logo

ఆవిష్కరణల కేంద్రం... ఐఐటీ హైదరాబాద్‌ ప్రాంగణం!

ఎప్పటికప్పుడు విద్యా, పరిశోధన, ఆవిష్కరణ రంగాల్లో నాణ్యతను పెంచుకుంటూ ఐఐటీ హైదరాబాద్‌ దూసుకుపోతోంది. ఈనెల 5న నేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌(ఎన్‌ఐఆర్‌ఎఫ్‌) ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో మరోసారి సత్తా చాటింది.

Published : 06 Jun 2023 00:58 IST

ఈనాడు, సంగారెడ్డి: ఎప్పటికప్పుడు విద్యా, పరిశోధన, ఆవిష్కరణ రంగాల్లో నాణ్యతను పెంచుకుంటూ ఐఐటీ హైదరాబాద్‌ దూసుకుపోతోంది. ఈనెల 5న నేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌(ఎన్‌ఐఆర్‌ఎఫ్‌) ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో మరోసారి సత్తా చాటింది. ఇంజినీరింగ్‌ విద్యలో జాతీయ స్థాయిలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. గతేడాది తొమ్మిదో స్థానంలో ఉంది. అన్ని విభాగాల్లో కలిపి 14వ స్థానంలో కొనసాగుతోంది. ఆవిష్కరణల రంగానికి సంబంధించి ఏకంగా మూడో ర్యాంకును దక్కించుకుంది. 2021లో అటల్‌ ర్యాంకింగ్‌ ఆఫ్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ ఆన్‌ ఇన్నోవేషన్‌ ఆచీవ్‌మెంట్స్‌లో ఐఐటీ హైదరాబాద్‌ 7వ స్థానంలో నిలిచింది. ఈసారి ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి చేరడం గమనార్హం. జాతీయ స్థాయిలో విద్యా, పరిశోధన సంస్థల్లో ప్రమాణాలను పెంచేలా కేంద్ర విద్యామంత్రిత్వశాఖ ర్యాంకులను ప్రకటిస్తోంది. తాజాగా ప్రకటించిన ర్యాంకుల్లో ఐఐటీ హైదరాబాద్‌ మెరుగైన స్థానాల్లో నిలిచిందని ఈ మేరకు ఐఐటీ వర్గాలు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నాయి. పరిశోధన విభాగానికి సంబంధించి ఐఐటీ హైదరాబాద్‌ గతేడాది 12వస్థానంలో ఉండగా.. ఈసారి 14వస్థానంతో సరిపెట్టుకుంది. ప్రతిభావంతులైన విద్యార్థులు, ఫ్యాకల్టీని ఆకర్షిస్తూ తమ విద్యాసంస్థ వారందరికీ కలల గమ్యంగా మారిందని ఐఐటీ హైదరాబాద్‌ డైరెక్టర్‌ ఆచార్య బీఎస్‌మూర్తి ఈ సందర్భంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మానవాళికి మరిన్ని మెరుగైన సేవలు అందేలా చూసేందుకు ఇక్కడ ఆవిష్కరణలు సాగుతున్నాయన్నారు. భవిష్యత్తులోనూ మరిన్ని కొత్త లక్ష్యాలను నిర్దేశించుకొని.. వాటిని సాధించేందుకు కృషి చేస్తామన్నారు. ఆలోచనలకు ఆవిష్కరణల రూపం ఇవ్వడం నుంచి ఉత్పత్తులుగా వాటిని మార్కెట్లోకి తెచ్చేందుకు అవసరమైన అన్ని సదుపాయాలు ఇక్కడ ఉన్నాయని ఇన్నోవేషన్స్‌ విభాగం డీన్‌ ఆచార్య ఎస్‌.సూర్యకుమార్‌ తెలిపారు. ఆవిష్కరణల విభాగంలో మూడో స్థానంలో నిలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఫ్యాకల్టీ-విద్యార్థుల నిష్పత్తి, ఆర్థిక వనరుల సద్వినియోగం, పేటెంట్స్‌.. ఈ అంశాలన్నీ దేశంలోనే తొలి పది ఇంజినీరింగ్‌ విద్యాసంస్థల్లో ఐఐటీ హైదరాబాద్‌ను ఒకటిగా నిలిపేందుకు తోడ్పడ్డాయని డాక్టర్‌ సంతోష్‌కుమార్‌ రావి అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని