logo

ఈత కొలను తెరవరా?

సిద్దిపేటలోని ఈత కొలను నిర్వహణ కొరవడుతోంది. నిత్యం కొనసాగించాల్సిన ఈ కొలను.. వేసవి ఆరంభమైన ఇంకా తెరవడం లేదు. ఆరేళ్ల కిందట అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను పాటిస్తూ రూ.5 కోట్ల వరకు ప్రభుత్వ నిధులు వెచ్చించి అందుబాటులోకి తెచ్చారు.

Published : 28 Mar 2024 01:52 IST

మినీ ఈతకొలను

న్యూస్‌టుడే, సిద్దిపేట: సిద్దిపేటలోని ఈత కొలను నిర్వహణ కొరవడుతోంది. నిత్యం కొనసాగించాల్సిన ఈ కొలను.. వేసవి ఆరంభమైన ఇంకా తెరవడం లేదు. ఆరేళ్ల కిందట అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను పాటిస్తూ రూ.5 కోట్ల వరకు ప్రభుత్వ నిధులు వెచ్చించి అందుబాటులోకి తెచ్చారు. కొన్నాళ్లుగా ఆశించినస్థాయిలో కొనసాగకపోవడంతో పట్టణవాసులు నిరాశ చెందుతున్నారు. ఎనిమిది నెలలుగా మూతపడి దర్శనమిస్తోంది.

సీజన్‌లో మాత్రమే: వేసవిలో రోజుకు సగటున 500 మంది వరకు కొలనుకు వస్తున్నారు. కొందరు నేర్చుకుంటుండగా.. మరికొందరు నిత్యం ఆసక్తితో సాధన చేసేవారున్నారు. గంటలు, నెల చొప్పున రుసుము వసూలు చేస్తున్నారు. నిర్వాహక ఏజెన్సీలు కోచ్‌లు, లైఫ్‌ గార్డులు, ఇతర సిబ్బందిని నియమించి నిర్వహించాల్సి ఉంటుంది. కేవలం సీజన్‌లో మాత్రమే తెరిచి ఆ తరువాత వదిలిపెడుతుండటం సమస్యగా మారుతోంది. ఫలితంగా మిగిలిన రోజుల్లో పర్యవేక్షణ కొరవడుతోంది. ఏటా ఇదే పరిస్థితి తలెత్తుతోంది. కాలంతో సంబంధం లేకుండా.. లాభాపేక్ష లేకుండా ప్రభుత్వం కొనసాగిస్తే సత్ఫలితాలు రానున్నాయి. ఆసక్తి కలిగిన క్రీడాకారులకు మెరుగైన శిక్షణ అందించే ఏర్పాట్లు చేయాలనే డిమాండ్‌ స్థానికుల నుంచి వినిపిస్తోంది. తరచూ పోటీలు (టోర్నీ) నిర్వహిస్తూ ప్రోత్సహిస్తే మెరుగైన ఫలితాలు రానున్నాయి. కాలంతో సంబంధం లేకుండా నిత్యం తెరవడం సహా క్రీడాకారులకు అవసరమైన సమయం కేటాయించాలి. ఈ విషయమై జిల్లా యువజన క్రీడల అధికారి నాగేందర్‌ను ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా.. ఈత కొలను ఏప్రిల్‌లో అందుబాటులోకి తెస్తామన్నారు. మరమ్మతులు వేగంగా సాగుతున్నాయన్నారు. ఇబ్బందులు ఎదురవకుండా పర్యవేక్షణ పెంచుతామని వివరించారు.

కాలవ్యవధి ముగియడంతో..: సిద్దిపేటలోని క్రికెట్‌ కీడా మైదానం వద్ద భారీ ఈత కొలను, చిన్నారులకు మరో కొలను అందుబాటులోకి తెచ్చారు. ఆరంభంలో స్థానిక మున్సిపాలిటీ నిర్వహించింది. భారంగా మారడంతో కొన్నాళ్లకు చేతులెత్తేసిందనే విమర్శలు వచ్చాయి. టెండరు ద్వారా ఏజెన్సీలు లేదా ప్రైవేటు వ్యక్తులకు కేటాయిస్తున్నారు. ప్రస్తుతం జిల్లా యువజన క్రీడల శాఖ పర్యవేక్షణలో కొనసాగుతోంది. గత ఏడాది నుంచి జులై వరకు కొనసాగగా.. ఆ తరువాత మూతపడింది. టెండరు కాల వ్యవధి ముగియడంతో తెరవకపోవడంతో అధ్వానంగా మారింది. నీటిని శుద్ధి చేసే యంత్రాలు, ఇతరత్రా చెడిపోయాయి. ఫలితంగా రూ.10 లక్షలకు పైగా ప్రభుత్వ నిధులు వెచ్చించి మరమ్మతులు చేయించాల్సిన పరిస్థితి తలెత్తింది. వాటిని త్వరితగతిన పూర్తి చేసి మరో ఏజెన్సీకి కేటాయించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు మరమ్మతులు కొనసాగుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని