logo

పూత రాలి.. తెగుళ్లు పెరిగి

మామిడికి ఏటా తెగుళ్ల బెడద పట్టిపీడిస్తోంది. నవంబర్‌, డిసెంబర్‌లో చలి తీవ్రత, తేనె మంచు, బూడిద, నల్లతామర తెగుళ్ల సమస్య ఉంటోంది.

Published : 05 May 2024 01:37 IST

తగ్గిన మామిడి దిగుబడి

మెదక్‌ మండల పరిధిలో కాపులేని మామిడి తోట

మెదక్‌ టౌన్‌, న్యూస్‌టుడే: మామిడికి ఏటా తెగుళ్ల బెడద పట్టిపీడిస్తోంది. నవంబర్‌, డిసెంబర్‌లో చలి తీవ్రత, తేనె మంచు, బూడిద, నల్లతామర తెగుళ్ల సమస్య ఉంటోంది. దీంతో ఈసారి మామిడి దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. దీనికి తోడు దళారుల బెడద రైతులను వేధిస్తోంది. అందువల్ల సాగు రైతులతో పాటు కౌలుదారులు రూ.లక్షల్లో నష్టపోతున్నారు. మొదటిదశ పూతకు సంబంధించిన కాయలు తెంపడం కొనసాగుతోంది. మలి విడత కాయలను మరో పక్షం రోజుల్లో కోయనున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వపరంగా మామిడి కొనుగోలు చేపట్టి దళారుల నుంచి నష్టం రాకుండా చూడాలని రైతులు సంబంధిత అధికారులను, ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

జిల్లా వ్యాప్తంగా 2500-3000 ఎకరాల్లో మామిడి తోటలు సాగవుతున్నాయి. సాగులో మొదటి దశలో వివిధ తెగుళ్లతో కొంతమేర పూత, పిందెలు రాలిపోయాయి. వాతావరణ పరిస్థితులను తట్టుకొని నిలిచిన పూతకు సంబంధించి రైతులు ముందు జాగ్రత్తలు తీసుకోవడంతో కొంతమేర దిగుబడులు వచ్చాయి. మొదటిదశ పూత ద్వారా కాసిన కాయలు ప్రస్తుతం తెంపుతున్నారు. ఇంకో వారం, పది రోజుల్లో ఇవి పూర్తికానున్నాయి. రెండో దశ పూతలో తెగుళ్లు తట్టుకొని దాదాపు 60 శాతం నిలవడంతో ప్రస్తుతం వాటి కాయలు ఉన్నాయి. ఇవికూడా మరో 15 రోజుల్లో తెంపనున్నారు.

దళారుల ఇష్టారాజ్యం

ప్రస్తుతం మార్కెట్‌లో మామిడి కిలోకు రూ.80-90 పలుకుతోంది. జిల్లాలో తక్కువ విస్తీర్ణంలో సాగవుతున్న పంట కావడంతో ఏటా హైదరాబాద్‌తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటారు. కానీ ఈ ఏడాది కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో సైతం దిగుబడులు తక్కువగా ఉండడంతో ఇప్పట్లో ధరలు తగ్గే అవకాశం లేదు. మరోవైపు మామిడి రైతులకు దళారుల బెడద తప్పడం లేదు. వీరు నిర్ణయించిన ధరకే విక్రయించాలి. లేకపోతే కొనుగోలు చేసేవారు లేకుండా పోతారని రైతులు వాపోతున్నారు.


రూ.20 లక్షల పెట్టుబడి పెట్టాం

- సాయిలు, కౌలు రైతు, వ్యాపారి

గత 15 ఏళ్ల నుంచి పండ్ల వ్యాపారం చేస్తున్నాను. రెండేళ్ల నుంచి పలు రకాల తెగుళ్ల కారణంగా మామిడి దిగుబడి తగ్గింది. ఈ ఏడాది అయినా ఆశించిన స్థాయిలో దిగుబడి వస్తుందని మెదక్‌-కామారెడ్డి జిల్లాలో రూ.20 లక్షలు పెట్టుబడి పెట్టి 40 ఎకరాల మామిడి తోటలను కౌలుకు తీసుకున్నాం. కానీ తేనె మంచు తెగుళ్ల వల్ల పూత రాలిపోయి కాత తగ్గింది. ఇప్పుడే కోతలు ప్రారంభించగా, ఆశించిన స్థాయిలో దిగుబడి రావడం లేదు. ఈ ఏడాది సైతం నష్టపోయే అవకాశాలు ఉన్నాయి.


అవగాహన కల్పించాం

- నర్సయ్య, జిల్లా ఉద్యానశాఖ అధికారి

తెగుళ్లు పూతను తినేస్తున్న విషయం తెలియగానే పలు మామిడి తోటలను సందర్శించి రైతులకు తగు సూచనలు చేశాం. పూత దశలో వచ్చే తెగుళ్ల నివారణకు ఉద్యానశాఖ అధికారులు చెప్పే సూచనలు పాటించాలి. సాధారణంగా పూసిన పూతలో 90శాతం రాలిపోగా మిగిలిన 10శాతమే కాయలు కాస్తాయి. కానీ ఈ ఏడాది కేవలం 2శాతం పూత మాత్రమే మిగలడంతో దిగుబడి తగ్గింది. జిల్లా వ్యాప్తంగా 90 వేల టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని