logo

గర్భిణులకు వరం తప్పనున్న ఆర్థికభారం

సర్కారు దవాఖానాల్లో వైద్య సేవలు మెరుగవుతున్నాయి. కేసీఆర్‌ కిట్‌ పథకం అమలుతో ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు చేసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు.

Published : 27 Nov 2022 01:47 IST

ఎంసీహెచ్‌కు టిఫా స్కానింగ్‌ యంత్రం

న్యూస్‌టుడే-మెదక్‌: సర్కారు దవాఖానాల్లో వైద్య సేవలు మెరుగవుతున్నాయి. కేసీఆర్‌ కిట్‌ పథకం అమలుతో ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు చేసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తుండటంతో వాటి సంఖ్య పెరుగుతోంది. గర్భిణులు కడుపులో ఉన్న బిడ్డ కదలికలు తెలుసుకోవడానికి ఆతృత పడుతుంటారు. కాగా నిరుపేదలు స్కానింగ్‌ చేయించుకునేందుకు ఆర్థికభారం ఆటంకంగా మారుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వం తాజాగా ప్రభుత్వాసుపత్రుల్లో గర్భిణులకు అవసరమైన టిఫా స్కానింగ్‌ యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. జిల్లాలో మెదక్‌లోని మాతా శిశుసంరక్షణ కేంద్రం(ఎంసీహెచ్‌)కు కేటాయించారు. ఈ మేరకు శనివారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు వర్చువల్‌ పద్ధతిలో సేవలను ప్రారంభించారు.

టిఫా యంత్రం

పేదలకు మరింత ప్రయోజనం

ప్రస్తుతం మారుతున్న ఆహార అలవాట్లలో భాగంగా ప్రతి గర్భిణికి టిఫా స్కానింగ్‌ అనేది అతి ముఖ్యమైనది. గర్భం దాల్చిన 18 నుంచి 22 వారాల మధ్య తప్పనిసరిగా ఈ స్కానింగ్‌ చేయించాలి. తల్లీబిడ్డల సంరక్షణ గురించి అతి ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. ఆయా ఆసుపత్రుల్లో టిఫా స్కానింగ్‌ యంత్రం లేకపోవడంతో బయట చేయించేవారు. ఒక్కో స్కానింగ్‌కు కనీసం రూ.2వేలకు వెచ్చించాల్సి రావడంతో ఆర్థికభారం పడుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రులకు టిఫా యంత్రాలను కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా మంజూరు చేసిన ఈ స్కానింగ్‌ యంత్రాన్ని జిల్లా కేంద్రం మెదక్‌లోని ఎంసీహెచ్‌ ఆసుపత్రికి ఇటీవల వచ్చింది. దీంతో ఆర్థికభారం తగ్గడంతో పాటు సమయం ఆదా అవుతుంది. ఈ సేవలతో పేదలకు మరింత ప్రయోజనం చేకూరుతుంది.

తల్లీబిడ్డల సంరక్షణపై..

టీఫా స్కానింగ్‌ యంత్రంతో గర్భస్థ దశలోని శిశువు అవయవాల ఎదుగుదల, లోపాలను గుర్తించవచ్చని ప్రభుత్వ ఆసుపత్రుల జిల్లా సమన్వయకర్త పి.చంద్రశేఖర్‌ అన్నారు. నేటినుంచి సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఈ స్కానింగ్‌ చేయడానికి 20 నిమిషాల సమయం పడుతుంది. లోపల శిశువు అవయవాలన్నీ ఒక్కొక్కటిగా పరిశీలించి, పరీక్షించి వైద్యుడు నివేదిక ఇస్తారు. పుట్టే బిడ్డలో అంగవైకల్యం తదితర లోపాలు బయటపడతాయి. స్కానింగ్‌లో కనిపించిన సమస్య చిన్నదైతే దానిని తగ్గించడానికి కృషి చేస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని