logo

ధాన్యం విక్రయాలకు నానాపాట్లు

అక్కన్నపేట మండలం గుడాటిపల్లి వద్ద గౌరవెల్లి జలాశయాన్ని నిర్మిస్తున్నారు. అందులో గుడాటిపల్లితో పాటు అనుబంధ గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. జలాశయం పనులు ఇంకా పూర్తికాక పోవడంతో భూములు ఇచ్చిన రైతులు పంటలసాగు

Published : 22 May 2022 02:31 IST

 ఆన్‌లైన్‌లో నమోదు లేదని కొనుగోలుకు నిరాకరణ
 గౌరవెల్లి నిర్వాసిత రైతుల గోస

అక్కన్నపేట మండలం గుడాటిపల్లి వద్ద గౌరవెల్లి జలాశయాన్ని నిర్మిస్తున్నారు. అందులో గుడాటిపల్లితో పాటు అనుబంధ గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. జలాశయం పనులు ఇంకా పూర్తికాక పోవడంతో భూములు ఇచ్చిన రైతులు పంటలసాగు కొనసాగిస్తున్నారు. కొందరు ఆ భూముల్లో సాగు చేస్తున్నారు. మరికొందరు ఇతర గ్రామాల్లో కొనుగోలు చేసిన భూముల్లో పంటలు పండిస్తున్నారు. ఇప్పట్లో పనులు పూర్తయ్యే అవకాశం లేదని భావించిన పలువురు యాసంగిలో వరి వేశారు. గతంలో గ్రామంలో ప్రభుత్వ కేంద్రం ఏర్పాటు చేయగా సుమారు 14 వేల క్వింటాళ్లు విక్రయించారు. ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేస్తారనే ఆశతో అప్పటి కేంద్రం వద్దకు వడ్లు తెచ్చారు. అన్ని గ్రామాల్లో కేంద్రాలను ప్రారంభించిన అధికారులు గుడాటిపల్లిలో మాత్రం ఏర్పాటు చేయలేదు. దీంతో అక్కడ ధాన్యం నిల్వలు అలాగే ఉండిపోయాయి. ఈక్రమంలో కొందరు ప్రత్యామ్నాయ మార్గాల్లో విక్రయించారు.
తక్కువ ధర ఇస్తామంటున్నారు..
ప్రస్తుతం గ్రామంలో సుమారు 50 మందికి పైగా రైతుల వడ్లు ఉన్నాయి. వేరే గ్రామంలోని ప్రభుత్వ కేంద్రంలో విక్రయిద్దామంటే ఆన్‌లైన్‌లో నమోదు లేదని కొనుగోలు చేయడం లేదు. ఉన్నచోట ఎకరాకు 70 బస్తాలకు మించి కొనడం లేదని రైతులు అంటున్నారు. ఇప్పుడు తాము ఏం చేయాలి.. ఎక్కడ విక్రయించాలి. ప్రైవేటు వ్యాపారులను అడిగితే క్వింటాలుకు రూ.1600 మాత్రమే ఇస్తామంటున్నారు. వర్షం పడితే మా పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి సర్వం త్యాగం చేసిన తమను ఇబ్బంది పెట్టడం సరైంది కాదంటున్నారు. ముందే చెబితే ధాన్యాన్ని అక్కడికి తీసుకువెళ్లకుండా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకునేవారమన్నారు.
గతంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో సద్దితింటున్న రైతు పేరు వంకుడోతు చంద్రు. అక్కన్నపేట మండలం గుడాటిపల్లి పరిధి బొంద్యానాయక్‌ తండా. నాలుగు ఎకరాల్లో వరిసాగు చేసి 5 ట్రాక్టర్ల ధాన్యం పండించారు. 25 రోజులు గడుస్తున్నా కొనుగోలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రోజూ సద్దితో పాత కొనుగోలు కేంద్రానికి వెళ్లి పగలంతా ధాన్యాన్ని ఆరబెట్టి, రాత్రి కవర్లు కప్పి ఇంటికి వెళ్తున్నారు. పూర్తిగా ఎండినా ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదు. అధికారులను అడిగితే మీ భూములు గౌరవెల్లి ప్రాజెక్టుకు ఇచ్చారు. ధరణి పోర్టల్‌తో పాటు పంటల సాగు వివరాలు ఆన్‌లైన్‌లో చూపడం లేదు. మీ పేరిట భూమి లేనందున కొనుగోలు చేయమని చెబుతుండటంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఏం చేయాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. ఇది చంద్రు ఒక్కడి సమస్యే కాదు. ప్రాజెక్టుకు భూమి ఇచ్చిన వందలాది మంది సమస్య.

- అక్కన్నపేట (హుస్నాబాద్‌ గ్రామీణం), న్యూస్‌టుడే

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని