logo
Updated : 24 May 2022 06:11 IST

బస్సు ఢీకొని.. యువకుడి దుర్మరణం

అన్నకు బైక్‌ కొని తీసుకొస్తుండగా ఘటన

మొయినాబాద్‌, న్యూస్‌టుడే: ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు దేశం కాని దేశం వెళ్లాడు. వారం క్రితమే తిరిగి వచ్చాడు. అన్నకు కొత్త బైక్‌ కొనిపెట్టి తిరిగి ఊరికి వెళుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొని మృతి చెందాడు. మొయినాబాద్‌ ఠాణా ఇన్‌స్పెక్టర్‌ డీకే లక్ష్మీరెడ్డి వివరాల ప్రకారం.. వికారాబాద్‌ జిల్లా ధారూర్‌ మండలం రాజాపూర్‌ గ్రామానికి చెందిన పిచ్చకుంట్ల శ్రీనివాస్‌(29) కొన్ని సంవత్సరాల క్రితం బతుకుదెరువు కోసం దుబాయ్‌ వెళ్లాడు. వారం క్రితమే సొంతూరుకు వచ్చాడు. సోమవారం అన్న నర్సింహులుకు కొత్త ద్విచక్ర వాహనం కొనేందుకు హైదరాబాద్‌ వెళ్లారు. కొత్త వాహనాన్ని శ్రీనివాస్‌ నడుపుకుంటూ గ్రామానికి బయలుదేరగా, అన్న నర్సింలు మరో వాహనంపై వస్తున్నాడు. మొయినాబాద్‌ సమీపంలోని తాజ్‌హోటల్‌ వద్ద వికారాబాద్‌ నుంచి హైదరాబాద్‌ వెళుతున్న ఆర్టీసీ బస్సు వేగంగా వస్తూ ద్విచక్ర వాహనంపై వస్తున్న శ్రీనివాస్‌ను ఢీకొట్టింది. శ్రీనివాస్‌ తలకు బలంగా తాకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుకే వస్తున్న అన్న నర్సింహులు జరిగిన ఘోరాన్ని చూసి తల్లడిల్లిపోయాడు. బోరున విలపించాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. శ్రీనివాస్‌ మరో పదిహేను రోజుల్లో తిరిగి దుబాయ్‌ వెళ్లాల్సి ఉంది.


ఘటనా స్థలిలో వాహనాలు


‘పోచారం’ సందర్శనకు వచ్చిన విద్యార్థి మృతి

హవేలి ఘనపూర్‌ (పాపన్నపేట), న్యూస్‌టుడే: ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వస్తున్న టిప్పర్‌ ఢీ కొట్టడంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన మెదక్‌ జిల్లా హవేలి ఘనపూర్‌ మండలం నాగపూర్‌ గేటు సమీపంలో చోటుచేసుకంది. స్థానిక ఎస్‌ఐ మురళి తెలిపిన వివరాలు.. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం కొండాపూర్‌ గ్రామానికి చెందిన కొండనొల్ల కుమార్‌ (17) ఐటీఐ చదువుతున్నాడు. సోమవారం తన మిత్రుడు అరుణ్‌తో కలిసి పోచారం ప్రాజెక్టు, అభయారణ్యం సందర్శనకు ద్విచక్ర వాహనంపై వచ్చారు. తిరుగు ప్రయాణంలో తమ వాహనంలో పెట్రోల్‌ పోయించేందుకు హవేలి ఘనపూర్‌ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో మెదక్‌ నుండి సర్ధన వైపు ఇసుక కోసం వెళ్తున్న టిప్పర్‌ ముందున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి ఎదురుగా వస్తున్న అరుణ్‌ బైక్‌ను ఢీకొట్టింది. దీంతో ఇద్దరు కింద పడిపోయారు. వెనుక కూర్చున్న కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడున్న వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారొచ్చి క్షతగాత్రులను మెదక్‌ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కుమార్‌ పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి గాంధీకి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్‌ఐ వివరించారు.


వాహనం ఢీకొని వృద్ధుడు మృతి

కల్హేర్‌: రోడ్డుపై ఆరబోసిన ధాన్యం కాపలాకు వెళ్లి.. ఇంటికి తిరిగి వస్తున్న గడ్డమీది మల్లాగౌడ్‌ (74)ను వెనుక నుంచి ద్విచక్ర వాహనం ఢీకొట్టగా.. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మండలంలోని నాగధర్‌ గ్రామానికి చెందిన గడ్డమీది మల్లాగౌడ్‌ (74) నాగధర్‌- క్రిష్ణాపూర్‌ మార్గంలో రోడ్డుపై ధాన్యాన్ని ఆరబోశారు. సోమవారం ఆరబోసిన ధాన్యాన్ని పరిశీలించి తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో సిర్గాపూర్‌ గ్రామానికి చెందిన కుర్మ నగేష్‌ వెనక నుంచి ద్విచక్రవాహనంతో ఢీకొట్టాడు. ఈ ఘటనతో గాయపడిన మల్లాగౌడ్‌ను మియాపూర్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ మృతిచెందారు. మృతిడి కుమారుడు నాగేందర్‌గౌడ్‌ కల్హేర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Read latest Medak News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని