logo

ఆసరా ఆశలు

ఆసరా పథకం ద్వారా అందిస్తున్న పింఛను అభాగ్యుల పాలిట వరంలా మారింది. ఎక్కువ మందికి సాయం అందించాలన్న ఉద్దేశంతో ఆసరా పింఛనుకు అర్హత వయస్సును కుదిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

Published : 10 Aug 2022 01:46 IST

జిల్లాలో 29,695 దరఖాస్తులు
న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌

ఆసరా పథకం ద్వారా అందిస్తున్న పింఛను అభాగ్యుల పాలిట వరంలా మారింది. ఎక్కువ మందికి సాయం అందించాలన్న ఉద్దేశంతో ఆసరా పింఛనుకు అర్హత వయస్సును కుదిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం అర్హులైన వారి నుంచి మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు సైతం స్వీకరించారు. తమకు ఎప్పుడు మంజూరు చేస్తారోనని అర్హులు ఎదురుచూస్తున్నారు. ముఖ్యమంత్రి తాజాగా చేసిన ప్రకటనతో వారి నిరీక్షణ త్వరలో ఫలించనున్న నేపథ్యంలో కథనం.

జహీరాబాద్‌ మండలంలో అత్యధికం
యాభై ఏడు ఏళ్లకు పైబడిన వారు ఆసరా పింఛనుకు జిల్లా నుంచి 29,695 మంది దరఖాస్తు చేసుకున్నారు.  అత్యధికంగా జహీరాబాద్‌ మండలానికి చెందిన 2,544 మంది దరఖాస్తు చేసుకోగా.. అత్యల్పంగా చౌటకూరు మండలం నుంచి 418 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల పరిశీలన తర్వాతే అర్హులను ఎంపిక చేయనున్నారు. ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు అందితేనే అధికారులు ఎంపిక ప్రక్రియ చేపట్టేందుకు వీలుంటుంది.

ఎంపికైతే.. నెలకు రూ.2,016
ఆసరా పథకం కింద ప్రతినెలా పింఛను పొందుతున్న లబ్ధిదారులు జిల్లాలో 1.32 లక్షల మంది ఉన్నారు. దివ్యాంగులకు నెలకు రూ.3,016 చెల్లిస్తుండగా మిగతా వారికి రూ.2,016 చొప్పున అందజేస్తున్నారు. ఇలా ప్రతినెలా రూ.30కోట్లకు పైగా జిల్లాకు విడుదల అవుతోంది. 57ఏళ్ల వయస్సు పైబడిన వారికీ పింఛను మంజూరు కానుండటంతో లబ్ధిదారుల సంఖ్య మరింత పెరగనుంది. ఎంపికైన వారికి నెలకు రూ.2,016 చొప్పున అందనుంది.

పెండింగ్‌ అర్జీలకూ మోక్షం
జిల్లాలో 57-64ఏళ్ల వారితో పాటు సాధారణ పించన్లకు సంబంధించిన దరఖాస్తులు 14,421 పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో వృద్ధులు, వితంతు, ఒంటిరి మహిళలు ఎక్కువ మంది ఉన్నారు. సదరం ధ్రువపత్రాలు పొందిన వారిలో అర్హులైన దివ్యాంగులకు పింఛను కోసం ఎదురు చూస్తున్నారు. వీరితో పాటు గతంలో అనర్హుల పేరుతో పింఛన్లు రద్దయినవారిలో అర్హులను గుర్తించి పునరుద్ధరణకు ప్రతిపాదనలు పంపారు. 624 మంది పింఛన్లు పునరుద్ధరణకు 8 నెలల కిందట ప్రతిపాదనలు పంపగా ఇప్పటి వరకు మంజూరు చేయకపోడం గమనార్హం. తమకు కూడా 64ఏళ్లలోపు వారితో పాటే పింఛను మంజూరు చేయాలని ఆయా కేటగిరీవారు కోరుతున్నారు.

ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం..: రంగాచార్యులు, ఏపీవో, పింఛన్లు
57-64 ఏళ్ల వయస్సు వారి నుంచి పింఛన్ల మంజూరుపై ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు అందాల్సి ఉంది. ఆ తర్వాత ద]రఖాస్తులు పరిశీలించి అర్హుల ఎంపిక ప్రక్రియను చేపడతాం. అర్హులందరికీ ఆసరా పింఛను అందేలా చూస్తాం. సాధారణ పింఛన్ల దరఖాస్తులు, రద్దయిన వాటిలో అర్హుల పింఛన్ల పునరుద్ధణపై ప్రభుత్వం ఆదేశాలుకు అనుగుణంగా ముందుకు సాగుతాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని