logo

వాడిన విరులూ.. ఆదాయపు సిరులే

అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే సత్ఫలితం ఖాయం. ఈ కోవకే చెందుతారు మెదక్‌ జిల్లా శివ్వంపేట మండలం ఎదుల్లాపూర్‌ గ్రామానికి చెందిన మహిళలు.

Published : 05 May 2024 01:22 IST

ఆలయాల్లో వినియోగించిన పూలను ఎండబెట్టారిలా..

న్యూస్‌టుడే, శివ్వంపేట: అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే సత్ఫలితం ఖాయం. ఈ కోవకే చెందుతారు మెదక్‌ జిల్లా శివ్వంపేట మండలం ఎదుల్లాపూర్‌ గ్రామానికి చెందిన మహిళలు. వాడిన పూలతో అగర్‌బత్తీలు తయారుచేస్తూ స్వయం ఉపాధి పొందుతూ ఆదాయాన్ని ఆర్జిస్తుండటం విశేషం. గ్రామంలో ఇటీవల సెహగల్‌ ఫౌండేషన్‌ స్వచ్ఛంద సంస్థ గ్రామంలో స్వయం ఉపాధి పొందే తీరుపై అవగాహన కల్పించింది. అందుబాటులో ఉన్న వనరులు, అవకాశాలను సంస్థ ప్రతినిధులు వివరించారు. దీంతో గ్రామానికి చెందిన భూరెడ్డి పెద్ద పద్మ, చిన్న పద్మ, లావణ్య, కల్పనలు అడుగు ముందుకేశారు. వినియోగించిన పూలతో అగర్‌బత్తీలను తయారు చేసేందుకు ముందుకొచ్చారు.

అగర్‌బత్తీలు తయారుచేస్తూ..

సంస్థ సహకారంతో..: సదరు మహిళలకు సెహగల్‌ ఫౌండేషన్‌ అన్ని రకాలుగా సహకారం అందించేందుకు ముందుకొచ్చింది. రూ.1.50 లక్షలు ఇవ్వగా.. నలుగురు కలిసి రూ.1.20 లక్షలు జమచేసుకున్నారు. వీటితో అగర్‌బత్తీలు తయారీ యంత్రం, ముడి సరకులు కొనుగోలు చేసి కుటీర పరిశ్రమ తరహాలో ఏర్పాటుచేసుకున్నారు. అగర్‌బత్తీల తయారీ విధానంపై మహిళలకు సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు. రెండు నెలల కిందట తయారీని షురూ చేశారు.

ఆలయాల్లో వినియోగించిన పూలతో..: ఈ మహిళలు ముందుగా మండలంలోని ఆలయాల్లో దేవుళ్లకు వినియోగిస్తున్న పూలను సేకరిస్తున్నారు. చిన్నగొట్టిముక్ల పరిధిలోని చాకరిమెట్ల సహకార ఆంజనేయ స్వామి, శివ్వంపేటలోని బగలాముఖి శక్తిపీఠం తదితర ఆలయాల నుంచి వినియోగించిన పూలను తీసుకొస్తున్నారు. వాటిని బాగా ఎండబెట్టి పొడిగా మారుస్తున్నారు. ఎలాంటి రసాయనాలు వాడకుండా అగర్‌బత్తీలను యంత్రం సాయంతో తయారుచేస్తున్నారు. వీటి విక్రయానికి సెహగల్‌ ఫౌండేషన్‌ సహకారం అందిస్తోంది. ప్రస్తుతం స్థానికంగా విక్రయిస్తున్నారు. త్వరలోనే యాదగిరిగుట్ట, ఇతర పెద్ద ఆలయాల్లో విక్రయించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ విషయమై సెహగల్‌ ఫౌండేషన్‌ ప్రతినిధి వేమ నారాయణ మాట్లాడుతూ.. మహిళలు ముందుకు వస్తే సంస్థ ద్వారా ఉపాధి మార్గాలు చూపించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని