logo

KCR: కాళేశ్వరం జలాలతో సస్యశ్యామలం

కాళేశ్వరం జలాల సరఫరాతో ఉమ్మడి మెదక్‌ జిల్లాను సస్యశ్యామలం చేస్తున్నామని, హల్దీ, మంజీరా నది పరిధిలో నిర్మించిన చెక్‌డ్యాంలు ఏడాదంతా నీటితో కళకళలాడుతున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు.

Updated : 24 Aug 2023 06:37 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌

నమస్కరిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌

న్యూస్‌టుడే, మెదక్‌, మెదక్‌ అర్బన్‌, మెదక్‌ టౌన్‌, మెదక్‌ రూరల్‌, చేగుంట, పాపన్నపేట, హవేలిఘనపూర్‌: కాళేశ్వరం జలాల సరఫరాతో ఉమ్మడి మెదక్‌ జిల్లాను సస్యశ్యామలం చేస్తున్నామని, హల్దీ, మంజీరా నది పరిధిలో నిర్మించిన చెక్‌డ్యాంలు ఏడాదంతా నీటితో కళకళలాడుతున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. బుధవారం మెదక్‌లో రూ.67.07 కోట్లతో నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని, రూ.38.50 కోట్లతో నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, ఉద్యోగులనుద్దేశించి, చర్చి కాంపౌండ్‌ మైదానంలో జరిగిన ప్రగతి శంఖారావం సభలో మాట్లాడారు.  సంగారెడ్డి జిల్లాలోని సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలను త్వరలో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. సింగూర్‌ ప్రాజెక్టు నీటిని అప్పటి పాలకులు హైదరాబాద్‌కు తరలించి ఉమ్మడి మెదక్‌ జిల్లాతో పాటు, నిజాంసాగర్‌ ప్రాంతాన్ని ఎండబెట్టారని ముఖ్యమంత్రి అన్నారు. కాంగ్రెస్‌, తెదేపా అధికారంలో ఘనపూర్‌ ప్రాజెక్టుకు నీళ్లు కావాలంటే అన్నదాతలు ఆర్డీవో కార్యాలయాల వద్ద ధర్నా చేస్తేనే నీళ్లు ఇచ్చేవారన్నారు. ఘనపూర్‌ ఆనకట్ట పరిధి కాలువల్లో తుమ్మచెట్లు పెరిగి నీళ్లందకపోయేవని, వందేళ్ల చరిత్ర ఉన్న ఆనకట్టను బాగు చేసుకున్నామని, కాలువల ఆధునికీకరణ చేపట్టి, పంటలకు సాగు నీరందిస్తున్నామన్నారు. సింగూర్‌ జలాలను ఉమ్మడి జిల్లాలకు వినియోగించడం వల్ల మెదక్‌, జోగిపేట ప్రాంతాల్లో నీళ్లు పారుతున్నాయని పేర్కొన్నారు.

ప్రగతి శంఖారావం సభకు హాజరైన ప్రజలు

అనతికాలంలోనే పురోగతి

అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్తు అందిస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గతంలో 23 లక్షల పింఛన్లు మాత్రమే ఉండేవని, ప్రస్తుతం 54 లక్షల మంది పింఛన్‌దారులు ఉన్నారని తెలిపారు. కేవలం తొమ్మిదిన్నర ఏళ్లలోనే ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకునే స్థాయికి ఎదిగిందన్నారు. కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ, సచివాలయాలు సరిగా లేవని, 33 జిల్లాలను ఏర్పాటు చేసుకోవడంతో పాటు, 24వ కలెక్టరేట్‌ను ప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు.  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మాట్లాడుతూ.. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాల నిర్మాణంతో అన్ని సేవలు ఒకే చోట లభిస్తాయని అన్నారు. స్నేహపూర్వక రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని, ఉద్యోగులకు ప్రత్యేక ఇంక్రిమెంట్‌, రెండుసార్లు వేతన సవరణ, వీఆర్‌ఏలకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పేస్కేల్‌ అమలు చేయడం, జూనియర్‌ కార్యదర్శుల నియామకంతో పాటు వారి ఉద్యోగాల క్రమబద్ధీకరణ చేపట్టామన్నారు.

రాజకీయ భిక్ష పెట్టారు: పద్మాదేవేందర్‌రెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్‌ తనకు రాజకీయ బిక్షపెట్టారని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. సభలో ఆమె ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. 2001లో జడ్పీటీసీగా, 2004, 2014, 2018లో ఎమ్మెల్యేగా అవకాశం కల్పించారని పేర్కొన్నారు. ఏడుపాయల వద్ద మూడు వంతెనలు నిర్మించామన్నారు. మంత్రులు హరీశ్‌రావు, మహమూద్‌ఆలీ, ప్రశాంత్‌రెడ్డి, ఎంపీలు ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్‌, ఎమ్మెల్యేలు మదన్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, క్రాంతికిరణ్‌, మహిపాల్‌రెడ్డి, మాణిక్‌రావు, నరేందర్‌, ఎమ్మెల్సీలు శేరి సుభాష్‌రెడ్డి, రఘోత్తంరెడ్డి, యాదవరెడ్డి, కార్పొరేషన్‌ ఛైర్మన్లు ప్రతాప్‌రెడ్డి, దేవేందర్‌రెడ్డి, చింతా ప్రభాకర్‌, రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ సునీతారెడ్డి, మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి, ఫారూఖ్‌ హుస్సేన్‌, హేమలత, రోజాశర్మ, మంజుశ్రీ నాయకులు పాల్గొన్నారు.

మదన్‌రెడ్డితో ముచ్చట..

తాజాగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భారాస తరఫున పోటీ చేయనున్న అభ్యర్థులను ప్రకటించిన విషయం విదితమే. ఇందులో నాలుగు స్థానాలను పెండింగ్‌లో ఉంచగా, అందులో నర్సాపూర్‌ ఒకటి. ఇక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ సునీతారెడ్డిలు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో బుధవారం మెదక్‌లో జరిగిన బహిరంగ సభా వేదికపైన మదన్‌రెడ్డిని సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా పిలిచి కాసేపు ముచ్చటించారు. ఇది అక్కడున్న వారందరినీ ఆకర్షించింది. ఏమైనా హామీ ఇచ్చారా, ఏ అంశంపైన చర్చించారా అన్నది తెలియాల్సి ఉంది.

రెవెన్యూ ఉద్యోగులతో త్వరలో సమావేశం

మెదక్‌, న్యూస్‌టుడే: రెవెన్యూ ఉద్యోగులతో రాష్ట్రస్థాయిలో త్వరలో సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. నూతన కలెక్టరేట్‌ భవనం ప్రారంభం సందర్భంగా ఆయనను ట్రెసా ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా సీఎం ట్రెసా నాయకులను పలకరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.నిరంజన్‌, నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు రమణ రెడ్డి, మెదక్‌ జిల్లా అధ్యక్షుడు మహేందర్‌ గౌడ్‌, జిల్లా కార్యదర్శి చరణ్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సైదులు, తహసీల్దార్లు హరదీప్‌ సింగ్‌, జ్ఞానజ్యోతి, జిల్లా కార్యవర్గ సభ్యురాలు ప్రణీత, కిషోర్‌ పాల్గొన్నారు.

వరాలిచ్చి.. భరోసా కల్పించి..

న్యూస్‌టుడే, మెదక్‌, చేగుంట, మెదక్‌ టౌన్‌, రూరల్‌, అర్బన్‌, పాపన్నపేట: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే  అభ్యర్థులను ప్రకటించిన అనంతరం భారాస ప్రగతి శంఖారావాన్ని పూరించింది. బుధవారం చర్చి కాంపౌండ్‌ మైదానంలో నిర్వహించిన సభ విజయవంతం కావడంతో అధికార పార్టీ నేతల్లో ఉత్సాహం నెలకొంది. జిల్లాలో సీఎం పర్యటన ఖరారైన అనంతరం మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ప్రత్యేక దృష్టిసారించారు. మండలాలకు ప్రత్యేకంగా నాయకులకు ఇన్‌ఛార్జిలుగా నియమించి పర్యవేక్షించారు. జిల్లాలోని  మిగతా ఎమ్మెల్యేలు కూడా వారికి నిర్దేశించిన ప్రకారం.. శ్రేణులు, ప్రజలను తరలించారు.  మధ్యాహ్నం రెండు గంటల నుంచే కార్యకర్తలు, నాయకులు, ప్రజలు వాహనాల్లో మెదక్‌కు చేరుకున్నారు. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన స్థలాల్లో వాహనాలను పార్కింగ్‌ చేసి, కాలినడకన సభాస్థలికి చేరుకున్నారు.  

నా బిడ్డ అడిగితే కాదనను..

గత ఎన్నికలప్పుడు నేను ఒక మాట చెప్పాను మీ అందరికి.. మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి నా బిడ్డ... అభివృద్ధి పనులకు నిధులివ్వాలని ఆమె అడిగింది... ఏదీ అడిగినా కాదనే పరిస్థితి లేదు.. గౌరవించి... దీవించి ఆమెను గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించారు.. దాని ఫలితమే కలెక్టరేట్‌, జిల్లా పోలీస్‌ కార్యాలయాల భవనాలు అని సీఎం కేసీఆర్‌ అన్నారు. పద్మాదేవేందర్‌రెడ్డి పనితనం చూసి తిరిగి టిక్కెట్‌ కేటాయించినట్లు, వచ్చే ఎన్నికల్లో ఆమెను రెండింతల మెజార్టీతో గెలిపించాలని సీఎం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మెదక్‌ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దే బాధ్యతను మంత్రి హరీశ్‌రావుకు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. సిద్దిపేట నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చెందిందో, ఆలాగే మెదక్‌ను తీర్చిదిద్దాలని సూచించారు.

జిల్లాకు మేలు కలిగేలా..

మెదక్‌, చేగుంట: మెదక్‌ జిల్లాకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరాల జల్లు కురిపించారు. గ్రామపంచాయతీలకు, పురపాలికలకు నిధులు మంజూరు చేశారు.

రెవెన్యూ డివిజన్‌గా రామాయంపేట

ఏళ్లుగా డిమాండ్‌ చేస్తున్న రామాయంపేటను రెవెన్యూ డివిజన్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి కోరిక మేరకు డివిజన్‌ను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం సాయంత్రం వరకు డివిజన్‌ ఉత్తర్వులు వస్తాయని సభాముఖంగా ప్రకటించారు.

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు

మెదక్‌ ఎమ్మెల్యే కోరిక మేరకు రామాయంపేటలో ప్రభుత్వ డిగ్రీ కళాళాలను ఈ విద్యాసంవత్సరం నుంచే ప్రారంభించనున్నట్లు తెలిపారు. దీనివల్ల విద్యాపరంగా అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు. నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి కోరిక మేరకు కౌడిపల్లిలో సైతం ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు.

పంచాయతీలకు రూ.15 లక్షలు

జిల్లాలోని 469 గ్రామపంచాయతీలకు ఒక్కో దానికి రూ.15 లక్షల చొప్పున సీఎం ప్రకటించారు. వీటితో సర్పంచులు గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. సమస్యలు పరిష్కరించి ముందడుగు వేయాలని చెప్పారు.

పురపాలికకు రూ.50 కోట్లు

మెదక్‌ పురపాలిక అభివృద్ధికి రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం తెలిపారు. నర్సాపూర్‌, రామాయంపేట, తూప్రాన్‌ పురపాలికలకు రూ.25 కోట్లు చొప్పున నిధులు ప్రకటించారు.

మెదక్‌కు రింగ్‌రోడ్డు

మెదక్‌కు బాహ్యవలయ రహదారిని మంజూరు చేశారు. దీంతో మెదక్‌ గణనీయ అభివృద్ధికి ఆస్కారం ఉంటుందని తెలిపారు. మెదక్‌ ఎమ్మెల్యే కోరిక మేరకు దీన్ని మంజూరు చేస్తున్నట్లు చెప్పారు.

ఏడుపాయలకు రూ.100 కోట్లు

ప్రసిద్ధి చెందిన ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు ఇస్తున్నట్లు సీఎం తెలిపారు. టూరిజం ప్యాకేజీలో భాగంగా ఏడుపాయలకు గతంలో రూ.100 కోట్లు కేటాయిస్తానని ప్రకటించామని, త్వరలోనే వాటిని మంజూరు చేస్తామని చెప్పారు. వెంటనే పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని