logo

ఆలిని బలిగొన్న అజాగ్రత్త

అజాగ్రత్తగా నడుపుతున్న కారు అదుపుతప్పి చెట్టుకు ఢీకొన్న ఘటనలో భార్య దుర్మరణం చెందగా, కారు నడుపుతున్న ఆమె భర్త సహా మరొకరు గాయపడ్డారు. భూంపల్లి ఎస్సై గంగరాజు తెలిపిన వివరాల ప్రకారం..

Published : 02 Jun 2023 01:55 IST

కారు చెట్టును ఢీకొని మహిళ దుర్మరణం

దుబ్బాక, న్యూస్‌టుడే: అజాగ్రత్తగా నడుపుతున్న కారు అదుపుతప్పి చెట్టుకు ఢీకొన్న ఘటనలో భార్య దుర్మరణం చెందగా, కారు నడుపుతున్న ఆమె భర్త సహా మరొకరు గాయపడ్డారు. భూంపల్లి ఎస్సై గంగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. రామాయంపేటకు చెందిన దేవుని నర్సింలు వ్యవసాయం చేస్తూ, భార్య, ముగ్గురు పిల్లలతో జీవిస్తున్నారు. గురువారం తన కారులో భార్య పుష్ప, ఆమె సోదరి లక్ష్మితో కలిసి సిద్దిపేట మండలం బూర్గుపల్లి గ్రామ శివారులో జరిగిన వివాహానికి హాజరయ్యారు. తిరిగి కారులో స్వస్థలానికి పయనమయ్యారు. వేగానికి, అజాగ్రత్త తోడవడంతో అక్బర్‌పేట-భూంపల్లి మండలం చిట్టాపూర్‌ గ్రామ శివారులో కారు అదుపుతప్పి, రహదారి కుడి పక్కన చెట్టును బలంగా ఢీకొట్టింది. పుష్ప(44) అక్కడికక్కడే మృతి చెందగా, నర్సింలు, లక్ష్మికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను, 108 సిబ్బంది సిద్దిపేట ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. నర్సింలు పెద్ద కుమారుడు రంజిత్‌రాజ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.


ట్రాక్టరు బోల్తాపడి యువకుడు..

హవేలిఘనపూర్‌, న్యూస్‌టుడే: ట్రాక్టరు బోల్తాపడి ఓ యువకుడు మృతి చెందాడు. హవేలిఘనపూర్‌ పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని కూచన్‌పల్లికి చెందిన లింగాల మహేష్‌ (26), అనూష దంపతులకు పదేళ్లలోపు ఇద్దరు పిల్ల్లలు ఉన్నారు. వ్యవసాయమే జీవనాధారం. గురువారం సాయంత్రం మహేష్‌ పొలాన్ని దున్నేందుకు ట్రాక్టరుకు కల్టివేటర్‌ బిగించి తీసుకెళ్తున్నాడు. పని పూర్తయ్యాక ఇంటికి బయల్దేరాడు. మహబూబ్‌నహర్‌ కాలువ వద్ద ట్రాక్టరు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. వాహనం మీద పడటంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. అనూష ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.


అత్తారింటికి వెళ్తూ.. ఒకరు..

కొండపాక, న్యూస్‌టుడే: ముందున్న కారును వెనుక నుంచి ద్విచక్ర వాహనం ఢీకొని ఒకరు మృతి చెందారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా చిన్నకిష్టాపూర్‌ శివారులో జరిగింది. మల్లన్నసాగర్‌ ముంపు గ్రామం సింగారం ప్రజలు గజ్వేల్‌లోని ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో నివసిస్తున్నారు. వ్యక్తిగత పనికి గాలి గాలయ్య(45) మే 29న ద్విచక్ర వాహనంపై కుకునూరుపల్లిలోని అత్తారింటికి బయలుదేరాడు. చిన్నకిష్టాపూర్‌ శివారులోని రాజీవ్‌ రహదారిపై అడ్డరోడ్డు వద్ద వేగంగా వెళ్తున్న కారు డ్రైవర్‌ బ్రేకు వేశాడు. బైకుతో కారును ఢీకొట్టగా గాలయ్యకు తీవ్రగాయాలయ్యాయి. మెరుగైన వైద్యానికి ములుగు మండలం లక్ష్మక్కపల్లిలోని ఆర్‌వీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ పుష్పరాజ్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.


అనుమానాస్పద స్థితిలో బాలుడి మృతి

అక్కన్నపేట(హుస్నాబాద్‌ గ్రామీణం), న్యూస్‌టుడే: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మల్‌చెర్వుతండా గ్రామ పరిధిలోని నర్సింగ్‌తండాకు చెందిన మూగబాలుడు మాలోతు ఆంజనేయులు(17) అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు ఎస్‌ఐ తాండ్ర వివేక్‌ తెలిపారు. కుటుంబ సభ్యులతో పాటు ఎస్‌ఐ తెలిపిన వివరాలు.. మాలోతు రాజు, లలిత దంపతుల కుమారుడు ఆంజనేయులుకు మాటలు సరిగా రావు. గత నెల 31న తండాలో ఓ వివాహానికి ఆంజనేయులు హాజరయ్యాడు. అక్కడ భోంచేస్తుండగా అదే తండాకు చెందిన ముగ్గురు వ్యక్తులు బాలుడిని బెదిరించారు. అక్కడి నుంచి వెళ్లిన తర్వాత బాలుడు కన్పించలేదు. రాత్రి 10 గంటల వరకు వేచిచూసిన తల్లిదండ్రులు అతని ఆచూకీ కోసం తండాలో వెతికారు. ఆచూకీ లభించలేదు. గురువారం ఉదయం తండా పక్కనే ఉన్న గౌరవెల్లి ప్రాజెక్టు కట్ట కింద చెట్టుకు ఉరివేసుకుని ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అక్కడికి వెళ్లి కిందికి దించి చూడగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. తమ కుమారుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోలేదని, ఎవరో హత్య చేసి చెట్టుకు వేలాడదీసి ఉంటారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తండాకు చెందిన మాలోతు కిషన్‌తో కొంత కాలంగా భూ వివాదం నడుస్తోందన్నారు. ఈ విషయంలో నెల క్రితం కేసులు నమోదయ్యాయన్నారు. ఆ గొడవలను దృష్టిలో ఉంచుకుని తమ కుమారుడిని ఏదైనా చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి కుటుంబాన్ని జడ్పీటీసీ సభ్యురాలు భూక్యా మంగ, సర్పంచి మల్లేశ్‌ పరామర్శించారు.


శుభకార్యానికి వచ్చి.. నీట మునిగి..

జగదేవపూర్‌, న్యూస్‌టుడే: బంధువుల ఇంట పెళ్లి శుభకార్యానికి వచ్చిన ఓ యువకుడు నీట మునిగి మృతి చెందాడు ఈ ఘటన సిద్దిపేట జిల్లా జగదేవపూర్‌లో జరిగింది. గ్రామస్థులు, ఎస్‌ఐ కృష్ణమూర్తి తెలిపిన వివరాలు.. ధూల్మిట్ట గ్రామానికి చెందిన లంబ అశోక్‌ (27) బుధవారం ఇంటి నుంచి బయలుదేరి జగదేవపూర్‌లో పెళ్లికి వెళ్లాడు. ఛాట్లపల్లి స్నేహితులతో కలసి జగదేవపూర్‌ పరిసరాల్లో మద్యం తాగారు. అనంతరం బావి పక్కనే జేసీబీ గుంత నీటిలో కాళ్లూచేతులు కడుక్కునేందుకు దిగారు. నీరు ఎక్కువగా ఉన్న చోట అశోక్‌ వెళ్లి మునిగిపోయాడు. వారెవరికీ ఈత రాదు. కొద్దిదూరంలో వెళ్తున్న స్థానికులకు చెప్పగా వారు వచ్చి చూసేసరికి అశోక్‌ మునిగిపోయాడు. సాయంత్రం అతడి కుటుంబ సభ్యులు స్నేహితులకు ఫోన్‌ చేయగా తీసుకొస్తామని చెప్పారు. మళ్లీ రాత్రి చేయగా వారి నుంచి సమాధానం కరవైంది. బంధువుల ఇళ్లకు వెళ్లాడేమోనని భావించారు. గురువారం ఉదయం గుంత నీటిలో మృతదేహం తేలింది. తండ్రి శివయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


కుటుంబ కలహాలతో మహిళ బలవన్మరణం

న్యూస్‌టుడే, జహీరాబాద్‌ అర్బన్‌: కుటుంబ కలహాలతో ఉరేసుకొని మహిళ ఆత్మహత్యకు పాల్పడినట్లు జహీరాబాద్‌ ఎస్సై శ్రీకాంత్‌ తెలిపారు. మొగుడంపల్లి మండలం సజ్జారావుపేట్‌ తండాకు చెందిన నిర్మలాబాయి(48) కొంతకాలంగా పట్టణంలోని మేస్త్రీ కాలనీలో కుటుంబంతో నివాసముంటోంది. బుధవారం ఇంట్లో జరిగిన గొడవతో మనస్తాపానికి గురై గురువారం తెల్లవారుజామున ఇంట్లోని రేకుల షెడ్డులో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. నిర్మలాబాయి కుమారుడు పవార్‌ కరణ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవ పరీక్షల అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించినట్లు ఎస్సై తెలిపారు.


దాచారంలో యువ రైతు..

బెజ్జంకి, న్యూస్‌టుడే: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని దాచారానికి చెందిన యువరైతు అడుకని నవీన్‌(28) ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్‌ఐ ప్రవీణ్‌ రాజు తెలిపిన వివరాలు.. నవీన్‌కు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. బుధవారం ఉదయం వ్యవసాయ బావి వద్దకు పని ఉందని చెప్పి వెళ్లిపోయాడు. మధ్యాహ్నం ఇంటి నుంచి ఫోన్‌ చేయగా ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఉన్నానని చెప్పాడు. రాత్రి వరకు రాకపోయేసరికి ఫోన్‌ చేయగా స్విచ్చాఫ్‌ వచ్చింది. కుటుంబసభ్యులు, స్థానికులు వెతకగా గ్రామ శివారులోని డంపింగ్‌ యార్డులో ఇనుప పైపుకు చీరతో ఉరి వేసుకొని కనిపించాడు. కుటుంబ సభ్యులు తాకగానే మెడ నుంచి చీర ఊడిపోయి మృతదేహం కిందపడింది. అతడి మృతికి కారణాలు తెలియవని గురువారం ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు