట్టడం భారాస కార్యకర్తల పట్టుదల అని హరీశ్‌రావు అన్నారు. ఉద్యమకారులు ఎండకు భయపడరని అన్నారు. కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌, ఎమ్మెల్సీలు శేరిసుభాష్‌రెడ్డి, యాదవ్‌రెడ్డి, జడ్పీ అధ్యక్షురాలు హేమలతగౌడ్‌, ఉపాధ్యక్షురాలు లావణ్యరెడ్డి, నర్సాపూర్‌ మున్సిపల్‌ ఛైర్మన్‌ అశోక్‌గౌడ్‌, మెదక్‌ మున్సిపల్‌ వైస్‌ఛైర్మన్‌ మల్లికార్జున్‌గౌడ్‌, నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్‌, దేవేందర్‌రెడ్డి, మాదాసు శ్రీనివాస్‌, పట్నం మాణిక్యం, కాసుల బుచ్చిరెడ్డి, రాజనర్సు, వేణుగోపాల్‌, భట్టిజగపతి, చంద్రాగౌడ్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు