logo

మేమున్నామని.. శిక్షణ తోడుందని..

పోలీసు కొలువు దక్కించుకునేందుకు ఆసక్తి కలిగిన యువత నిరంతరం తపిస్తుంది. అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు కఠోరంగా శ్రమిస్తుంది. అలాంటి వారికి  పోలీసు శాఖ వెన్నుదన్నుగా నిలుస్తోంది.

Published : 06 Feb 2023 01:57 IST

సిద్దిపేటలో  కొనసాగుతున్న పోలీసు మెయిన్స్‌ తరగతులు

తరగతి గదిలో శిక్షకుడు, అభ్యర్థులు

న్యూస్‌టుడే, సిద్దిపేట: పోలీసు కొలువు దక్కించుకునేందుకు ఆసక్తి కలిగిన యువత నిరంతరం తపిస్తుంది. అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు కఠోరంగా శ్రమిస్తుంది. అలాంటి వారికి  పోలీసు శాఖ వెన్నుదన్నుగా నిలుస్తోంది. పోలీసు నియామకాలకు సంబంధించి ఎప్పుడు ప్రకటనలు వెలువడినా.. మేమున్నామంటూ అండగా ఉంటోంది. ఈ తరుణంలోనే రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు సహకారంతో పోలీసు శాఖ నేతృత్వంలో ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగార్థులకు ప్రాథమిక రాత, దేహదారుఢ్య పరీక్షలకు ఉచిత శిక్షణలు అందించారు. ఆయా వాటిల్లో అర్హత సాధించిన వారితో పాటు ఆసక్తి కలిగిన జిల్లాలోని యువతకు సిద్దిపేట బీజేఆర్‌ భవన్‌ కేంద్రంగా మెయిన్స్‌కు సన్నద్ధం చేస్తున్నారు. గత నెల 25న ప్రారంభమైన తరగతులు.. కొనసాగుతున్నాయి.

గతేడాది నుంచి ప్రారంభం

జిల్లాలో గత ఏడాది ఏప్రిల్‌ నుంచి శిక్షణలు మొదలయ్యాయి. అప్పట్లో 70 రోజుల పాటు ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగార్థులకు సిద్దిపేట, రాజగోపాలపేట, గజ్వేల్‌లో ప్రిలిమినరీ (ప్రాథమిక రాత పరీక్ష)కి 1034 మందికి తర్ఫీదు ఇచ్చారు. అందులో దాదాపు 500 మంది అర్హత సాధించి.. రెండో దశదేహదారుఢ్య పరీక్షకు చేరారు. గత నవంబరులో సిద్దిపేట, గజ్వేల్‌, దుబ్బాక, చేర్యాల పట్టణాల్లో దేహ దారుఢ్య శిక్షణ అందించారు. 532 మంది సద్వినియోగం చేసుకున్నారు. వ్యాయామోపాధ్యాయుల సహకారం సైతం తీసుకుంది. పోలీసు కమిషనర్‌ శ్వేత సహా వివిధ స్థాయిల్లో పోలీసు అధికారులు పర్యవేక్షించారు. ప్రస్తుతం మెయిన్స్‌కు మొత్తం 45 రోజుల పాటు తరగతులు కొనసాగనున్నాయి. జిల్లాకు చెందిన అభ్యర్థులు 200 మంది హాజరవుతున్నారు. అందులో 45 శాతం మహిళలు ఉండటం విశేషం. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉన్నాయి. మధ్యాహ్నం భోజనం, అధ్యయన సామగ్రి అందించనున్నారు.

నిపుణులతో బోధన

ఎస్‌ఐ, కానిస్టేబుళ్ల స్థాయి తుది రాత పరీక్ష (మెయిన్స్‌)కు సిద్ధం చేస్తూ.. రోజువారీగా స్లిప్‌టెస్టులు, వారానికోమారు గ్రాండ్‌ టెస్టు నిర్వహణకు ప్రణాళికలు రూపొందించారు. తెలుగు, ఆంగ్లం, ఆర్థమేటిక్‌-రీజనింగ్‌, తెలంగాణ, భారతదేశ చరిత్ర, సంస్కృతి, తెలంగాణ ఉద్యమం, రాజనీతి, భౌగోళిక, అర్థశాస్త్రం, కరెంట్‌ అఫైర్స్‌, గణితం, ఎథిక్స్‌, తదితర అంశాలపై బోధిస్తున్నారు. భాగ్యకిరణ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన విషయ నిపుణులతో బోధన అందిస్తున్నారు. ఎస్‌ఐ ఉద్యోగార్థులు 59 మందికి సోమవారం నుంచి అదనపు సమయాన్ని కేటాయించనున్నారు.


నమ్మకంతో సాధిస్తా
-రజిత, మర్పడ్గ (కొండపాక)

2018లో పీజీ పూర్తయింది. ప్రసుత్తం ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు సిద్ధమవుతున్నా. మొదటి నుంచి ఉచిత శిక్షణకు హాజరవుతున్నా. గతంలో కానిస్టేబుల్‌ ఉద్యోగానికి ప్రయత్నం చేసి విఫలమయ్యా. ఈసారి కచ్చితంగా సాధిస్తాననే నమ్మకం ఉంది. తరగతులు ఆసక్తిగా సాగుతున్నాయి. ఈ స్థాయి లో శిక్షణ పొందాలంటే రూ.40 వేల వరకు ఖర్చయ్యేది. ఇక్కడ ఉచితంగా అందిస్తున్నందుకు కృతజ్ఞతలు.


ప్రణాళికతో సిద్ధమవుతున్నా
- తిరుపతి, సిద్దిపేట

మాది పట్టణ పరిధి గాడిచెర్లపల్లి ప్రాంతం. ఇంటర్‌ పూర్తయింది. 2018 సంవత్సరంలోనూ ఒకసారి ప్రయత్నం చేశా. పరీక్షల సమయంలో ఆరోగ్యం సరిగా లేక సాధించలేకపోయా. తరువాత పార్ట్‌టైం ఉద్యోగాలు చేశా. గత ఏడాది మొదలైన ఉచిత శిక్షణలకు మొదటి నుంచి హాజరవుతున్నా. తప్పక ఉద్యోగం సాధిస్తాననే నమ్మకం ఉంది. ప్రణాళికతో సిద్ధమవుతున్నా.


క్రమశిక్షణాయుతంగా తరగతులు
- శ్వేత, పోలీసు కమిషనర్‌

క్రమశిక్షణాయుత వాతావరణంలో తరగతులు కొనసాగుతున్నాయి. ఎస్‌ఐ శిక్షణార్థులకు మరింత అదనపు సమయం కేటాయిస్తాం. అభ్యర్థులందరికీ పోలీసు ఉద్యోగంతో పాటు గ్రూప్స్‌నకు ఉపయోగపడేలా తర్ఫీదు అందిస్తున్నాం. ఇప్పటికే ఎంతో మందిని అధిగమిస్తూ రెండు మెట్లు ఎక్కిన యువతీ, యువకులు.. తుది మెట్టు ఎక్కాలనే సంకల్పంతో శ్రమించాలి. చక్కటి అవకాశంగా భావిస్తూ సిద్ధం కావాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని