logo

రైళ్లు ఆగుతున్నా.. స్టేషన్‌ మూతపడింది!

తూప్రాన్‌కు 2 కి.మీ. దూరంలో ఉన్న బ్రాహ్మణపల్లిలో 1950 కంటే ముందే రైల్వేస్టేషన్‌ను నిర్మించారు. ఇక్కడి దొర కృష్ణారెడ్డి విరాళంగా భూమిని ఇవ్వడంతో స్టేషన్‌ నిర్మించారు. అప్పటి నుంచి కాచిగూడ, సికింద్రాబాద్‌ నుంచి మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ వైపు వెళ్లే ప్యాసింజర్‌ రైళ్లన్నీ ఈ స్టేషన్‌లో నిలిచేవి. వివిధ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు సైతం ఇక్కడ ఆగేవి.

Published : 03 Oct 2022 00:45 IST

న్యూస్‌టుడే, తూప్రాన్‌

చిత్రంలో కనిపిస్తున్నది తూప్రాన్‌ మండలంలోని బ్రాహ్మణపల్లి రైల్వేస్టేషన్‌. ఒకప్పుడు నిత్యం వందలాది మంది ప్రయాణికులతో కళకళలాడుతుండేది. ఇప్పుడది మూతపడగా శిథిలావస్థకు చేరింది. కాచిగూడ నుంచి మహారాష్ట్రలోని నాందేడ్‌కు వెళ్లే ప్రధాన మార్గం ఇది.

తూప్రాన్‌కు 2 కి.మీ. దూరంలో ఉన్న బ్రాహ్మణపల్లిలో 1950 కంటే ముందే రైల్వేస్టేషన్‌ను నిర్మించారు. ఇక్కడి దొర కృష్ణారెడ్డి విరాళంగా భూమిని ఇవ్వడంతో స్టేషన్‌ నిర్మించారు. అప్పటి నుంచి కాచిగూడ, సికింద్రాబాద్‌ నుంచి మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ వైపు వెళ్లే ప్యాసింజర్‌ రైళ్లన్నీ ఈ స్టేషన్‌లో నిలిచేవి. వివిధ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు సైతం ఇక్కడ ఆగేవి. గజ్వేల్‌, సంగారెడ్డి, మెదక్‌, తదితర ప్రాంతాల వారికి ఉపయోగపడేది. నాచారం, యాదగిరిగుట్ట, వర్గల్‌ ఆలయాలకు వెళ్లేందుకు మహారాష్ట్ర భక్తులు ఈ రైలు మార్గాన్నే వినియోగించుకునేవారు. ఆయా ఆలయాలకు భక్తులను చేరవేసేందుకు ఈ రైల్వేస్టేషన్‌ నుంచి ప్రత్యేకంగా బస్సులు సైతం నడిచేవి.

2005 తర్వాత..
మనోహరాబాద్‌తో పాటు మిర్జాపల్లి గ్రామాల్లో రైల్వేస్టేషన్లు ఏర్పాటుచేయడం, 2005లో ఆయా చోట్ల టికెట్‌ కౌంటర్లు నెలకొల్పడంతో ఇక్కడ రద్దీ తగ్గుతూ వచ్చింది. అధికారుల పర్యవేక్షణ లోపం, ఎలాంటి అభివృద్ధి చేపట్టకపోవడంతో ప్రయాణికుల రాక పూర్తిగా తగ్గిపోయింది. కొన్నాళ్లు కాంట్రాక్టు సిబ్బందిని నియమించి టికెట్లు విక్రయించారు. కరోనా తర్వాత ఇప్పటికీ టికెట్‌ కౌంటర్‌ తెరుచుకోలేదు.

రైలు దిగి బయటకు వస్తున్న ప్రయాణికులు

సమస్యలతో సతమతం..
సదరు రైల్వేస్టేషన్‌లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ప్లాట్‌ఫాం కొన్నేళ్ల కిందట నిర్మించింది కావడంతో అది తక్కువ ఎత్తులో ఉంది. వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు రైళ్లు ఎక్కడానికి నానాపాట్లు పడేవారు. స్టేషన్‌ శిథిలావస్థకు చేరింది. కూర్చునే బల్లలు అధ్వానంగా మారాయి. షెడ్డు కూలిపోయే స్థితిలో ఉంది. శౌచాలయాలు, తాగునీటి సౌకర్యం కరవైంది. ఇప్పుడు మూగజీవాలకు నిలయంగా మారింది. ప్రస్తుతం ఈ స్టేషన్‌లో ఏడు ప్యాసింజర్‌ రైళ్లను నిలుపుతున్నారు. స్థానిక ప్రయాణికులు మనోహరాబాద్‌కు వెళ్లి టికెట్‌ కొని ప్రయాణం సాగించాల్సిన దుస్థితి నెలకొంది. ఇక్కడ దిగే వారు భయపడుతూ బయటకు వెళ్తున్నారు.

పూర్వవైభవం తీసుకురావాలి: సత్తిరెడ్డి
ఒకప్పుడు ప్రయాణికులతో కోలాహలంగా ఉండేది. కొన్నేళ్లుగా ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదు. పూర్తిగా స్టేషన్‌ మూతపడింది. ప్రయాణికుల ఇబ్బందులను తెలుసుకొని ఇకనైనా తగు చర్యలు తీసుకొని పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కృషి చేయాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని