logo

జల వృద్ధికి జయహో..

నీటివనరుల పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం ‘అమృత్‌ సరోవర్‌’ పథకానికి శ్రీకారం చుట్టింది. తద్వారా భూగర్భ జలాల వృద్ధితోపాటు సాగు విస్తీర్ణం పెంచే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కార్యాచరణ చేపట్టారు.

Published : 23 May 2022 02:12 IST

‘అమృత సరోవర్‌’ పథకం అమలు
న్యూస్‌టుడే, సంగారెడ్డి అర్బన్‌

హత్నూరలో పూడికతీత పనులు

నీటివనరుల పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం ‘అమృత్‌ సరోవర్‌’ పథకానికి శ్రీకారం చుట్టింది. తద్వారా భూగర్భ జలాల వృద్ధితోపాటు సాగు విస్తీర్ణం పెంచే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కార్యాచరణ చేపట్టారు. ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా జిల్లాలో ఇటీవల పనులు ప్రారంభించారు. ప్రభుత్వ స్థలాలు, అటవీ ప్రాంతంలోనూ చెరువులు అందుబాటులో లేని ప్రాంతాల్లో ఒకటిన్నర ఎకరంలో తవ్వించేందుకు ప్రణాళిక రూపొందించిన నేపథ్యంలో కథనం.

చెరువులు, కుంటల పూర్వవైభవానికి రాష్ట్ర ప్రభుత్వం ‘మిషన్‌ కాకతీయ’ నాలుగు విడతలుగా చేపట్టిన విషయం తెలిసిందే. అయితే చాలా ప్రాంతాల్లో వీటి నిర్వహణ కొరవడి అస్తవ్యస్తంగా మారాయి. పూడిక తీయక కొన్ని, ముళ్ల పొదలు నిండి మరికొన్ని ఆనవాళ్లు కోల్పోయాయి. దీనివ వల్ల నీరు నిలువ ఉండటంలేదు. అదే విధంగా  భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ఈ పరిస్థితిని గమనించి  కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 101 చెరువులను ఎంపిక చేశారు. వీటిల్లో పూడికతీత, కట్ట బలోపేతం, ముళ్ల పొదలు తొలగించడం వంటి పనులు కొనసాగుతున్నాయి. అవసరం ఉన్న చోట తూముల మరమ్మతులకు మెటిరీయల్‌ కాంపొనెంట్‌ కింద పంచాయతీలు, నీటిపారుదల శాఖ భరించాల్సి ఉంటుంది. గుర్తించిన వాటిల్లో 10వేల క్యూబిక్‌ మీటర్ల లోతు తవ్వాలని నిబంధనలు విధించింది. ఇటీవల హత్నూర, కొండాపూర్‌, న్యాల్‌కల్‌ మండలాల్లో పూడికతీత, కట్టల బలోపేతం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. శిఖంలో తవ్విన మట్టిని కట్టకు పోస్తున్నారు. మిగిలి ఉంటే రైతులు తమ పొలాలకు తరలిస్తున్నారు.  కూలీలకు ఒక్కో చెరువుకు 300 నుంచి 500 వరకు పని దినాలు కల్పించేలా లక్ష్యంగా చేయిస్తున్నారు.

ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి: హత్నూర, న్యాల్‌కల్‌, నారాయణఖేడ్‌, జహీరాబాద్‌, నాగల్‌గిద్ద, కంగ్టి ప్రాంతాలపై పథకంలో ప్రత్యేక దృష్టి సారించారు. చెరువులు, కుంటలు తక్కువగా ఉండటం వల్ల ఆయా మండలాల్లో రైతులు సాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భూగర్భ జలాలు లోతుకు పడిపోతున్నాయి. ఈ పరిస్థితి నుంచి బయట పడేందుకు కొత్తగా చెరువులు, కుంటలను తవ్వనున్నారు. దీంతో అదనంగా ఆయకట్టు సాగు చేసే వీలుంటుంది. బోరుబావుల్లో నీటి సమస్య ఉండదు.

ఆగస్టు 15 నాటికి పూర్తి చేసేలా..
ఎంపిక చేసిన నీటి వనరుల పనులు వచ్చే ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించింది. . అదే రోజు గ్రామస్థుల సమక్షంలోనే పూర్తయిన చెరువు, కుంటలపై ఆగస్టు 15న జాతీయ జెండాను ఎగురవేయాలని ఆదేశాలు ఇచ్చినట్లుగా ఆశాఖ వర్గాలు ప్రకటించాయి.

కంది మండలం చిద్రుప్పల్లోని పెద్దచెరువు


విడతల వారీగా చేపడతాం: శ్రీనివాస్‌రావు, డీఆర్‌డీఓ, సంగారెడ్డి
వారం రోజుల నుంచి ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇప్పటికే చెరువులు, కుంటల బలోపేతానికి శ్రీకారం చుట్టాం. విడతల వారీగా పనులు చేపట్టి పూర్తి చేస్తాం. ఉపాధి హామీ కూలీల ద్వారా పూడికతీత పనులు ఇటీవల ప్రారంభించాం. భూగర్భ జలాలు పెంచడమే ప్రధానం లక్ష్యం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని